Bro Pre Release event: నవ్విస్తుంది, బాధపెడుతుంది: పవర్ స్టార్

తమిళం నేర్చుకొని, ఒకరోజు తమిళంలో స్పీచ్ ఇస్తానన్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న 'బ్రో' కోసం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు, సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పట్నుంచి అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తమిళం నేర్చుకొని, ఒకరోజు తమిళంలో స్పీచ్ ఇస్తానన్నారు. "గొప్ప రచయితలు, దర్శకులు కావాలంటే మాతృభాష మీద పట్టుండాలి. మాతృభాష మీద, మన సాహిత్యం మీద పట్టుంటే గొప్ప గొప్ప సినిమాలు వస్తాయ"ని చెప్పారు. ఇక 'బ్రో' సినిమా విషయానికొస్తే.. "ఈ సినిమా నవ్విస్తుంది, బాధపెడుతుంది. గుండెల నిండుగా నవ్వుకుంటాం, నవ్వుతూ ఏడుస్తాం" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"సముద్రఖని గారు చెప్పినట్లుగా, ఎంతసేపూ సమాజం నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి ఏదైనా ఇవ్వాలి. నేను సినిమా చేసేటప్పుడు సమాజానికి ఉపయోగపడే ఎంతోకొంత చిన్నపాటి ఆలోచన ఉంటే బాగుంటుంది అనుకుంటాన"ని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది చాలా సంపూర్ణమైన సినిమా అన్నఆయన.. ఒక విషయంలో తాను సముద్రఖని గారికి అభిమానిని అయ్యానని చెప్పుకొచ్చారు. "మనలో చాలామందికి తెలుగుభాష సరిగా చదవడం, పలకటం రాదు. ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగు మాట్లాడలేకపోతున్నాం. మన మాతృభాష బలంగా ఉండాలని ఎప్పటికప్పుడు నన్ను నేను సరిదిద్దుకుంటూ ఉంటాను. అలాంటిది సముద్రఖని గారు మన భాష కాదు, మన యాస కాదు. మొదటిరోజు నేను స్క్రిప్ట్ రీడింగ్ కి వెళ్తే, అక్కడ ఆయన స్క్రిప్ట్ చదువుతూ కనిపించారు. ఆయన తమిళ్ లోనో, ఇంగ్లీష్ లోనో రాసుకొని చదువుకుంటున్నారు అనుకున్నాను. వెళ్లి చూస్తే అది తెలుగు స్క్రిప్ట్. మీకు తెలుగు వచ్చా అని అడిగితే, ఈ సినిమా కోసం కొన్ని నెలల నుంచి నేర్చుకుంటున్నాను అని చెప్పారు. ఆయన మన తెలుగు నేర్చుకున్నారు కాబట్టి నేను ఆయనకు మాట ఇస్తున్నాను. నేను తమిళ్ నేర్చుకొని, ఒకరోజు తమిళ్ లో స్పీచ్ ఇస్తాను. సముద్రఖని గారు ఇంత తెలుగు నేర్చుకుంటే, తెలుగు మాతృభాషగా ఉన్న మనం ఇంకెంత తెలుగు నేర్చుకోవాలి అని కనువిప్పు కలిగేలా చేశార"న్నారు.

సినిమా అంటే ఇష్టం అని, కానీ సమాజం అంటే బాధ్యత అని పవర్ స్టార్ చెప్పారు. సినిమా అంటే ప్రేమ అన్న ఆయన.. తాను ఈ సినిమాను 20 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయగలిగానంటే దానికి కారణం దర్శకుడు సముద్రఖని, డీఓపీ సుజిత్ వాసుదేవ్ అని అన్నారు. "సాయి తేజ్ కి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాను. తను స్పృహలో లేడు. ఈరోజు తేజ్ ఇక్కడ నిలబడి మళ్ళీ సినిమా చేయగలిగాడు అంటే ఆరోజు కాపాడిన అబ్దుల్ అనే కుర్రాడు కారణం. ఆస్పత్రిలో సాయి తేజ్ ని చూసి ఏం చేయలేని పరిస్థితిలో కాపాడమని దేవుడిని కోరుకున్నాను. తేజ్ పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ సినిమా సాయి తేజ్ చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ గారే సూచించారు. ఈ సినిమాని వేగంగా పూర్తి చేయడానికి ముందే సెట్లు రెడీ చేసి పెట్టుకొని, సరైన ప్రణాళిక చేసిన నిర్మాతలు విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి ధన్యవాదాలు" అని చెప్పారు.

ఇక 'బ్రో' విషయానికొస్తే ఈ సినిమా నవ్విస్తుంది, బాధపెడుతుంది. గుండెల నిండుగా నవ్వుకుంటాం, నవ్వుతూ ఏడుస్తాం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలుగు పరిశ్రమ లాగే తమిళ పరిశ్రమ కూడా అన్ని భాషల వారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానని. అప్పుడే 'ఆర్ఆర్ఆర్' లాంటి ప్రపంచస్థాయి సినిమాలు చేయగలుగుతామని చెప్పారు.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 25న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ మెగా ఈవెంట్ లో మెగా కుటుంబం సందడి చేసింది. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బ్రో సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా.. ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. కాగా ఈ చిత్రం జూలై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.


Tags

Read MoreRead Less
Next Story