చిరంజీవితో జతకట్టనున్న త్రిష

చిరంజీవితో జతకట్టనున్న త్రిష

ఇండస్ట్రీలో శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. కొన్ని సందర్భాల్లో స్టార్స్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినా.. మళ్లీ కొంతకాలానికే అవి సద్దుమణుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, గ్లామర్ క్వీన్ త్రిష పాత గొడవలు మర్చిపోయి.. కలిసి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట. చిరంజీవి నెక్స్ట్ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించడానికి ఓ.కె. చెప్పిందనేది ఫిల్మ్ నగర్ టాక్.

సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే.. త్రిష వంటి బ్యూటీస్ ను చూస్తే ఆ మాట తప్పని అనిపిస్తూ ఉంటుంది. ఇరవై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోన్న త్రిష.. ఇప్పటికీ అదే స్పీడును కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు. పైగా.. వయసు పెరుగుతోన్న కొద్దీ త్రిషలో గ్లామర్ కూడా పెరుగుతూనే ఉంది. తమిళంలో ‘96‘ మూవీ కానీ.. ‘పొన్నియిన్ సెల్వన్‘ సిరీస్ లో కానీ.. త్రిష ను చూసిన ఎవరైనా ఈమాట అనకుండా ఉండలేరు.

కెరీర్ స్టార్టింగ్ నుంచి మాతృ భాష తమిళం కంటే మిన్నగా తెలుగులో సినిమాలు చేసింది త్రిష. ముఖ్యంగా టాలీవుడ్ లోని అప్పటి ఎ టు జెడ్ స్టార్స్ అందరితోనూ సినిమాలు చేసిన హీరోయిన్ గా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఈకోవలోనే.. మెగాస్టార్ చిరంజీవితో ‘స్టాలిన్‘ సినిమాలో నటించింది. ‘స్టాలిన్‘ తర్వాత సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న చిరు.. మళ్లీ ‘ఖైదీ నంబర్ 150‘తో రీఎంట్రీ ఇవ్వడం. ఆ తర్వాత చేసిన ‘ఆచార్య‘లో త్రిషను హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. అయితే.. ‘ఆచార్య‘లో తన పాత్ర నచ్చలేదని.. అందుకే ఆ సినిమా నుంచి తప్పుకోబోతున్నట్టు త్రిష ప్రకటించింది. కానీ.. ‘పొన్నియిన్ సెల్వన్‘లో అవకాశం రావడం వల్లే ‘ఆచార్య‘ నుంచి త్రిష తప్పుకుందని చిరంజీవి చెప్పడంతో.. వీరిద్దరి మధ్య ఏవో అపొహలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది.

అయితే.. ఇండస్ట్రీలో శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. అందుకే.. ఇప్పుడు మరోసారి చిరంజీవి-త్రిష కాంబినేషన్ సెట్టవ్వబోతుందట. చిరంజీవి.. కళ్యాణ్ కృష్ణతో చేయబోయే సినిమాలో త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించబోతుంది. ఈ మూవీలో చిరంజీవికి కొడుకుగా సిద్ధు జొన్నలగడ్డ నటించనున్నాడట. ఇక.. చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తే.. సిధ్దుకి జంటగా శ్రీలీల కనిపించనుందట. మొత్తంమీద.. ‘స్టాలిన్‘ తర్వాత మరోసారి కలిసి నటించబోతున్న చిరు, త్రిష కాంబో మూవీపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story