AP: ఆంధ్ర ప్రదేశ్‌లో అదే అరాచకం... రైతులపై వైసీపీ ఉక్కుపాదం

AP: ఆంధ్ర ప్రదేశ్‌లో అదే అరాచకం... రైతులపై వైసీపీ ఉక్కుపాదం


ఆంధ్ర ప్రదేశ్‌లో అదే అరాచకం కొనసాగుతోంది. రాజధాని కోసం రోడ్డెక్కిన అమరావతి రైతులపై ఉక్కు పాదం మోపి.. విపక్ష నేతలు సభలు..సమావేశాలు పెట్టకుండా ఉక్కిరిబిక్కిరి చేసి.. పోలీసులతో అడ్డుకుంటూ నిరంకుశంగా వ్యవహస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. దళిత యువకుడిని చంపిన కేసులో జైలుకు వెళ్లి కండిషన్‌ బెయిల్‌పై బయటకొచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు బహిరంగ సభకు మాత్రం అనుమతి ఇచ్చేసింది. అనంతబాబును వైసీపీ నుంచి సస్పెండ్‌ చేసినా... ఆయన వైసీపీ ఎమ్మెల్సీగానే ఇప్పటికే రంపచోడవరంలో ఒక సభ నిర్వహించారు. తాజాగా మరో బహిరంగ సభ పెట్టేందుకు సిద్ధమయ్యారు.

ఈ నెల 9న కూనవరంలో చేపడుతున్న బహిరంగ సభకు అనుమతించవద్దంటూ దళిత, ఆదివాసీ, స్థానిక సంఘాలు వ్యతిరేకించినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. సాక్షాత్తూ కూనవరం పోలీసు మైదానంలో బహిరంగ సభ నిర్వహించేందుకు అనంతబాబు తన అనుచురులతో ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఏజెన్సీలో దళితులు, ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. సున్నితమైన పరిస్థితి ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. బెయిల్‌పై బయట ఉన్న వ్యక్తి సభకు అనుమతి ఇవ్వరాదు అనేది లేదు కదా అంటూ పోలీసు ఉన్నతాధికారులే అంటుండంతో.. దళిత సంఘాల నేతలు ఆశ్చర్యపోయారు. అనంతబాబు కళ్లలో ఆనందం చూసేందుకు అధికార యంత్రాంగం ఇంతలా చేస్తుందా..? అని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రంపచోడవరం నియోజకవర్గాన్ని తన అనధికార సామ్రాజ్యంగా మార్చుకున్న అనంతబాబు.. తన డ్రైవర్‌గా పని చేస్తున్న దళిత యువకుడి హత్య కేసులో జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి దాదాపు ఏడాదిగా నియోజకవర్గంలో లేరు. దీంతో మళ్లీ తన పట్టు నిలుుపుకునేందుకు ఇప్పటికే రంపచోడవరంంలో సభ నిర్వహించారు. ఇప్పుడు తనకు అంతగా పట్టులేని చింతూరు డివిజన్‌లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధపడుతున్నారు. అందుకోసం కూనవరంలోని పోలీసు మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. డివిజన్‌ పరిధిలోని చింతూరు, వీఆర్‌ పురం, కూనవరం, ఎటపాక మండలాల నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేసేందుకు అనంతబాబు తన మనుషులకు టార్గెట్‌ పెట్టినట్లు చెబుతున్నారు. ఈ సభకు కచ్చితంగా రావాలంటూ డ్వాక్రా సంఘాల మహిళలకు వాలంటీర్లతో హెచ్చరికలు సైతం జారీ చేయించినట్లు తెలుస్తోంది.

అనంతబాబు తన వద్ద పని చేసే దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను కిరాతకంగా హత్య చేసి, ఆ మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన అరాచకంపై దళితులు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. ఈ దారుణంపై వారిలో ఆందోళన అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నిందితుడే సభ పెట్టడం ద్వారా తననెవరూ ఏమీ చేయలేరనేలా రాష్ట్రంలోని దళితులందరికీ సవాల్‌ చేయడమే అవుతుందంటున్నారు. ఇది ప్రజాందోళనకు దారి తీస్తుంది. కాబట్టి వెంటనే అనంతబాబు బహిరంగ సభకు అనుమతి రద్దు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దళితుడైన సుబ్రహ్మణ్యంను చంపి డోర్‌ డెలివరీ చేసి, షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్న అనంతబాబుకు ఏజెన్సీలో బహిరంగ సభ పెట్టడానికి ప్రభుత్వం, పోలీసులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తున్నారు. హంతకులను, రౌడీలను తయారు చేయడానికే ప్రభుత్వం పని చేస్తోందా అని నిలదీస్తున్నారు. ఏజెన్సీ సంపదను తన అనుచరుల ద్వారా దోచుకుంటున్న అనంతబాబుకు ఇక్కడ సభ పెట్టే అర్హత లేదని స్పష్టం చేస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామంటున్న వైసీపీ ఇప్పుడు మళ్లీ అతడిని ఎలా పార్టీలోకి ఆహ్వానించిందని.. ఆ పార్టీ తరఫున అతనెలా సభ ఏర్పాటు చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story