మళ్లీ టాటాల చేతికి ఎయిరిండియా.?

మళ్లీ టాటాల చేతికి ఎయిరిండియా.?

ఎయిరిండియా కొనుగోలుకు టాటా గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసింది. 1932లో టాటాలే ఎయిరిండియాను స్థాపించారు. అంతేకాదు.. జెఆర్డీ టాటా స్వయంగా తొలి విమానాన్ని నడిపారు. ఎయిరిండియాతో టాటాల అనుబంధం విడదీయలేనిది. అయితే 1953లో ఎయిరిండియాను జాతీయీకరించడంతో టాటాలు వైదొలిగారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఎయిరిండియా నడుస్తోంది. అయితే కొంతకాలంగా ఎయిరిండియా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. దీంతో అప్పటి నుంచి ఎయిరిండియాను అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా కొనుగోలుకు పలు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

ఎయిరిండియా కొనుగోలుకు సోమవారంతో ఆసక్తి వ్యక్తీకరణ గడువు ముగిసింది. దీంతో టాటా గ్రూప్ ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తూ సమాచారం అందించింది. అంతేకాదు.. అమెరికాకు చెందిన ఇంటరప్స్ సైతం ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఎయిరిండియా కొనుగోలుకు ఉద్యోగుల సంఘం కూడా ఇంట్రస్ట్ కనబరిచినట్లు సమాచారం. మరి వీరిలో ఎవరికి ఎయిరిండియా దక్కుతుందనేది ఆసక్తికరం.

దేశీయంగా అతిపెద్ద విమాన సర్వీసు ఎయిరిండియా. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విమానాశ్రయాల్లో ఎయిరిండియాకు ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు కూడా ఉన్నాయి. దీంతో ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ అత్యంత ఆసక్తి కనబరుస్తోంది. టాటా‌గ్రూప్ కు ఇప్పటికే సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విస్తారా ఎయిర్ లైన్స్ లో 51శాతం వాటా ఉంది. అలాగే.. మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియాలో మెజారిటీ వాటా కలిగి ఉంది. ఇప్పుడు ఎయిరిండియాను కూడా కైవసం చేసుకోగలిగితే ప్రపంచంలోని అతిపెద్ద విమాన నెట్ వర్క్ లలో ఒకటిగా నిలిచిపోతుంది. అయితే ఎయిరిండియా కొనుగోలు తర్వాత విస్తారా, ఎయిర్ ఏషియాలను కూడా ఇందులో విలీనం చేస్తుందా..? ఇందుకు ఆయా వాటాదార్లు అంగీకరిస్తారా.. అనేది తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story