సినిమా

RGV Meets Perni Nani: సినిమా వర్సెస్‌ పొలిటికల్‌ వార్‌కు ఇది ఇంటర్వెల్ మాత్రమే..!

RGV Meets Perni Nani: తాము చేస్తున్నదే, తాము చెప్పిందే జరుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా తేల్చేశారు మంత్రి పేర్ని నాని.

RGV Meets Perni Nani: సినిమా వర్సెస్‌ పొలిటికల్‌ వార్‌కు ఇది ఇంటర్వెల్ మాత్రమే..!
X

RGV Meets Perni Nani: సినిమా వర్సెస్‌ పొలిటికల్‌ వార్‌లో శుభం కార్డు పడిందా? చిన్న ఇంటర్వెల్‌ మాత్రమేనా? ప్రభుత్వం సినిమా టికెట్ల తగ్గింపును వెనక్కి తీసుకుంటుందా.. అలాగే కంటిన్యూ చేస్తుందా? సాధారణంగా దీనిపై పెద్ద చర్చ జరగాల్సింది. కానీ, నిన్న వర్మ-నాని మధ్య చర్చల తరువాత ప్రభుత్వం ఇచ్చిన స్టేట్‌మెంట్‌ చూస్తే.. ఇక చర్చలు అనవసరం అనే విషయం తేలిపోయింది.

తాము చేస్తున్నదే, తాము చెప్పిందే జరుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా తేల్చేశారు మంత్రి పేర్ని నాని. మరి వర్మ రాయబారం సంగతేంటని ప్రశ్నిస్తే.. కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పారు, అలాంటి అభిప్రాయాలు చెప్పే వాళ్లెవరైనా ఉంటే వచ్చి మాట్లాడొచ్చని తేల్చేశారు. అంటే, ప్రభుత్వం వింటుంది తప్ప.. అభిప్రాయాలు చెప్పినంత మాత్రాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశమే లేదని చాలా స్పష్టంగా చెప్పింది.

తాము పేదవాళ్లని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం కాబట్టి.. సినిమా టికెట్ల రేటు తగ్గింపును వెనక్కి తీసుకునేదే లేదని చెప్పకనే చెప్పింది. ఈ ప్రకటనతో ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే వారే ఉండకపోవచ్చని తెలుస్తోంది. కేవలం అభిప్రాయాలు మాత్రమే వింటా.. నిర్ణయం మాత్రం మారదు అన్నప్పుడు.. ఇక ప్రభుత్వంతో మాట్లాడడం ఎందుకన్న ప్రశ్న సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మంత్రి పేర్ని నానితో జరిగిన భేటీలో వర్మ చాలా సూటిగా, స్పష్టంగా ఐదు ప్రశ్నలు అడిగారు. సినిమా చూసేవాళ్లకి, సినిమా తీసేవాళ్లకు మధ్య ప్రభుత్వం ఎందుకు అని డైరెక్టుగా ప్రభుత్వాన్నే ప్రశ్నించారు. టికెట్‌ రేట్ల విషయంలో మరీ ఇంత వ్యత్యాసం పెట్టడం అనేది అర్ధం లేనిదంటూ చెప్పుచొచ్చారు. సినిమాను పేదవాళ్లకు అందించాలనే తాపత్రయం గాని, అందుకోసం తీసుకొచ్చిన జీవో 35ని గాని తప్పుపట్టారు.

థియేటర్లో ఇచ్చే సౌకర్యాలను బట్టి టికెట్ ధర ఉండాలనే చట్టం ఉన్నప్పుడు.. జీవో 35 అనేది పనిచేయదని వివరించారు. సినిమా షోలను పరిమితం చేయడంపైనా తన ప్రశ్నను సంధించారు వర్మ. షోలు ఎక్కువ ఉంటే తప్పేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీ ఏవైతే అడగాలనుకుందో.. ఆ ప్రశ్నలను సూటిగా అడిగేశారు వర్మ. ఈ విషయాలన్నింటినీ కమిటీ చూసుకుంటుందంటూ మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చి, వర్మకు వీడ్కోలు పలికారు.

సినిమా విషయంలో ప్రభుత్వ నిర్ణయం తప్పు అని వర్మ డైరెక్టుగానే ప్రశ్నించారని చెప్పుకుంటున్నాయి సినీ వర్గాలు. సినిమాను పబ్లిక్‌ కోసం తీయరు అనే విషయాన్ని ప్రధానంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు వర్మ. ఇక చిన్న సినిమా అనే కాన్సెప్టునే తప్పు పట్టారు వర్మ. ఎవరో ఓ వ్యక్తి తనను తాను స్క్రీన్‌ మీద చూసుకోడానికో, తన పేరును టైటిల్స్‌లో చూపించుకోడానికో కోటి రూపాయలు పెట్టి సినిమా తీస్తే.. దాన్ని బతికించాలనే తాపత్రయం ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు.

ఇక ప్రభుత్వం పదే పదే చెబుతున్న విషయం.. తాము 1955 సినిమాటోగ్రఫీ చట్టాన్నే ఫాలో అవుతున్నాం అని. సినిమా రంగాన్ని నాశనం చేసేలా ఉన్న ఆ చట్టాన్ని ఇప్పుడెందుకు మార్చకూడదని ప్రశ్నించారు. 1955లో చేసిన చట్టం 70 ఏళ్ల తరువాత కూడా అవసరమా అనేది వర్మ పాయింట్‌. వీటన్నింటికీ సమాధానం చెప్పగలిగితే.. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్టే. కాని, ప్రభుత్వం మాత్రం అంతా కమిటీ చూసుకుంటుందని, తాము మాత్రం అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది.

Next Story

RELATED STORIES