కాజల్ లీడ్ రోల్ లో.. 'సత్యభామ' ట్రైలర్ రిలీజ్

కాజల్ లీడ్ రోల్ లో.. సత్యభామ ట్రైలర్ రిలీజ్
లేడీ దబాంగ్ లాంటి సినిమా

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. సత్యభామ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఇందులో స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా కాజల్ నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోంది. శశికిరణ్ టిక్కా సినిమాను నిర్మిస్తుండగా.. అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. తోందరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్లు చిత్ర యునిట్ తెలిపింది. ఈ సినిమాతో పాటు కమల్ సరసన ఇండియన్ 2, బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ నటిస్తోందన్న సంగతి తెలిసిందే.

ట్రైలర్ విషయానికి వస్తే... నేరస్థుల నుంచి నిజాలు రాబట్టడానికి పోలీసు కానిస్టేబుల్ ప్రయత్నిస్తుంటాడు. ఎంతకీ నేరస్థులు నోరువిప్పక పోయేసరికి పోలీస్ ఆఫీసర్ కాజల్ అగర్వాల్ కు ఫోన్ వెళ్తుంది. చార్జ్ తీసుకోమని అవతలి వాయిస్ చెప్పగానే క్షణాల్లో కాజల్ స్టేషన్ కు చేరుకుంటుంది. అప్పటికే నేరస్థులను కొట్టీ కొట్టి అలిసిపోయిన కానిస్టేబుల్ కాజల్ కు లాఠీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. సైగతో వద్దని చెప్పి... పిడిగుద్దులతో నేరస్థులనుంచి నిజాలను రాబడుతుంది.

ఫైల్ లో సంతకం చేస్తుండగా ఆమె చేతికి గాజులు గుచ్చుకుని ఉంటాయి. ఆ విషయాన్ని గమనించిన లేడీ కానిస్టేబుల్ గాజులు తీసి కొట్టాల్సింది మేడమ్ అని అంటుంది. అప్పుడు కాజల్ స్టైల్ గా... గాజులు లేకుండా కొట్టాడుగా మన కానిస్టేబుల్, నేరస్థులు నిజాలు చెప్పారా అని అడగడంతో ట్రైలర్ ముగుస్తుంది. ఏవైపునుంచి చూసినా లేడీ దబాంగ్ లాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారని అనిపిస్తోంది. అలా అయితే... కాజల్ అభిమానులకు ఫుల్ మిల్స్ అన్నమాట.

Tags

Read MoreRead Less
Next Story