GiriBabu: 'గిరిబాబు'కు సరిరారు వేరెవ్వరు.. అన్ని పాత్రలను అవలీలగా..

GiriBabu: గిరిబాబుకు సరిరారు వేరెవ్వరు.. అన్ని పాత్రలను అవలీలగా..
యాక్టర్ గిరిబాబు.. వెండితెరపై తనను నటుడిగా చూసుకునేందుకు గిరిబాబు పడ్డ శ్రమ ఆర్టిస్ట్ కావాలనుకునే ప్రతి ఒక్కరికీ పాఠం లాంటింది..

GiriBabu: హీరో కావాలని వెళ్లి, సెలెక్ట్ అయ్యి.. ఆ వెంటనే రిజెక్ట్ అయ్యి.. ఎన్నో సార్లు నిరాశను ఎదుర్కొని.. ఆఖరుకి హీరోగా ఎంపికయిన సినిమాలోనే విలన్ గా చేయాల్సి వచ్చింది.. అటుపై విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ గిరిబాబు.. వెండితెరపై తనను నటుడిగా చూసుకునేందుకు గిరిబాబు పడ్డ శ్రమ ఆర్టిస్ట్ కావాలనుకునే ప్రతి ఒక్కరికీ పాఠం లాంటింది.. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న గిరిబాబు పుట్టిన రోజు ఇవాళ.,

గిరిబాబు పుట్టింది ప్రకాశం జిల్లాలోని రావినూతలలో. ఒక్కడే సంతానం. గారాబంగా పెరిగి ఊర్లో జల్సారాయుడిగా పేరు తెచ్చుకున్నారు. చిన్నతనం నుంచే విపరీతమైన సినిమా పిచ్చి ఉండేది. కాలేజ్ లో తొలిసారిగా నాటకంలో హీరోగా వేసి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చదువు ఒంటబట్టకపోవడంతో 20యేళ్లకే పెళ్లి చేశారు. తర్వాత ముగ్గురు పిల్లలకు తండ్రి అయినా తన తండ్రి సంపాదన మీద సంసారం సాగిస్తూ.. నాటకాలు వేస్తూ బాధ్యతారాహిత్యంగా ఉండేవారట.. అదే టైమ్ లో తమ నాటకాలను ఫోటోలు తీసేందుకు వచ్చిన ఓ ఫోటోగ్రాఫర్ ఆయన ఫోటోలను కొత్త నటులు కావాలి అన్న ప్రకటనల కోసం పంపించారు. మంచి రూపం ఉండటంతో మద్రాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ దృష్టిలో పడ్డారు.

మిత్రుడు పంపించిన ఫోటోలను చూసి మద్రాస్ నుంచి పిలుపొచ్చింది.. ధైర్యే సాహసే లక్ష్మి అనే సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యాడు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత జి. వరలక్ష్మి, ఎస్.డి. లాల్, తాతినేని రామారావు, అట్లూరి పూర్ణచంద్రరావు లు తీస్తోన్న సినిమాలకు హీరోగా ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మళ్లీ చేజారిపోయింది. కానీ ఓ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యావని చెప్పి రాత్రికి రాత్రే మార్చేశారు. కానీ హీరోగా తీసివేసినా.. అదే సినిమాలో విలన్ గా ఆఫర్ ఇచ్చారు. వెంటనే ఓకే చెప్పి ఆ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు గిరిబాబు. అలా తను హీరో కావాల్సిన సినిమాలో విలన్ గా మారితే, తన స్థానంలో హీరోగా మారింది మురళీ మోహన్. ఆ సినిమా పేరు జగమే మాయ.. ఇద్దరికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం.

జగమే మాయ షూటింగ్ టైమ్ లోనే గిరిబాబు బాగా చేస్తున్నాడన్న పేరు వచ్చింది. దీంతో ఆ సినిమా విడుదల కాకముందే మరో ఏడు సినిమాల్లో బుక్ అయిపోయాడు. అలా మొదలైన గిరిబాబు ప్రస్థానం ఆ తర్వాత ఏ దశలోనూ ఆగలేదు. అన్ని రకాల పాత్రలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు గిరిబాబు. ఒకప్పుడు తాను నటుడిని అవుతానంటే అవహేళన చేసిన ఊర్లోనే సగర్వంగా తను నటుడై చూపించి అడుగుపెట్టాడు.

ప్రతిభ, అదృష్టం, సత్ ప్రవర్తన.. ఈ మూడు అంశాలే తన కెరీర్ ఎదుగుదలకు కారణమని నమ్ముతారు గిరిబాబు. ఆ విషయం ఆయనే కాదు.. ఇండస్ట్రీలోని ఇతరులు కూడా ఒప్పుకుంటారు. అందుకే అప్పటి స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ మంచి పాత్రలు చేశారు. అలాగే గిరిబాబు హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా రాణించారు. అయితే విలన్ గా మొదలై హీరోగా మారిన నాటి నటుల ట్రెండ్ లో గిరిబాబు ఉన్నా.. వారిలాగా పెద్ద హీరోగా సక్సెస్ కాలేకపోయారు.

జగమే మాయ సినిమాతో విలన్ గా పరిచయం అయిన తర్వాత వరుసగా అలాంటి పాత్రలే చేశారు. ఎక్కువగా కన్నింగ్ విలన్ గా కనిపించేవారు గిరిబాబు. కృష్ణ, నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు వంటి హీరోల సినిమాల్లోనూ ప్రధాన విలన్ గానో లేక సహాయ విలన్ గానో కనిపించారు. ఒక్కోసారి కొన్ని సీన్సే ఉన్నా .. అందులోనూ తనదైన ప్రతిభ చూపించి ఆకట్టుకునేవారు.

విలన్‌గా పరిచయమైన చాలాకాలానికి హీరోగా అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు వధూవరులు. ఈ సినిమాలో ఆయనతో పాటు అప్పటికే కెరీర్ చివరి దశలో ఉన్న రేలంగి గారు నటించారు. తన తోటితరం నటులెవ్వరికీ ఈ అదృష్టం దక్కలేదని.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టమని ఆనందంగా చెబుతారు గిరిబాబు. అలాగే జ్యోతిలక్ష్మి అనే సినిమాలో మహానటి సావిత్రి భర్తగా నటించారు. ఇది కూడా తన కెరీర్ అరుదైన సంఘటన అనే అంటారు.

మొత్తంగా ఎన్నో రకాల స్ట్రగుల్స్ తర్వాత నటుడిగా నిలదొక్కుకోవడమే కాదు.. గిరిబాబు మంచి ఆర్టిస్ట్ అనే పేరు కూడా తెచ్చుకుని.. ఏ రోజూ ఖాళీగా లేకుండా బిజీ అయిపోయారు. ఓ రకంగా కష్టేఫలి అనేమాటకు గిరిబాబు కెరీర్ ఖచ్చితమైన నిదర్శనంగా నిలుస్తుంది. కలిసొచ్చే కాలం కోసం కాకుండా కాలం వైపు పరుగులు పెట్టడమే గిరిబాబు సక్సెస్ కారణం.

1973లో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు గిరిబాబు. కేవలం నాలుగేళ్లలోనే 45సినిమాలు చేశారు. మరికొన్ని సెట్స్ పై ఉన్నాయి. ఈ సమయంలో తనే నిర్మాతగా మారి ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇది ఆయన యాభైవ చిత్రం. మరో మిత్రుడితో కలిసి జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించి.. తొలినాళ్లలో తన ఫోటోలను మద్రాస్ కు పంపించిన ఫోటోగ్రాఫర్ మిత్రుడిని కలుపుకుని దేవతలారా దీవించండి అనే సినిమా నిర్మించారు. ఈ సినిమాను దేవతలతో పాటు ప్రేక్షకులు దీవించడంతో నిర్మాతగా తొలి ప్రయత్నంలో మంచి హిట్ అందుకున్నారు.

నిర్మాతగా తొలి ప్రయత్నమే హిట్ కావడంతో రెండో సినిమా మొదలుపెట్టారు. సింహగర్జన పేరుతో రూపొందిన ఈసినిమాలో కృష్ణ తనూ హీరోలుగా నటించారు. అదే టైమ్ లో ఎన్టీఆర్ సింహబలుడు కూడా విడుదల కావడంతో ఆయనతో గిరిబాబు పోటీ పడ్డారనుకున్నారు చాలామంది. కానీ నిజానికి సింహగర్జనే ముందు షూటింగ్ కు వెళ్లింది. మొత్తంగా గిరిబాబు సింహగర్జన మంచి హిట్ అయింది.

అలా నటుడిగానే కాదు.. పెద్దగా అనుభవం లేకపోయినా నిర్మాతగానూ మంచి విజయం అందుకున్నారు గిరిబాబు. ఆ ఉత్సాహంలోనే తన తొలి సహనటుడు మురళీ మోహన్ హీరోగా ముద్దు ముచ్చట అనే సినిమా తెరకెక్కిస్తే అదీ హిట్. అయితే ఈ సారి తన కూతురు మాధవి పేరు మీదుగా మాధవి చిత్ర బ్యానర్ లో ఈ సినిమా నిర్మించడం విశేషం.. ఇక ఇదే బ్యానర్ పై పిఎన్ రామచంద్రరావును దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన సంధ్యారాగం ఫెయిల్ కావడంతో కొన్నాళ్లు నిర్మాణానికి దూరమయ్యారు.

నిర్మాతగా మంచి ప్లానింగ్ తో సినిమాలు నిర్మించారు గిరిబాబు. ఆ కారణంగానే సాయికృష్ణ ఫిలిమ్స్ అధినేతలు ఆయన్ని యాభైశాతం వర్కింగ్ పార్టనర్ షిప్ ఇస్తూ సినిమాకు ఒప్పించారు. అప్పుడప్పుడే హీరోలుగా ఎదుగుతున్న సుమన్, భానుచందర్ లతో పాటు తనూ రంగనాథ్ మరో రెండు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఆ సంచలన చిత్రం మెరుపుదాడి. ఇది సెన్సేషనల్ హిట్. తర్వాత ఇదే సినిమాలో నటించిన భానుచందర్, సుమలత జంటగా తొలిసారి తనే దర్శకుడిగా రణరంగం అనే సినిమా తెరకెక్కించారు. అయితే దర్శకుడిగా పేరు వచ్చినా రణరంగం కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు.

ఓ చిన్న ఊరిలో పుట్టి.. పెద్ద కలలు కని.. వాటిని సాకారం చేసుకునే క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొని.. సినిమా రంగంలో తనకంటూ ఓ పేజ్ రాసుకునే వరకూ గిరిబాబు ప్రయాణం ఎందరికో ఆదర్శం. అయితే ఈ ఆదర్శవంతమైన జర్నీలో తన పెద్ద కొడుకు బోస్ బాబును హీరోగా పరిచయం చేసినా.. ఆ రంగంలో స్థిరపరచలేకపోయాననే అసంతృప్తి ఉంది. కానీ తామెప్పుడూ ఊహించని రఘుబాబు నటుడిగా బిజీ కావడం కొంత వరకూ ఊరటగా చెబుతారు..

గిరిబాబు విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించినా ఆయనలోని కామెడీ కోణం కూడా ప్రేక్షకులు ఆదరించారు.. ఆస్వాదించారు. కామెడీకి ఉండాల్సిన అద్భుతమైన టైమింగ్ గిరిబాబుకు బాగా కలిసొచ్చింది. అందుకే తొంభైల్లో చాలా సినిమాల్లో ఆయన ఏ ఆఫీస్ మేనేజర్ గానో, లేక ఫ్యాక్టరీ ఓనర్ గానో లేక రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, నరేష్ లాంటి నాటి కామెడీ హీరోలకు తండ్రిగానో ప్రేక్షకులకు గిలిగింతలూ పెట్టారు.

దర్శకుడుగా సక్సెస్ కాలేకపోయానన్న అసంతృప్తి ఉందో ఏమో.. అందుకే పరిశ్రమలో చాలా పెద్ద మార్పులు వచ్చిన తర్వాత కూడా మరోసారి మెగాఫోన్ పట్టారు.. కానీ ఈ ట్రెండ్ ను అంది పుచ్చుకోవడంలో అందర్లాగే ఇబ్బంది పడ్డారు. ఆనంద్ సినిమాతో ఫేమ్ అయిన రాజా హీరోగా 2008లో నీ సుఖమే నే కోరుకున్నా అనే సినిమా డైరెక్ట్ చేశారు. కానీ ఇది పోయింది. తర్వాత అడపాదడపా నటిస్తున్నారు తప్ప ఇంక మెగాఫోన్ పట్టే ప్రయత్నం చేయలేదు.

ప్రస్తుతం వయస్సు పరంగా గిరిబాబు 70ల్లో ఉన్నారు. అయినా తరగని ఉత్సాహంతో అవకాశం వచ్చిన ప్రతిసారీ నటిస్తూనే ఉన్నారు.. లేటెస్ట్ గా వచ్చిన అ..ఆ సినిమాలోనూ అవసరాల శ్రీనివాస్ తండ్రిగా.. మా డబ్బున్న వాళ్ల కష్టాలు మీకేం తెలుస్తాయండీ అనే మేనరిజంతో ఆకట్టుకున్నారు.. అయితే ప్రభుత్వాల నుంచి గిరిబాబు ప్రతిభకు తగినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి.. అయినా ప్రజాదరణ కు మించిన అవార్డులేముంటాయి.. ఆ ఆదరణను అంతులేకుండా సంపాదించిన గిరిబాబు మరింత కాలం ఆయురారోగ్యాలతో ఉండాలని.. మరిన్ని సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుంటూ మరోసారి ఈ నట శిఖరానికి జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం..

Tags

Read MoreRead Less
Next Story