శాండల్‌వుడ్‌ డ్రగ్స్ వ్యవహారం..నటి అరెస్ట్..ఎవరెవరికి లింకులున్నాయి?

శాండల్‌వుడ్‌ డ్రగ్స్ వ్యవహారం..నటి అరెస్ట్..ఎవరెవరికి లింకులున్నాయి?
ఫిల్మ్ మేకర్ ఇంద్రజిత్ లంకేష్‌ 15 మంది పేర్లు బయటపెట్టడంతో శాండల్‌వుడ్ హడలిపోతోంది. ఇంతకీ ఇంకా ఎవరెవరికి లింకులున్నాయి?

సినీ ఇండస్ట్రీల్లో డ్రగ్స్ వ్యవహారం బయటపడిన ప్రతిసారీ కలకలం రేగుతోంది. ఇప్పుడు శాండల్‌వుడ్ వంతొచ్చింది. గత నెల 21 నుంచి కర్నాటక ఫిల్మ్ ఇండస్ట్రీ డ్రగ్స్ వ్యవహారంతో షేక్ అవుతోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే నటి రాగిణి ద్వివేదిని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులు శాండల్‌వుడ్‌తో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించడంతో సెంట్రల్ క్రైం బ్రాంచ్ రంగంలోకి దిగింది. అటు ఫిల్మ్ మేకర్ ఇంద్రజిత్ లంకేష్‌ 15 మంది పేర్లు బయటపెట్టడంతో శాండల్‌వుడ్ హడలిపోతోంది. ప్రముఖ నటి రాగిణి ద్వివేదిని బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో విచారణలో ఏం తేలుతుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

విచారణకు హాజరుకావాలంటూ రాగిణి ద్వివేదికి సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం నోటీస్ ఇచ్చారు. అయితే తనకు సోమవారం వరకు టైం కావాలని కోరింది రాగిణి. స్వయంగా విచారణకు వెళ్లకుండా లాయర్ల టీంను పంపింది. కానీ సీసీబీ ఆఫీసుకు రావాలని పోలీసులు అల్టిమేటం జారీ చేశారు. ఈలోపే కోర్టు నుంచి వారెంట్‌ తీసుకున్న పోలీసులు బెంగళూరులోని ఆమె ఇంటికి చేరుకున్నారు. సెర్చ్ వారంట్ చూపించి ఇంట్లో సోదాలు చేశారు. ఆ వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని సీసీబీ ఆఫీసుకు తరలించారు. పోలీసు కారులో వెళ్లిన రాగిణి నవ్వుతూ కనిపించింది.

ఈ నెల 21న బెంగళూరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో-NCB పక్కా సమాచారంతో కల్యాణ్‌నగర్‌లోని ఓ ఇంటిపై దాడి చేసింది. ముగ్గురు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేసింది. డి.అనిక, ఆర్.రవింద్రన్, మొహమ్మద్‌ అనూప్‌లను అరెస్ట్ చేసిన NCB వారి వద్ద నుంచి 145 ఎక్టసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకుంది. 60 గ్రాముల బరువున్న ఈ పిల్స్ విలువ 2 లక్షల 20 వేలకుపైనే ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఒక్కో పిల్‌ను డ్రగ్ డీలర్లు 15 వందల నుంచి 2 వేలకు విక్రయిస్తారు.

పట్టుబడిన ఈ ముగ్గురినీ విచారించిన NCB అధికారులు ఓ డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో రాగిణి ద్వివేది ఫ్రెండ్‌ రవిని కూడా అరెస్ట్ చేశారు. రాగిణికి కూడా డ్రగ్స్ వ్యవహారంలో పాత్ర ఉన్నట్లు అనుమానించిన పోలీసులు ఆమెను విచారించేందుకు సీసీబీ ఆఫీసుకు తీసుకెళ్లారు. ఇక రవిని కోర్టు ఐదు రోజుల రిమాండ్ విధించింది. డైరీ ఆధారంగా ఫిల్మ్ మేకర్ - జర్నలిస్ట్ ఇంద్రజిత్‌ లోకేష్‌ను కూడా పోలీసులు విచారించారు. అయితే అతడు డ్రగ్స్‌ లింకులున్న 15 మంది సెలబ్రిటీల పేర్లు వెల్లడించినట్లు సమాచారం. వీరిలో పలువురు మ్యుజీసియన్స్, సింగర్స్, నటీనటులు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖండిస్తోంది. అవన్నీ తప్పుడు ఆరోపణలని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు.

ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న రాగిణి ద్వివేది వీర మడకన్ అనే చిత్రంతో 2009లో శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. కెంపే గౌడా చిత్రంలోని రాగిణి ఐపీఎస్ పాత్రతో ఆమె ఫేమస్ అయింది. రాగిణి కుటుంబం హర్యాణాలోని రేవరి నుంచి వచ్చి బెంగళూరులో సెటిలైంది. రాగిణి బెంగళూరులోనే జన్మించింది. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడంతో అటు ఆమె సొంత రాష్ట్రంలోనూ కలకలం మొదలైంది.

Tags

Read MoreRead Less
Next Story