R P Patnaik: ఆ సినిమా వల్లే మ్యూజిక్ చేయడం ఆపేసాను: ఆర్ పి పట్నాయక్

R P Patnaik: ఆ సినిమా వల్లే మ్యూజిక్ చేయడం ఆపేసాను: ఆర్ పి పట్నాయక్
ఒకప్పటి ప్రేక్షకుల మ్యూజిక్ టేస్ట్‌కు, ఇప్పటి ప్రేక్షకుల మ్యూజిక్ టేస్ట్‌కు చాలా వ్యత్యాసం ఉంది.

R P Patnaik: ఒకప్పటి ప్రేక్షకుల మ్యూజిక్ టేస్ట్‌కు, ఇప్పటి ప్రేక్షకుల మ్యూజిక్ టేస్ట్‌కు చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు మాస్ బీట్లు లేని మెలోడీ మ్యూజిక్‌ను ఆడియెన్స్ ఎక్కువ ఇష్టపడేవారు. అలాంటి మ్యూజిక్‌ను వారికి అందించి వందకు వంద శాతం మార్కులు కొట్టేసిన సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్(R P Patnaik). ప్రేమకథలకు ఈయన అందించిన సంగీతం పెద్ద ప్లస్‌గా నిలిచేది. తేజ లాంటి దర్శకులు పట్నాయక్ సంగీతం నచ్చి వారితోనే మళ్లీ మళ్లీ సినిమాలు తీసేవారు. ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి ఒకప్పటి ఛార్మింగ్ హీరోలకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన ఘనత పట్నాయక్ సొంతం.

తెలుగులోనే కాదు కన్నడలో కూడా పట్నాయక్ సంగీతానికి విపరీతమైన క్రేజ్ ఉండేది. అలాంటి ఆయన కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే సంగీతాన్ని వదిలేస్తున్నట్టు ప్రకటించారు. దానికి కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో ఎన్నో పుకార్లు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ పుకార్లు అన్నింటికి చెక్ పెడుతూ పట్నాయక్ ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. 2004 లో విడుదలయిన నేనున్నాను చిత్రానికి సంగీతం అందించడానికి ముందుగా ఆర్ పీ పట్నాయక్‌ను సెలక్ట్ చేసింది మూవీ టీమ్.

రెండు పాటలకు ట్యూన్‌లు అందించడం పూర్తయిన తర్వాత యూఎస్ టూర్ కోసం పట్నాయక్ బ్రేక్ తీసుకున్నారు. ఇదంతా నిర్మాతలకు ముందుగానే చెప్పినా కూడా సినిమాను మధ్యలోని వదిలేసి సంగీత దర్శకుడు అలా వెళ్లడం వారికి నచ్చలేదు. ఆయన టూర్ నుండి తిరిగొచ్చిన తర్వాత నేనున్నాను సినిమా మార్కెట్‌కు సంగీత దర్శకుడి వల్ల నష్టం జరుగుతుందని నిర్మాత ఆయనతో అన్నారు. పరిశ్రమకు ప్రాణంలాగా ఉండే నిర్మాతలకు తన వల్ల ఎప్పటికీ నష్టం రాకూడదని పట్నాయక్ పూర్తిగా సంగీతాన్నే వదిలేసానన్నారు.

తన యూఎస్ టూర్ వల్ల పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమా చేసే అవకాశం కూడా మిస్ అయ్యిందని పట్నాయక్ అన్నారు. ఒకవేళ తాను ఇంకా ఇండస్ట్రీలో ఉండుంటే పవన్ కళ్యాణ్‌తో కచ్చితంగా సినిమా చేసేవాడని చెప్పారు. నేనున్నాను నుండి తప్పుకున్న తర్వాత కూడా తన సంగీతాన్ని అమితంగా ఇష్టపడే దర్శకులు కొందరు తాను సినిమాలకు మ్యూజిక్ చేయడానికి ఒప్పించారు. ఆర్ పి పట్నాయక్ మంచి సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడిగా, దర్శకుడిగా కూడా పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.

Tags

Read MoreRead Less
Next Story