లోన్ యాప్‌లకు కళ్లెం.. ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్

లోన్ యాప్‌లకు కళ్లెం.. ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్
అధిక వడ్డీలు వసూలు చేస్తూ, వేధింపులకు గురించేస్తుండడంతో పలువురు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు వెలుగు చూశాయి.

ఆన్‌లైన్ రుణాల పేరుతో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న యాప్‌లకు ఆర్‌బీఐ కళ్లెం వేసింది. అధిక వడ్డీలు వసూలు చేస్తూ, వేధింపులకు గురించేస్తుండడంతో పలువురు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు వెలుగు చూశాయి. వీటిని నిరోధించేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

డిజిటల్ రుణ సంస్థలపై అధ్యయనం కోసం ఓ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది ఆర్బీఐ. ఈ సంస్థలపై చేపట్టాల్సిన నియంత్రణ చర్యలతో పాటు డిజిటల్ రుణ వితరణను సక్రమరీతిలో అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యల్ని ఈ వర్కింగ్ గ్రూప్ సూచిస్తుంది. డిజిటల్ మాధ్యమాల ద్వారా ఆర్ధిక రంగంలో అభివృద్ధిని వేగవంతం చేయడం స్వాగతనీయం. అయితే అదే సమయంలో పలు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని, ఇందుకు తగినట్లు నియమ నిబంధనలను రూపొందించాలని ఆర్బీఐ రెండు రోజుల క్రితం ఒక ప్రకటనలో పేర్కొంది.

రుణానికి సంబంధించిన యాప్‌లపై ఆర్బీఐ జోక్యం చేసుకోవడంతో గూగుల్ ఇండియా సైతం పలు యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ప్లేస్టోర్‌లో రివ్యూ చేసిన వివిధ లోన్ యాప్స్ పైన గూగుల్ చర్యలు తీసుకుంది. ప్రభుత్వ హెచ్చరికలు, రివ్యూల అనంతరం 30 యాప్స్ స్థానిక చట్టాలను, యూజర్ ప్రైవసీని ఉల్లంఘించినట్లు గూగుల్ గుర్తించింది. దీంతో ఆ యాప్స్ పైన నిషేధం విధించింది. ఇందుకు అనుగుణంగా వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

తొలగించబడిన యాప్స్‌లో లేజీ పే, క్యాష్ గురు, టెన్ మినిట్స్ లోన్, రూపీ క్లిక్, ఫైనాన్స్ బుద్ద వంటి వివిధ యాప్స్ ఉన్నాయి. కొన్ని లోన్ యాప్స్ యూజర్ సేప్టీ పాలసీలను ఉల్లంఘించినట్లు గుర్తించి వెంటనే ప్లే స్టోర్ నుంచి తొలగించామని, మరిన్ని యాప్స్ డెవలపర్లకు వివరణ కోసం నోటీసులు ఇచ్చామని, వివరణ రాకుంటే ప్లే స్టోర్ నుండి తొలగిస్తామని గూగుల్ ఇండియా తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story