Jagapathi Babu: అభిమానం, ప్రేమ కంటే ఆశ ఎక్కువైందంటూ విచారం

Jagapathi Babu: అభిమానం, ప్రేమ కంటే ఆశ ఎక్కువైందంటూ విచారం
అభిమాన సంఘాలకు నాకు సంబంధం లేదు.. తేల్చేసిన హీరో

హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్నాడు టాలీవుడ్ సీనియర్‌ నటుడు జగపతిబాబు. అయితే ఇప్పుడు ఆయన ఇకపై అభిమాన సంఘాలు, ట్రస్టుతో తనకు ఎటువంటి సంబంధం ఉండదని ప్రకటించారు. అభిమానం పేరిట తాను ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ వేదికగా కొందరు అభిమానుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

గత 33 ఏళ్లుగా అభిమానులు తన కుటుంబంగా, శ్రేయోభిలాషులుగా తన ఎదుగుదలకు కారణమయ్యారని జగపతిబాబు గుర్తు చేసుకున్నారు. తనూ అభిమానుల కష్టసుఖాల్లో తోడుగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అభిమానుల ఇబ్బందులు తనవిగా భావించి వారికి అండగా నిలిచానన్నారు. అయితే, కొంతమంది మాత్రం అభిమానం కంటే తన నుంచి ఆశించడం ఎక్కువైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానం పేరిట తాను ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. అభిమానులంటే ప్రేమ ఇచ్చేవాళ్లని మనస్ఫూర్తిగా నమ్మా. కానీ, బాధాకరమైన విషయం ఏంటంటే.. కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించటం ఎక్కువైంది. నన్ను ఇబ్బందిపెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు. మనసు అంగీకరించకపోయినా బాధతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇకపై అభిమాన సంఘాలు, ట్రస్టుకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తేల్చి చెప్పారు. అయితే, తనపై ప్రేమ కురిపించే అభిమానులకు మాత్రం ఎప్పుడూ తోడుగా ఉంటానని పేర్కొన్నారు.


అయితే, జగపతిబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం తెలియరాలేదు. అభిమానం పేరుతో తనని ఎవరో మోసం చేసి ఉంటారని, అందుకే జగపతిబాబు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారనేలా.. కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జగపతిబాబు షేర్ చేసిన లేఖ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘గుంటూరు కారం’, ‘సలార్‌’ వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. జగపతి బాబు ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. సలార్ సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా సందడి చేయబోతోన్నాడు. సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలోనూ విలన్‌గా నటించాడు. కానీ ఆ చిత్రం అంతగా ఆడలేదు. డిజాస్టర్ కావడంతో అంత గుర్తింపు రాలేదు.

Tags

Read MoreRead Less
Next Story