Hyderabad Real Estate: ఆకాశహార్మ్యాలు.. అన్నివైపులా అమ్మకాలు

Hyderabad Real Estate: ఆకాశహార్మ్యాలు.. అన్నివైపులా అమ్మకాలు
Hyderabad Real Estate: గృహరుణ వడ్డీ రేట్లు తగ్గడంతో రుణాలు తీసుకుని అపార్ట్‌మెంట్లు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే సిద్దంగా ఉన్న ఇళ్లు, కొత్త ప్రాజెక్టుల్లో ప్లాట్లు, వెంచర్లలో స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

గత ఏడాది మిగిల్చిన చేదు జ్ఞాపకాల పొరను చీల్చుకుని ముందుకు సాగుతోంది దేశం. కొద్ది నెలల క్రితం వరకు మందకొడిగా సాగిన రియల్టర్ రంగం ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటుంది. స్థిరాస్థి కొనుగోళ్లకు ఆసక్తి చెందుతున్న నగరవాసులకు సొంత ఇంటి కల నెరవేరుతోంది. గృహరుణ వడ్డీ రేట్లు తగ్గడంతో రుణాలు తీసుకుని అపార్ట్‌మెంట్లు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు.

ఇప్పటికే సిద్దంగా ఉన్న ఇళ్లు, కొత్త ప్రాజెక్టుల్లో ప్లాట్లు, వెంచర్లలో స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఓఆర్ఆర్ బయట పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండడంతో రియాల్టీ మార్కెట్లో సానుకూలత నెలకొంది. ఉప్పల్‌వైపు పోచారంలో మైక్రోసాప్ట్ సంస్థ కార్యాలయాన్ని విస్తరిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

విజయవాడ జాతీయ రహదారి, బెంగళూరు జాతీయ రహదారివైపు లాజిస్టిక్ పార్కులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా మరికొన్ని వేర్వేరు దశల్లో ఉన్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్ నగరానికి ఉత్తరాది నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరిగాయి.

ఇక ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు కంపెనీల విస్తరణతో చుట్టూ పది కిలోమీటర్ల వరకు గృహనిర్మాణం ఊపందుకుంది. కొండాపూర్, కోకాపేట్, రాయదుర్గం, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లోని నివాసాలకు డిమాండ్ పెరిగింది. కోవిడ్ కారణంగా ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులు ఎక్కువ కావడంతో వీరికి అనుకూలంగా ఉండేందుకు డబుల్ బెడ్ రూమ్ స్థానంలో 2.5 పడగ గదుల నిర్మాణం జరుగుతోంది.

శంషాబాద్ వైపూ నివాసాలు వెలుస్తున్నాయి. అత్తాపూర్, అరాంఘర్ దాటి జల్‌పల్లి వైపు విస్తరిస్తోంది. అప్పా జంక్షన్ ఐటీ కేంద్రానికి దగ్గరలో ఉండడం ఈ ప్రాంతంలో నిర్మాణాలు పెరిగాయి. బండ్లగూడ జాగీర్, కిస్మత్‌పుర, అప్పా వరకు అభివృద్ధి విస్తరించింది.

కొంపల్లి వైపు, సికింద్రాబాద్ చుట్టు పక్కల 15 కిలోమీటర్ల వరకు నివాస ప్రాంతాలు విస్తరించాయి. మౌలాలి, తిరుమలగిరి, ఈసీఐఎల్, సైనిక్ పురి, ఏఎస్‌రావు నగర్, కొంపల్లి శామీర్‌పేట, కాప్రా వరకు బహుళ అంతస్థుల నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయి. ఓఆర్ఆర్ ఐటీ ఉద్యోగులకు కలిసి వచ్చే అంశం.

ఎల్‌బి నగర్, కూకట్‌పల్లి, ఉప్పల్ వైపు మెట్రో రవాణా అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది ఇటువైపు దృష్టి పెడుతున్నారు. ఆదిభట్ల, తుక్కుగూడ, ప్రగతి నగర్, నిజాంపేట, బాచుపల్లి, మియాపూర్, మదీనా గూడ, చందానగర్, లింగంపల్లి, బీరంగూడ దాటి అమీర్ పూర్ వరకు నివాస కేంద్రాలు అభివృద్ధి చెందాయి.

Tags

Read MoreRead Less
Next Story