Bhuvana Chandra : ఈయన రాసిన ఎక్కువ వానపాటల్లో నటించింది ఆ హీరోయినే..!

Bhuvana Chandra : ఈయన రాసిన ఎక్కువ వానపాటల్లో నటించింది ఆ హీరోయినే..!
కదనరంగానికి.. కవన రంగానికి చాలా దూరమే ఉంది. కానీ ఈ దూరాన్ని అక్షరదారాలతో కుట్టి ఈ రెండు రంగాల్లోనూ అదరగొట్టిన రచయిత భువనచంద్ర.

కదనరంగానికి.. కవన రంగానికి చాలా దూరమే ఉంది. కానీ ఈ దూరాన్ని అక్షరదారాలతో కుట్టి ఈ రెండు రంగాల్లోనూ అదరగొట్టిన రచయిత భువనచంద్ర. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో దేశానికి సేవలందించిన భువనచంద్ర.. తర్వాత సాహిత్యంపై ఉన్న పట్టు, సినిమా పాటలపై ఉన్న మక్కువతో మద్రాస్ నుంచి తన పాటల తోటకు అక్షర బీజాలు చల్లుకున్నారు. ఆ తోటకు దర్శకుడు విజయబాపినీడు ప్రోత్సాహక నీరందిస్తే.. తర్వాత అది కాస్తా.. ఎన్నో ఉత్సాహభరితమై తెలుగు పాటలను పూసింది.. ఆ పూతకు అక్షరపరిమళాలద్దిన భువనచంద్ర పుట్టిన రోజు ఇవాళ.

ఎన్నో హుషారైన గీతాలతో తెలుగు సినిమాను ఉరకలెత్తించిన రచయిత భువనచంద్ర. ఎన్నో మధురమైన పాటల్ని రాసిన ఆయన పాటలన్నీ ఆణిముత్యాలే. వాన పాటల్లో ప్రత్యేకతను నిలుపుకుని, డబ్బింగ్ సినిమాలకు అధర మధురమైన పాటలు రాసి.. సందర్భానుసారం హృదయాల్ని బరువెక్కించి.. ఉత్సాహాలు రేకెత్తించిన కలం భువనచంద్రది. దశాబ్ధం పాటు ఉద్ధండులైన కవుల మధ్యా తనదైన అస్తిత్వాన్ని అద్భుతమైన సాహిత్యంతో నిలుపుకున్న ప్రతిభ భువనచంద్ర సొంతం.

కృష్ణాజిల్లా నూజివీడులో పుట్టిన భువనచంద్రకుచిన్నతనం నుంచే పుస్తకపఠనం హాబీ. ఆ హాబీ అన్ని రకాల సాహిత్యాలను చదివేలా చేసింది. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నా పుస్తకపఠనం ఆగలేదు. ఇది సాహిత్యంపై మక్కువ పెంచింది. 1971లో ఇండో పాక్ యుద్ధంలో పాల్గొన్నారాయన. పద్దెనిమిదేళ్ల ఉద్యోగం తర్వాత రిటైర్ అయ్యారు. తర్వాత ఆ కోటాలో వేరే ఉద్యోగం వచ్చినా.. కాదనుకుని సినిమా పాటల రచయిత కావాలని మద్రాస్ వెళ్లారు.

మద్రాస్ లో జంధ్యాల తన సినిమాకు అవకాశం ఇస్తానన్నా కుదరలేదు. తర్వాత విజయబాపినీడు తీసిన నాకూ పెళ్లాం కావాలి చిత్రంలో పాట రాసే అవకాశం వచ్చింది. అయితే గుర్తింపు తెచ్చింది మాత్రం ఖైదీ నెంబర్ 786.. చిత్రంలోని గువ్వా గోరింకతో.. ఈ పాట రాయడానికి చాలా తక్కువ టైమ్ తీసుకున్నారట భువనచంద్ర. ఆ పాట చాలా పెద్ద పేరు తెచ్చింది. విజయబాపినీడు చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమాలోనూ ఓ హుషారైన పాట భువనచంద్ర రాయాల్సిందే అన్నట్టుగా మారింది వీరి కలయిక. గ్యాంగ్ లీడర్ లో ని బోలో బోలో రాణి క్యా చాహియే అనే పాట నాటి యూత్ ను ఎంత ఉర్రూతలూపిందో చెప్పక్కర్లేదు.

భువనచంద్ర పాటల్లో తాత్వికత, సందేశాల్లాంటివి పెద్దగా కనిపించవు. వింటున్నంత సేపూ మనసు ఉరకలెత్తేలా ఉంటుంది. అందుకు తగ్గ ట్యూన్స్ కూడా అతనికి సెట్ అవుతాయోమో అన్నట్టుగా ఆయన పాటలుంటాయి. అలాగని ద్వందార్థాలూ పెద్దగా కనిపించవు. సింపుల్ వర్డ్స్ తో వింటున్న శ్రోతలను కాసేపు తమను తాము మైమరచిపోయేలా అతి తక్కువ టైమ్ లోనే పాటలు రాయగల ఘనుడు భువనచంద్ర.

ఇక భువనచంద్ర డబ్బింగ్ సినిమాలకు పాటలు రాయడంలో చాలా ఎక్స్ పర్ట్. ఒరిజినల్ పాటలోని లిప్ సింక్ కుఅనుగుణంగా అద్భుతమైన పదాలతో చూస్తున్నది డబ్బింగ్ సాంగ్ అన్న డౌట్ రాకుండా రాస్తాడు. భారతీయడు చిత్రంలోని అన్ని పాటలనూ ఆయనే రాశారు. కానీ అవన్నీ ఒరిజినల్ సాంగ్స్ లాగానే కనిపిస్తాయి మనకు నాటి నేటి వరకూ అన్ని రకాల సంగీత దర్శకులతోనూ పనిచేశారు భువనచంద్ర. అందరూ తననెంతో ఆదరించారని వినమ్రంగా చెబుతారు. అలాగే అందరు స్టార్ హీరోలకూ పాటలు రాశారు. అవి వారి ఇమేజ్ లకూ తగ్గట్టుగా ఉండటం భువనచంద్ర ప్రత్యేకత.

సరళమైన పదాలతోనే సరదాగా ఉండేలా రాయడం భువనచంద్ర శైలి. అందుకే ఆ పాటలు విన్నవెంటనే గుర్తుండిపోతాయి. సందర్భాన్ని దాటకుండా, సాహిత్యంలో సంక్లిష్టత లేకుండా వినగానే ఆహ్లాదంగా అనిపిస్తాయీ పాటలు. ట్యూన్ కు తగ్గట్టుగా సింపుల్ గా ఉండేలా వినసొంపైన సాహిత్యాన్ని సమకూర్చడం ఒకరకమైన ప్రత్యేకతగానే చెప్పాలి.. భువన చంద్ర కు ఏఆర్ రెహ్మాన్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అప్పట్లో చాలామంది తెలుగు సంగీత దర్శకుల వద్ద రెహ్మాన్ కీ బోర్డ్ ప్లేయర్ గా ఉన్నప్పుడు మాగ్జిమం సాంగ్స్ అన్నీ ఆయన ట్యూన్ చెబితే రాసినవని చెబుతారు. అందుకే తను సంగీతం అందించిన చాలా సినిమాలకు తెలుగులో భువనచంద్రతో రాయించుకున్నాడు రెహ్మాన్.. వాటిలో కొన్ని పాటలు వింటే అది రాసింది ఈయనా అని ఈ తరం వారు ఆశ్చర్యపోతారు..

భువనచంద్ర చిరంజీవికి రాసిన పాటలన్నీ దాదాపు సూపర్ హిట్స్ అయ్యాయి. అది యాదృచ్ఛికమే అయినా.. మరో స్పెషల్ ఏంటంటే భువనచంద్ర వాన పాటలను అద్భుతంగా రాస్తారు. ఆయన రాసిన ఎక్కువ వానపాటల్లో నర్తకిగా వాణివిశ్వనాథ్ కనిపించడం విశేషం. ఆ రోజుల్లో రెయిన్ సాంగ్ అంటే చాలు రెండో థాట్ లేకుండా భువనచంద్రే అన్నంతగా పేరు పడిపోయింది.. అప్పట్లో చిరంజీవికి సూపర్ హిట్ సాంగ్స్ గా నిలిచిన ఎంట్రీ సాంగ్స్ నో లేక, స్పెషల్ సాంగ్స్ నో మళ్లీ ఇప్పుడు ఆయన తనయుడు రీమిక్స్ చేస్తున్నాడు. వీటిలో కూడా భువనచంద్ర రాసిన పాటలే ఎక్కువగా ఉండటం విశేషం.

కొన్ని పాటల ట్యూన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఏకబిగిన పాట రాసుకుంటూ వెళ్లేలా ఉండవవి. పోనీ సందర్భమేమైనా క్లిష్టంగా ఉంటుందా అంటే అదీ లేదు. అలాంటి ట్యూన్స్ కు ఆకట్టుకునే సాహిత్యాన్ని కూర్చడం పెన్నుమీద సామే. అలాంటి సాములు చేయడంలో భువనచంద్ర ఎక్స్ పర్ట్. సీతారత్నంగారి అబ్బాయిలోని ఈ పాట సాహిత్యం కంటే ట్యూన్ ముందు ఆకట్టుకుంటుంది. కానీ ఆ ట్యూన్ ను డామినేట్ చేసేలా సాహిత్యంతో సర్ ప్రైజ్ చేస్తాడు

హుషారైన పాటల స్పెషలిస్ట్ గా పేరు పడిని భువనచంద్ర మాగ్జిమం పాటలతో ఆ పేరును నిలపుకున్నాడు. సంగీత దర్శకుని ట్యూన్ కు అనుగుణంగా, సన్నివేశానికి అతికినట్టు సరిపోయేలా ఉంటూనే.. ఆయా హీరోల బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయేలా సాహిత్యాన్ని కూరుస్తాడు.

ఇక వెంకటేష్ కూ భువన చంద్ర రాసిన పాటలు మంచి పేరునే తెచ్చాయి. మల్లీశ్వరి సినిమాలో గుండెల్లోగులాబీల ముళ్లు ప్రేమలో పడ్డ ప్రతివారూ పాడుకునేలా ఉంటుంది. భువన చంద్ర పాటలు ఇప్పటి కుర్రకారుకూ కొత్త హుషారు పుట్టిస్తాయి. అందుకు ఆయన ఎంచుకున్న సాహితీ పంథా ఓ కారణం అనుకోవచ్చు. ఒకప్పుడు పాటంటే పాఠంలా ఉండేది. కానీ ఇప్పుడు పాటంటే బీటంతా నిండిపోయేలా ఉంటోంది. ఈ విషయంలో భువనచంద్ర ఇరవైయేళ్ల క్రితమే ఇరవైయేళ్లు ముందుకు ఆలోచించారు. కానీ అప్పట్లో వాయిద్యాల హోరు మరీ ఇంతలా లేదు కాబట్టి.. ఆయన పాటా ఆకట్టుకుంది..

తమిళ సంగీత దర్శకుడు హ్యారిస్ జైరాజ్ కూ భువనచంద్రకూ మధ్య కూడా మంచి అండర్ స్టాండింగ్ ఉంది. అందుకే ఆయన కంపోజ్ చేసిన డబ్బింగ్ సినిమా పాటలకూ ఎక్కువగా భువనచంద్రనే సాహిత్యానందిస్తుంటాడు. అటు హ్యారీస్ కూ భువన సాహిత్యమంటే ఇష్టమట. సందర్భానుసారంగా తన కలంతో అద్భుతాలు ఆవిష్కరించగల సిద్ధహస్తులు భువనచంద్ర. సందర్భమేదైనా దానికి తగ్గ పదబంధాలను పేర్చి పాటలల్లగల నేర్పరి. మనసును హత్తుకునే పాటలెన్నింటికో ప్రాణప్రతిష్ట చేసిన రచయిత భువనచంద్ర. ఈయన పేరు వింటే హుషారు పాటలే ఎక్కువగా గుర్తొచ్చినా మంజునాథ చిత్రంలో శివుడంటే ఇష్టం లేని భక్తుడు దైవదూషణకు పాల్పడే సందర్భాన్ని ఓహో గరళ కంఠ..నీ మాటంటే ఒళ్లుమంట అంటూ.. సామాన్యీకరించిన తీరుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

ఓ రకంగా చెప్పాలంటే తెలుగులో భువనచంద్ర లాంటి లిరిసిస్ట్ లేడనే చెప్పాలి. డబ్బింగ్ సినిమాలు, వాన పాటలు, హుషారైన గీతాలు.. మెలోడీ ప్రధాన మైన పాటలూ.. ఇలా అన్నిట్లోనూ పెన్నేసిన ఘనత భువనుడి సొంతం. అది అతనికే తెలిసిన ప్రక్రియేమో అన్నట్టుగా ఉండే కవన యానం. మరి భువన చంద్ర ముందు ముందు కూడా ఇలాగే మరిన్ని హుషారైన గీతాలో ఆడియన్స్ ను అలరించాలని కోరుకుంటూ మరోసారి ఈ కదన కవన యోధుడికి బర్త్ డే విషెస్ చెబుదాం..

Tags

Read MoreRead Less
Next Story