వర్షాకాలం.. ఇంటి కొనుగోలుకు సరైన సమయం

వర్షాకాలం.. ఇంటి కొనుగోలుకు సరైన సమయం
బేరం చేయడానికి ఉత్తమ సమయం.. తగ్గిన డిమాండ్ కారణంగా కొనుగోలుదారులు అమ్మకందారులతో మంచి ఒప్పందాలు చేసుకోగలుగుతారు.

జోరున వర్షం పడుతుంటే.. అక్కడేదో కొత్త వెంచర్ వెలుస్తోంది.. చూసొద్దాం రమ్మంటాడేంటని మీ ఫ్రెండ్‌ని విసుక్కోకండి. నిజానికి ఇంటి ఎంపికకు వర్షాకాలమే సరైన సమయమని అంటున్నారు రియల్టీ నిపుణులు. ఎందుకంటే వర్షాలు పడుతున్న సమయంలోనే ఇంటి నిర్మాణ నాణ్యత తెలుస్తుంది. ఆ ప్రాంత పరిస్థితి క్షుణ్ణంగా అర్థమవుతుంది.

నగరం ఏదైనా వానొస్తే మోకాల్లోతు నీళ్లలో నడవాల్సిందే. మరి శుభమా అని అన్ని లక్షలు పోసి కొనుక్కున్న ఇంటి చుట్టూ నీరు ఏ మేరకు నిలిచి ఉంది.. వానొస్తే ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది. మీ కొనుగోలు చేయాలనుకున్న ఇంటి ప్రాంతంలోని వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతుంది. ఇంటి నుంచి బస్టాండ్‌కు, రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది వంటి విషయాలు తెలుస్తాయి.

వానాకాలంలోనే ఇంటి నాణ్యత బయటపడుతుంది. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులో కొనుగోలు చేసే కొనుగోలుదారులు మాత్రం వానాకాలంలో ఇంటి నాణ్యత చెక్ చేసుకోవడం ఉత్తమం. వర్షాకాలంలో ప్రాజెక్టులోని లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లోని వాష్ రూమ్, సీలింగ్, ప్లంబింగ్, డ్రైనేజీ లీకేజీ వంటివి తెలుస్తాయి. ఆయా లోపాలను సవరించమని డెవలపర్‌ను ముందుగానే కోరొచ్చు.

రీసేల్ ప్రాపర్టీస్‌ను కొనేవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా పై విషయాలన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకి పోయే ఏర్పాటు ఏమైనా ఉందా లేదా తెలుస్తుంది.

ఇక వర్షాకాలంలో రాయితీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలంలో ఇంటి కొనుగోలుకు తక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. కాబట్టి ఇల్లు కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్లని డెవలపర్లు వదులుకోరు. ధర విషయంలో బేరసారాలు మాట్లాడే వీలుంటుంది. రాయితీలు, ఇతర ప్రత్యేక వసతుల విషయంలో డెవలపర్లతో చర్చించవచ్చు. పైగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు పండుగ సీజన్ కావడంతో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక రాయితీలతో అమ్మకాలను ప్రకటిస్తుంటారు డెవలపర్లు.

Tags

Read MoreRead Less
Next Story