SIIMA Awards : 5 కేటగిరీల్లో నామినేషన్స్ పొందిన 'కార్తికేయ 2'

SIIMA Awards : 5 కేటగిరీల్లో నామినేషన్స్ పొందిన కార్తికేయ 2
ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, కామెడీ రోల్, సినిమాటోగ్రాఫర్ విభాగాల్లో నామినేట్ అయిన చిత్రం

సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2022కు సంబంధించి ఇటీవలే దక్షిణాదికి చెందిన నాలుగు భాషలకు సంబంధించిన నామినేషన్స్‌ను ప్రకటించింది. అందులో అత్యంత ఎక్కువగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’ముందంజలో ఉంది. ఈ సినిమా ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, కెమెరామెన్, స్టంట్స్, కొరియోగ్రఫీ, సంగీతం వంటి పలు విభాగాల్లో 11 నామినేషన్స్ దక్కించుకుంది. అయితే దీంతో పాటు ఈ ఏడాదిలో ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'కార్తికేయ 2'.. 5 కేటగిరీల్లో నామినేషన్స్ సొంతం చేసుకుందని తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ ద్వారా వెల్లడించింది. అందులో ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, కామెడీ రోల్, సినిమాటోగ్రాఫర్ విభాగాలు ఉన్నాయి.

2022లో రిలీజైన ఈ సినిమా మిస్టరీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా రూపొందింది. చందూ మొండేటి రచించి దర్శకత్వం వహించిన ఈ మూవీ.. 2014లో వచ్చిన 'కార్తికేయ'కు సీక్వెల్. ఈ సినిమాలో హీరో నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ కేర్ నటించారు. యూరప్‌లోని స్పెయిన్ , పోర్చుగల్, గ్రీస్‌తో పాటు భారతదేశంలో ప్రధానంగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఈ మూవీ చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ , సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని అందించారు. దాదాపు రూ.15−30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన 'కార్తికేయ 2'.. 13 ఆగస్టు 2022న విడుదలైంది. విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకుంది. 2022లో కమర్షియల్‌గా విజయం సాధించి 6వ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

ఇదిలా ఉండగా ఇటీవల ప్రకటించిన సైమా అవార్డ్స్ నామినేషన్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన 'సీతారామం' కూడా ఉంది. ఈ సినిమా మొత్తంగా ఉత్తమ చిత్రంతో పాటు పలు విభాగాల్లో 10 నామినేషన్స్ దక్కించుకుంది. ఈ మూవీతో పాటు సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘టీజే టిల్లు’, అడివి శేష్ నటించిన ‘మేజర్’ మూవీ ఉత్తమ చిత్రం క్యాటగిరిలో నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఈ సైమా వేడుక సెప్టెంబర్ 15,16 తేదిల్లో దుబాయ్‌లోని DWTCలో జరగనుంది.



Tags

Read MoreRead Less
Next Story