Annamayya: అన్నమయ్యలో శ్రీవారి పాత్రకు ఆ ఇద్దరు హీరోలు నో.. రూ.50 లక్షల..

Annamayya: అన్నమయ్యలో శ్రీవారి పాత్రకు ఆ ఇద్దరు హీరోలు నో.. రూ.50 లక్షల..
Annamayya: టాలీవుడ్‌లో ఎంతమంది సీనియర్ హీరోలు ఉన్నా వారిలో మన్మథుడిగా పేరు తెచ్చుకుంది నాగార్జున మాత్రమే.

Annamayya: టాలీవుడ్‌లో ఎంతమంది సీనియర్ హీరోలు ఉన్నా వారిలో మన్మథుడిగా పేరు తెచ్చుకుంది నాగార్జున మాత్రమే. మన్మథుడు, కింగ్‌లాంటి పేర్లతో ఇప్పటికీ ఆయన అభిమానులు నాగ్ సినిమాలను ఆదరిస్తుంటారు. ప్రేమకథలతో పేరు తెచ్చుకున్న ఈ అక్కినేని హీరో తన కెరీర్‌లో కొన్ని ప్రయోగాలను కూడా చేసారు. వాటిలో చాలావరకు ఆయనకు హిట్‌నే తెచ్చిపెట్టాయి. ఆయన చేసిన ప్రయోగాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది అన్నమయ్య సినిమా గురించి. అప్పటివరకు అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులకు దగ్గరయిన నాగ్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌ను మరింత చేరువ చేసింది అన్నమయ్య.

రాఘవేంద్ర రావు, నాగార్జున కాంబినేషన్‌లో అప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి. అయితే వీరి కాంబినేషన్‌లో అన్నమయ్య సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. నాగార్జునను అలాంటి పాత్రలో ఎప్పుడూ ఊహించుకోని తన అభిమానులు సినిమాను విమర్శించారు కూడా. కానీ అనూహ్యంగా ఈ సినిమా నాగ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా మిగిలిపోయింది. 1997లో విడుదలయిన ఈ సినిమా భారీ కలెక్షన్లను కూడా వసూలు చేసింది. అయితే అన్నమయ్య సినిమాలో సుమన్ చేసిన వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం దర్శకేంద్రుడు ముందుగా వేరే హీరోను అనుకున్నారట.

అన్నమయ్యగా నాగార్జున ఎంతటి నటన కనబరిచాడో.. దానికి పోటీగా వెంకటేశ్వర స్వామిగా చేసిన సుమన్‌ కూడా పోటాపోటీగా నటించాడు. అయితే ఆ పాత్ర సుమన్ చేయాల్సింది కాదట. అప్పటికే నాగార్జున స్టార్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే భక్తుడిగా అన్నమయ్య పాత్రలో కనిపించే ఆయన వెంకటేశ్వర స్వామి పాదాలపై పడే సీన్లు సినిమాలో చాలానే ఉంటాయి. అందుకే వెంకటేశ్వర స్వామిగా నటించే నటుడు సీనియర్ అయితే బాగుంటుందని శోభన్ బాబును సంప్రదించాడట దర్శకేంద్రుడు.

కానీ అప్పటికే సినిమాల నుండి రిటైర్ అయిన శోభన్ బాబు ఆఫర్‌ను నేరుగా కాదనలేక 50 లక్షల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసారట. అందుకే శోభన్ బాబును వద్దనుకుంది మూవీ టీమ్. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం బాలయ్య బాబును కూడా అనుకున్నారట. కానీ ఇద్దరు స్టార్ హీరోలు అలాంటి పాత్రలు చేస్తే ఫ్యాన్స్‌లో నెగిటివిటీ వస్తుందని వెనక్కి తగ్గారు. చివరిగా సుమన్‌ అయితే బాగుంటుందని అనుకున్న దర్శకేంద్రుడు ఆయనను పిలిపించి ఫోటోషూట్ చేసారు. అప్పుడే సుమన్‌ను వెంకటేశ్వర స్వామిగా సెలక్ట్ చేసి తాను మంచి నిర్ణయమే తీసుకున్నానని అనుకున్నారట.

Tags

Read MoreRead Less
Next Story