శివసేన ఇప్పుడు సోనియా సేనగా మారింది : కంగనా రనౌత్‌

శివసేన ఇప్పుడు సోనియా సేనగా మారింది : కంగనా రనౌత్‌

శివసేన పార్టీపై నటి కంగనా రనౌత్‌ విమర్శల దాడి కొనసాగుతుంది. ఎన్ని నోర్లు మూయిస్తారు.. ఎన్ని స్వరాల్ని అణగదొక్కుతారు.. ఎంతకాలం నిజం నుంచి దూరంగా పారిపోతారంటూ కంగనా రనౌత్ శివసేన నేతల్ని ప్రశ్నించింది. అంతేకాకుండా శివసేన ఇప్పుడు సోనియా సేనగా మారిందంటూ ట్వీట్ చేసింది. ఎన్నికల్లో పరాజయం అనంతరం శివసేన సిగ్గు లేకుండా.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి సోనియా సేనగా మారిందని విమర్శించింది.

బీఎంసీ అధికారులు కూల్చివేసిన తన కార్యాలయాన్ని సందర్శించింది కంగనా. అక్కడి శిథిలాలను చూసి ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆఫీస్ కూల్చివేత తరువాత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ఈ రోజు నా ఇల్లు కూల్చివేయబడిందని, మీ అహంకారం రేపు విరిగిపోతుందని అన్నారు. అటు.. కంగనా రనౌత్‌ కార్యాలయాన్ని BMC అధికారులు కూల్చివేసిన కేసులో బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు వర్గాల వాదనలు విన్న కోర్టు.. కేసును సెప్టెంబర్‌ 22కి వాయిదా వేసింది.

కంగనా బీజేపీ లేదా ఆర్పీఐలో చేరుతానంటే తాము స్వాగతిస్తామని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే తెలిపారు. ముంబైలోని ఆమె ఇంటికి కేంద్రమంత్రి పరామర్శించారు. సినిమాల్లో నటించేంత వరకు రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని కంగనా అన్నట్లు అథవాలే చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం తనకు లేదని ఆమె చెప్పిందన్నారు. అయితే సమాజంలో ఐక్యత కోసం పనిచేస్తానని కంగనా తెలిపిందని అథవాలే అన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రౌత్‌లతో ఓ కీలక సమావేశం నిర్వహించారు. కంగనా దూకుడును ఎదుర్కోవడానికి మనమూ దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదని సమావేశంలో పవార్.. ఠాక్రేకి సూచించారు. అసలు కంగనాను పట్టించుకోకపోవడం ఉత్తమం అని.. అనవసరంగా విషయాన్ని పెద్ద చేసుకోవద్దని చెప్పారు. అయితే.. ఉద్దవ్ ఠాక్రే మాత్రం పవార్‌తో విభేదించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఒక పద్దతి ప్రకారం టార్గెట్ చేస్తోందని అన్నారు ఠాక్రే. కంగనా లాంటి వాళ్లను పావులుగా ఉపయోగించి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఇక.. కరనా రనౌత్‌కు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా కంగనాకు హీరో విశాల్ తన మద్దతును ప్రకటించాడు. డియర్ కంగన... నీ గట్స్‌కు, ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్ అని.. నీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఒక ప్రభుత్వాన్ని నీవు ఎదుర్కొంటున్నావని ప్రశంసించాడు.

Tags

Read MoreRead Less
Next Story