ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాపై జియో ఫిర్యాదు

ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాపై జియో ఫిర్యాదు

రిలయెన్స్, జియోను బహిష్కరించాలంటూ రైతులు ఇచ్చిన పిలుపు జియో మరియు ఎయిరిటెల్, వొడాఫోన్-ఐడియాకు మధ్య చిచ్చు రాజేస్తోంది. రైతులు ఇచ్చిన పిలుపుతో తమ సబ్ స్కైబర్లను బలవంతంగా లాక్కునేందుకు ఎయిర్ టెల్, వొడాఫోన్-ఇండియా ప్రయత్నిస్తున్నాయని జియో ఆరోపించింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ట్రాయ్ కు విజ్ఞప్తి చేసింది.

తమ సబ్ స్రైబర్లను అన్యాయంగా లాక్కొంటున్నాయంటూ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలపై రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ టెలికామ్ రెగ్యులేటర్ అథారిటీ-ట్రాయ్ కి ఫిర్యాదు చేసింది. తాము రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నామంటూ జియ్ సబ్ స్కైబర్లను అక్రమంగా తమ వైపు మళ్లించుకుంటున్నాయని తెలిపింది. మొబైల్ నెంబర్ల పోర్టబిలిటీకి ప్రయత్నిస్తున్నాయని వెల్లడించింది. అయితే జియో ఆరోపణలను ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా కొట్టిపారేశాయి. అవన్నీ నిరాధార ఆరోపణలని ఖండించాయి.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు.. రిలయెన్స్, జియో ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీంతో పంజాబ్ సహా ఉత్తర భారతదేశంలో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా ఉద్యోగులు జియో కస్టమర్లను తమ నెట్ వర్క్ లకు మారేలా తప్పుదోవ పట్టిస్తున్నారని రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ వెల్లడించింది.

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా వ్యవసాయం రిలయెన్స్, అదానీ లాంటి కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రిలయెన్స్ రిటైల్ ఇప్పటికే రైతులకు తక్కువ ధర ఇచ్చి ఎక్కువ లాభాలను ఆర్జిస్తోందని ఆరోపించారు. ఇప్పుడీ చట్టాలు తోడైతే రిలయెన్స్ రీటైల్ లాంటి వాటిని ఎదుర్కోవడం కష్టమనేది రైతులు చెప్తున్నమాట. అలాంటి భయాలు అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా రైతులు పట్టించుకోవడం లేదు. దీంతో రిలయెన్స్ రీటైల్ తో పాటు జియోపై రైతుల ఆందోళనల ప్రభావం నేరుగా పడుతోంది.

ఇప్పుడు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాపై జియో ఫిర్యాదు చేయడంతో టెలికాం కంపెనీల మధ్య పోరు తారస్థాయికి చేరింది. జియో ఆరోపణలపై ఎయిర్ టెల్ ఘాటుగా స్పందించింది. కొంతమంది తమ పబ్బం గడుపుకునేందుకు ఎంతటి నీచమైన ఆరోపణలకైనా దిగజారుతారని ఎయిర్ టెల్ దుయ్యబట్టింది. వొడాఫోన్ ఇండియా కూడా జియో ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని తోసిపుచ్చింది.

Reliance Jio complains to TRAI


Tags

Read MoreRead Less
Next Story