అభిమానులకు షాకిచ్చిన మెగాస్టార్‌..

ఎంతైనా మెగాస్టార్.. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు. వయసుతో పనేముంది వచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేయాలి. 76 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్లతో స్టెప్పులేయగలరు.. 96 ఏళ్ల వృద్ధ పాత్రకూ ప్రాణం పోయగలరు. గుర్తుపట్టే అవకాశమే లేకుండా మేకప్ మాయాజాలంతో మ్యాజిక్ చేస్తున్నారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఆయన్ని ఆగెటప్‌లో చూసిన అభిమానులు షాకయ్యారు. తన రాబోయే చిత్రం ‘గులాబో సితాబో’ కోసం ఈ గెటప్ వేశారు అమితాబ్. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. తెల్లటి గడ్డం, కళ్ల జోడు, వెరైటీగా తలకు చుట్టుకున్న టవల్, ప్రొస్థెటిక్ ముక్కు.. మొత్తానికి వావ్ అనిపించే లుక్‌లో బిగ్ బి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు.
ఆయుష్మాన్ హీరోగా సుజీత్ సిర్కార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రంలోని అమితాబ్ లుక్‌ని ప్రముఖ విమర్శకుడు తరన్ ఆదర్స్ ట్విట్టర్లో షేర్ చేశారు. విలక్షణ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రం కోసం అమితాబ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *