ఆరుపదుల వయసులో అమ్మానాన్నలకో 'ఇల్లు'.. అన్నీ అందులోనే..!

ఆరుపదుల వయసులో అమ్మానాన్నలకో ఇల్లు.. అన్నీ అందులోనే..!
చదువులు, ఉద్యోగాల పేరుతో పిల్లలెక్కడో ఉంటున్నారు. అమ్మానాన్న, అత్తమామలను ఊళ్లో ఒంటరిగా ఉంచాలంటే భయం. అలాగని తమతో తీసుకెళ్లలేని పరిస్థితి.

చదువులు, ఉద్యోగాల పేరుతో పిల్లలెక్కడో ఉంటున్నారు. అమ్మానాన్న, అత్తమామలను ఊళ్లో ఒంటరిగా ఉంచాలంటే భయం. అలాగని తమతో తీసుకెళ్లలేని పరిస్థితి. అక్కడ ఉన్నా ఒంటరిగానే ఉండాలి. అదేదో ఇక్కడే మాబోటి వాళ్లమధ్యనే ఉంటే మాకు కాలక్షేపం అవుతుందనే వారికోసం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇళ్లు నిర్మిస్తున్నారు. రిటైర్మెంట్ హోమ్స్ పేరిట వస్తున్న ఈ ఇళ్లలో అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. అందులో ఉండే అందరూ తమ వయసు వారే కావడంతో వారికి సంబంధించిన కబుర్లతో కాలక్షేపం అయిపోతుంది. పెద్దల అవసరాలకు, అభిరుచులకు తగ్గట్టు ఈ ప్రాజెక్టులు తీర్చిదిద్దుతున్నారు.

వారాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగ సమయాల్లో కీర్తనలు, భజనలు, ఎవరిదైనా పుట్టినరోజో, పెళ్లి రోజో అయితే దానికి సంబంధించిన హడావిడి.. ఇలా ఒకటేమిటి ప్రతి రోజూ పండగ వాతావారణం ఈ రిటైర్మెంట్స్ హోమ్స్ ప్రత్యేకత. ఆ వయసులో వారికి కావలసిన ఆనందము, ఆరోగ్యము అక్కడ దొరుకుతుంది. బిడ్డలు దూరంగా ఉన్నారన్న బాధ వారిని వెంటాడదు. ఇలాంటి గృహాలను పన్నెండేళ్ల క్రితమే హైదరాబాద్‌కు పరిచయం చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.

నగరం నలువైపులా ఇలాంటి ప్రాజెక్టులు ముందు ముందు మరిన్ని వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ కంపెనీ ఇప్పటికే ఈసీఐఎల్‌కి దగ్గరలో ఈ తరహా ప్రాజెక్టు నిర్మించింది. ప్రస్తుతం గౌడవల్లిలో నిర్మిస్తోంది. నిర్మాణంలో ఉన్నప్పుడే వారి అవసరాలకు తగ్గట్టు నిర్మిస్తారు. వీల్ చెయిర్ ఈజీగా వెళ్లేందుకు వెడల్పాటి రోడ్లు, బాత్‌రూమ్స్, లిప్ట్ ఉంటాయి. బాత్రూమ్, కారిడార్లు, హాల్‌‌లో గ్రాబ్ బార్స్, అత్యవసర సమయాల్లో వినియోగించే ప్యానిక్ బజర్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టులో కేవలం 30 శాతం మాత్రమే నిర్మాణం జరుపుతారు. మిగిలిన 70 శాతం ఓపెన్ స్పేస్, చెట్లు ఉంటాయి. ఇంకా ఇందులో రెస్టారెంట్, ఏసీ, డైనింగ్ హాల్ కూడా ఉంటుంది. ఈ ప్లాట్స్ లో అన్నీ పెద్దల అవసరాలే వసతులుగా ఉంటాయి.

పచ్చని చెట్ల మధ్య స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ కూర్చోడానికి వీలుగా బెంచీలు, యోగా, మెడిటేషన్ హాల్, లైబ్రరీ ఉంటాయి. ఇంకా ప్రతి బ్లాక్‌లో ప్రత్యేకంగా నర్స్, అంబులెన్స్, అటెండర్ అందుబాటులో ఉంటారు. నివాసితులు వారి అభీష్టం మేరకు డైనింగ్ హాల్‌కు వచ్చి భోజనం చేయవచ్చు లేదా ప్లాట్‌లోనే చేస్తామంటే అక్కడికే భోజనం పంపిస్తారు. ఇంట్లో పనులకు ప్రత్యేకించి పనిమనుషులు ఉంటారు. 24 గంటలూ సీసీ కెమెరాల నీడలో కట్టుదిట్టమై భద్రత ఉంటుంది. ఇంట్లో పిల్లలతో పాటు ఉన్నా తలా ఒక ఫోన్ పట్టుకుని కూర్చునే ఈ రోజుల్లో ఇలాంటి ఇళ్లలో ఉంటే పెద్ద వయసు వారికి ఆనందం, ఆరోగ్యం.

Tags

Read MoreRead Less
Next Story