మల్టీ టాస్కింగ్ అంటే చాలా ఇష్టం : 'టీచ్ ఫర్ చేంజ్' పై లక్ష్మీ మంచు

మల్టీ టాస్కింగ్ అంటే చాలా ఇష్టం : టీచ్ ఫర్ చేంజ్ పై లక్ష్మీ మంచు

నటి లక్ష్మి మంచు ప్రస్తుతం తన రాబోయే చిత్రం "అగ్నినక్షత్రం" పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆమె తండ్రి, నటుడు మోహన్ బాబు కూడా నటించనుండడం చెప్పుకోదగిన విషయం, టీచ్ ఫర్ చేంజ్ అనే NGO ద్వారా హైదరాబాద్‌లోని అనేక పాఠశాలలను దత్తత తీసుకుంటున్నట్లు మంచు లక్ష్మీ ఈ సందర్భంగా ప్రకటించారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, తమ వంతు సహకారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుందన్న ఆమె.. హైదరాబాద్‌లో 15, రంగారెడ్డిలో 25, యాదాద్రిలో 81, శ్రీకాకుళంలో 16, గద్వాల్‌లో 30 పాఠశాలలతో మొత్తం 167 పాఠశాలలను దత్తత తీసుకున్నారని చెప్పారు

టీచ్ ఫర్ చేంజ్ ఈ ఉదాత్తమైన ప్రయత్నాన్ని విద్యా స్వరూపాన్ని మార్చడానికి, వినూత్న బోధనా పద్ధతుల ద్వారా పిల్లలను శక్తివంతం చేయడానికి చేపట్టిందని మంచు లక్ష్మీ చెప్పారు. ఈ దత్తత వల్ల ప్రయోజనం పొందుతున్న ప్రస్తుత విద్యార్థుల సంఖ్య 16,497గా ఉందన్నారు. టీచ్ ఫర్ చేంజ్ మేనేజింగ్ ట్రస్టీగా.. లక్ష్మి మంచు.. దీనికి సంబంధించిన కార్యక్రమాలకు రోజువారీ అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సంస్థ ఎంపిక చేసిన పాఠశాలలతో సన్నిహితంగా పని చేస్తున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ, మద్దతును అందిస్తోన్న ఆమె.. విద్యార్థులకు ఆడియో-వీడియో తరగతులు రూపొందించడం, పిల్లల పురోగతిని అంచనా వేయడంలోనూ చురుకుగా పాల్గొంటున్నారు.

నటిగా, నిర్మాతగా లక్ష్మీ మంచు పలు కమిట్‌మెంట్‌లు ఉన్నప్పటికీ, ఆమె రాబోయే చిత్రం అగ్నినక్షత్రం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉన్నప్పటికీ ఆమె.. తన సమయాన్ని టీచ్ ఫర్ చేంజ్ కోసం వెచ్చిస్తున్నారు. "నేను ఓకే సారి చాలా పనులు చేయడానికి ఇష్టపడతాను. అందుకోసం నా షెడ్యూల్‌ను తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటాను. నేను ఎల్లప్పుడూ నా బృందానికి అందుబాటులో ఉంటాను. ప్రముఖులతో వ్యక్తిగతంగా సమావేశాలకు హాజరవుతాను. ఈ తరహా అంకితభావంతో కూడిన బృందం ఉండటం నా అదృష్టం" అని లక్ష్మీ మంచు ఆనందం వ్యక్తం చేశారు.

"మేము జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యా అధికారులు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విద్యా సంవత్సరం అంతటా విజయవంతంగా అమలు చేస్తాము. వారి అమూల్యమైన సహకారం, భాగస్వామ్యం విద్యార్థుల వృద్ధికి దోహదపడుతుంది" అని లక్ష్మి మంచు వివరించారు. టీచ్ ఫర్ చేంజ్ భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు విస్తరించాలని విశ్వసిస్తోందని, హైదరాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి, శ్రీకాకుళం, గద్వాల్‌ జిల్లాల్లో స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేశామని, ఇతర జిల్లాల్లో స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ కార్యక్రమాలను అమలు చేసి ఎక్కువ మంది విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి చురుగ్గా ఆలోచిస్తున్నామని మంచు లక్ష్మి తెలిపారు. టీచ్ ఫర్ చేంజ్ అనేది తెలంగాణ ప్రభుత్వం సహకారంతో జరిగే దత్తత కార్యక్రమం కాదన్న ఆమె.. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల కోసం స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగంతో ఎంవోయూ కుదుర్చుకుందని తెలిపారు.

అంతేకాకుండా, భారతదేశంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం, టీచ్ ఫర్ చేంజ్ వంటి NGOల మధ్య సహకారం ప్రాముఖ్యతను లక్ష్మి మంచు నొక్కిచెప్పారు. "ప్రస్తుతం హాజరు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలకు హాజరు కావడానికి విద్యార్థుల ఆసక్తిని పెంచే కొత్త బోధనా పద్ధతులను ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం NGOలకు సపోర్ట్ ఇవ్వగలదు, ప్రోత్సహించగలదు" అని ఆమె పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story