Puneeth Rajkumar: 29 సినిమాలు.. ఎన్నో సేవా కార్యక్రమాలు.. పునీత్ రాజ్‌కుమార్ ప్రస్థానం ఇదే..

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar: రాజ్ కుమార్ కుటుంబం నుంచి హీరోగా అరంగేట్రం చేసిన పునీత్ రాజ్ కుమార్ తనదైన శైలిలో హీరోగా ఎదిగాడు.

Puneeth Rajkumar: రాజ్ కుమార్ కుటుంబం నుంచి హీరోగా అరంగేట్రం చేసిన పునీత్ రాజ్ కుమార్ తనదైన శైలిలో హీరోగా ఎదిగాడు. రాజ్ కుమార్ అనే మహావృక్షం కింద చిన్న మొక్కలా మొదలైన పునీత్ ప్రయాణం ఈరోజు ఆయనకు లక్షలాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పునీత్ ను చూసి నేర్చుకోవాలని ఎంతో మంది చెప్పుకుంటారు..

పునీత్ రాజ్ కుమార్ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్ అని అందరూ ఒప్పుకునే స్థాయికి ఎదిగారు. దీని వెనుక కేవలం బ్యాక్ గ్రౌండ్ ఒకటే ఉందనుకోవడం పొరపాటు. పునీత్ తనను తాను మలుచుకున్న విధానం, ట్రైన్ చేసుకున్న విధానం, ఎదురు దెబ్బలను అధిగమించి హీరోగా ఎదిగిన విధానం.. ఎందరికో స్ఫూర్తి దాయకం.

పునీత్ అసలు పేరు లోహిత్. పునీత్ రాజ్ కుమార్ కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా చేసారు. పునీత్ బాల్యమంతా మైసూరులోనే గడిచింది. చిన్నతనంలో పునీత్ ను, పూర్ణిమను రాజ్ కుమార్ సినిమా సెట్స్ కు తీసుకునివచ్చేవారు. అలా చిన్న వయసు నుంచే పునీత్‌ రాజ్‌ కుమార్‌ సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. పుట్టిన ఏడాదిలోనే సినిమా ఛాన్స్‌ కొట్టేశాడు..

వి.సోమశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమడ కనికే చిత్రంలో పునీత్ రాజ్ కుమార్‌ నటించాడు. అప్పటికి పునీత్ వయసు కేవలం ఆరు నెలలు. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే వరసగా భూమిగే బండ భగవంత, భాగ్యవంత, హోస బెళక్కు, చలిసువ మోడగులు, భక్త ప్రహ్లాద, ఎరాడు నక్షత్రగలు, యారీవను, బెట్టాడా హువు, శివ మెచ్చిడ కన్నప్ప, పరశురామ్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మెరిశాడు. చైల్డ్‌ ఆర్టిస్టుగా ప్రూవ్‌ చేసుకుని పునీత్‌ కెరీర్‌ పరంగా మంచి బేస్‌ సాధించాడు.

1989 తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్న పునీత్ మళ్ళీ 2002లో అప్పు మూవీతో హీరోగా అరంగేట్రం చేసాడు. ఈ మూవీ పునీత్ కు హీరోగా మంచి ఆరంభాన్నిచ్చింది. డ్యాన్సులతో, యాక్టింగ్ తో కూడా పునీత్ రాజ్ కుమార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. 26 ఏప్రిల్ 2002లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో 200 రోజులు ఆడింది.

మౌర్య మూవీతో పునీత్‌ స్టార్‌ హీరో అయ్యాడు. అజయ్ సినిమాతో శాండల్ వుడ్ ఇండస్ట్రీ పవర్ స్టార్ గా మారాడు. మిలనా చిత్రంలో పునీత్ నటనకు గాను ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, సువర్ణ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నాడు. 2008లో బిందాస్ మూవీతో ఉత్తమ నటుడిగా సౌత్ స్కోప్ అవార్డు అందుకున్నాడు.

పునీత్ రాజ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమాల్లో నటించడమే కాదు. పాటలు పాడటం కూడా ఆయనకు ఎంతో ఇష్టం. పునీత్ ఆరేళ్ళ వయసు నుండే సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించాడు. మొట్టమొదటి సారి 1981లో భాగ్యవంత చిత్రంలో రెండు పాటలు పాడాడు. అక్కడి నుండి గాయకుడిగా పునీత్ ప్రస్థానం ఎక్కడా ఆగలేదు. వరసగా పాటలు పాడుతూ వచ్చాడు.

సినిమా హీరో అయ్యాక కూడా సంగీతాన్ని విడిచిపెట్టలేదు. కేవలం తన సినిమాలే కాక తన అన్న శివరాజ్ కుమార్ సినిమాలు, ఇతర హీరోల సినిమాల్లో కూడా పునీత్ పాటలు పాడాడు. ఇప్పటివరకూ వందకు పైగా పాటలు పాడిన పునీత్ రాజ్ కుమార్, గాయకుడిగా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

పునీత్ రాజ్ కుమార్ పలు సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. తన కెరీర్ లో నాలుగు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా కూడా పలు సినిమాలకు వ్యవహరించాడు. 2019లో పునీత్ తొలిసారిగా కవలుదారీ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. పునీత్ స్మాల్ స్క్రీన్ లో కూడా కనిపించాడు. పలు షో లకు హోస్ట్ గా, కొన్నిటికి జడ్జిగా వ్యవహరించాడు. కన్నడద కొట్యాధిపతి షో ను రెండు సీజన్స్ పాటు హోస్ట్ గా వ్యవహరించాడు. 2012, 2013లలో ఈ షో ను విజయవంతంగా నడిపించాడు. అలాగే యూపీ స్టార్టర్స్ కు జడ్జిగా వ్యవహరించాడు. 2019లో మూడోసారి కన్నడద కొట్యాధిపతి షో కు హోస్ట్ గా వ్యవహరించాడు.

సినిమాలే కాదు.. సామాజిక సేవ కార్యక్రమాలన్నా పునీత్‌కు మక్కువ ఎక్కువ.. తన తల్లి పార్వతమ్మతో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవాడు. మైసూరులో ఉన్న శక్తి ధర్మ ఆశ్రమం మంచి చెడ్డలు ఆయనే చూసుకునేవారు. కన్నడలో టాప్ హీరో అవడంతో ప్రచారకర్తగా కూడా పునీత్ కు చాలా డిమాండ్ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు టీమ్ కు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు. పునీత్‌ మరణవార్త విని ఆయన అభిమానులంతా షాక్‌కు గురవుతున్నారు..

Tags

Read MoreRead Less
Next Story