55 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాలు పాడని పాటలేదు

55 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాలు పాడని పాటలేదు
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు. గత 40 రోజులుగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం ఎజిఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు, సంగీత ప్రేమికులు తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయారు..

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు. గత 40 రోజులుగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం ఎజిఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు, సంగీత ప్రేమికులు తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయారు. కాగా ఎస్పీ బాలసుబ్రమణ్యం నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు చదువుకుంటూనే పాడటం నేర్చుకున్నారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు.

ఆయన సంగీతానికి నడిచే నిఘంటువు. పాటలతో ప్రయోగాలు చేయడంలో సాటిలేని మేటి. ఆయన వివిధ భాషల పాటలు వింటే... అందులో ఆయన మాతృభాష ఏదో తెలుసుకోవడం కష్టమే. ఆయన గొంతులో ఓంకార నాదాలు సంధానమై నిలుస్తాయి. పాటలు పంచామృతాలై ప్రవహిస్తాయి. కట్టుకథలు చెప్పి కవ్వించినా అవి మనకు కితకితలే పెడతాయి. గాత్రంతో గమ్మత్తులు చేయడంలో బాలూయే నెంబర్ వన్ అని చెప్పొచ్చు. 20 ఏళ్ల వయసులో ఉన్న జోరే... ఏడు పదుల వయసులోనూ కనిపించడం బాలు ప్రత్యేకత. ఇంతకీ ఇదంతా ఆయనకు ఎలా సాధ్యమైంది?

55 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాలు పాడని పాటలేదు

తన గాత్రంతో పాటకు జీవం పోసే బాలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఎంత చెప్పినా... చెప్పాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. 55 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన పాడని పాటలేదు. పలికించని భావం లేదు. నటులు తమ నటనతో పాత్రకు ప్రాణం పోస్తారు. కానీ బాలు తన గాత్రంతో జీవం పోస్తారు. అలా ఆయన గళంలో జీవం పోసుకున్న వేలాది పాటలు... సినీ పరిశ్రమనే రస ప్లావితం చేశాయి. అదే బాలులో ఉన్న ప్రత్యేకత. ఇది చాలా తక్కువ మంది సంగీత కళాకారుల్లో మాత్రమే కనిపించే గొప్పదనం..

ఐదున్నర దశాబ్దాల సినీ ప్రస్థానంలో 40 వేలకుపైగా పాటలు పాడిన బాలు

సంగీతంలో ఓ రుషిలా బాలసుబ్రహ్మణ్యం కృషి

పాటంటే సంగీతానికి అనుగుణంగా గళం విప్పడం కాదు. సందర్భానికి తగినట్లు ప్రాణం పోయడం. అది బాలుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే సినిమాల్లోని పాత్రల్లో లీనమైపోయి పాడతారు. దాదాపు ఐదున్నర దశాబ్దాల ఆయన సినీ గీతాల ప్రస్థానంలో 40 వేలకుపైగా పాటలు పాడారు. అయితే అందులో దేనికదే ప్రత్యేకం. ఆయన పాడిన ఎన్ని పాటలు విన్నా ఎక్కడా బోరుకొట్టదు. ఏ రెండు పాటల స్వరం ఒకే రకంగా అనిపించదు. అదే ఆయనలో ఉన్న ప్రత్యేకత. సంగీతంలో ఓ రుషిలా కృషి చేయడం బాలు స్పెషాలిటీ..

30 ఏళ్ల వయసులో 70 ఏళ్ల వయసువారి స్వరం పలికించిన బాలు

వయసుకు మించి సంగీతంలో ప్రయోగాలు చేసిన దిట్ట బాలసుబ్రహ్మణ్యం. 30 ఏళ్ల వయసులో 70 ఏళ్ల స్వరం పలికించడం అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. శంకరాభరణం చిత్రంలో ఆయన పాడిన దొరకునా ఇటువంటి సేవా అనే పాటనే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story