HBD Nirosha : అభిమానుల 'సిందూరపువ్వు'కి బర్త్ డే విషెస్!

HBD Nirosha : అభిమానుల సిందూరపువ్వుకి  బర్త్ డే విషెస్!
తమిళంతో మొదలుపెట్టి... తమిళ, కన్నడ, మళయాల సీమల్లో సినిమాలను అభిమానులను సంపాదించుకున్న ఈ సిందూరపువ్వు పుట్టిన రోజు ఇవాళ.

గ్లామర్ హీరోయిన్ అంటే.. తీరైన ఒళ్లు.. తెల్లని రంగు.. నిలువెత్తు అందం.. అంటూ ఏవేవో ఊహించుకుంటారు.. కానీ అవేవీ పెద్దగా లేకుండానే గ్లమరస్ హీరోయిన్ గా తన మత్తైన చూపుల్తో గుచ్చేసిన హీరోయిన్ నిరోషా. ఒకప్పుడు తన వాలు కళ్లతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన బ్యూటీ ఆమెది. తమిళంతో మొదలుపెట్టి... తమిళ, కన్నడ, మళయాల సీమల్లో సినిమాలను అభిమానులను సంపాదించుకున్న ఈ సిందూరపువ్వు పుట్టిన రోజు ఇవాళ.

అలనాటి చలాకీ తారల్లో ఒకరైన రాధిక చెల్లెలు నిరోషా. పుట్టింది శ్రీలంకలో. కానీ ఆమె కుటుంబానికి తెలుగు మూలాలున్నాయని చెబుతారు. ఆమె తండ్రి కూడా నటుడే. అందుకే తమ కుటుంబం నుంచి రాధిక హీరోయిన్ అయినా నో చెప్పలేదాయన. తర్వాత రాధిక ప్రోత్సాహంతో తనూ సినిమా రంగంలోకి రావాలనుకుంది నిరోషా.

రాధిక సిఫారసులు కూడా అవసరం లేకుండానే చాలా తక్కువ టైమ్ లోనే నిరోషాకు గుర్తింపు వచ్చింది. తమిళ్ తో పాటు తెలుగు నుంచీ ఆఫర్స్ మొదలయ్యాయి. తను తెలుగులో నటించిన మొదటి సినిమా నారీ నారీ నడుమ మురారీ. ఈ సినిమాలో బాలకృష్ణ మరదలిగా నిరోషా నటనకు హొయలకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో నిరోషా ఇక్కడా హాట్ ఫేవరెట్ అయిపోయింది.

నిరోషాకు తెలుగులోనూ చాలా అవకాశాలే వచ్చాయి. కానీ అప్పటికే అటు తమిళ, కన్నడ భాషల్లో ఒప్పేసుకున్న సినిమాలతో బిజీగా ఉండటంతో వెంటవెంటనే తెలుగులో నటించలేకపోయింది. తమిళం తర్వాత నిరోషా ఎక్కువ సినిమాలు చేసింది కన్నడలోనే. అప్పుడు కన్నడనాట టాప్ హీరోలుగా ఉన్నవారందరితోనూ నటించి తనూ టాప్ హీరోయిన్ గా మారిపోయింది.

సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. చాలా వరకూ మాయలే ఉంటాయి. అయితే నిరోషా ఆ మాయల్లో పడిపోలేదు. కెరీర్ ఆరంభంలోనే ఆమెకు సిందూరపూవు హీరో రాంకీతో ప్రేమదోమ కుట్టింది. ఆ ప్రేమకథను కొనసాగిస్తూనే దక్షిణాదిలోని చాలా భాషల్లో నటిస్తూ వచ్చింది. అది కూడా గ్లామర్ తారగా రాణించింది. ఓ రకంగా ఇది అంత ఈజీగా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ అండర్ స్టాండింగ్ తో అన్నీ దాటేసిందీ సోయగం..

తెలుగులో డిటెక్టివ్ నారద సినిమా తర్వాత మళ్లీ ఆమె ఇక్కడ కనిపించలేదు. అయినా చేసిన కొన్ని సినిమాలతోనే తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందిక్కడ. అయితే ఇతర భాషల్లో మంచి అవకాశాలువస్తున్న టైమ్ లోనే పెళ్లి చేసుకుంది. దీంతో అవకాశాలు సడెన్ గా ఆగిపోయాయి. తను ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసినా అవకాశాలు తగ్గలేదు కాబట్టి.. పెళ్లి చేసుకున్నా ఛాన్స్ లు ఉంటాయి అనుకుంది నిరోషా. కానీ పెళ్లి తర్వాత తనకు పూర్తిగా ఆఫర్స్ తగ్గిపోయాయి.

Tags

Read MoreRead Less
Next Story