Tillu Square : 'టికెటే కొనకుండా' సాంగ్ వచ్చేసింది.. రామ్ వాయిస్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Tillu Square : టికెటే కొనకుండా సాంగ్ వచ్చేసింది.. రామ్ వాయిస్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్
'డీజే టిల్లు స్క్వేర్' నుంచి టికెటే కొనకుండా సాంగ్ రిలీజ్

'డీజే టిల్లు'తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన హీరో సిద్దు జొన్నలగడ్డ.. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి రిలీజైన మూవీ ప్రోమో, సాంగ్ ప్రోమోకు భారీ రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు 'టికెటే కొనకుండా' అనే ఫుల్ సాంగ్ విడుదలైంది. దీంతో డీజే టిల్లు నుంచి అప్ డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇది మరింత బూస్టప్ ను ఇస్తోంది.

మేకర్స్ ముందు చెప్పినట్టుగానే టికెట్ ఏ కొనకుండా సాంగ్ ను జూలై 26న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేశారు. మాస్ బీట్స్ తో కాలు కదిపేలా హుషారుగా సాగిన ఈ పాట ప్రస్తుతం సినీ ప్రేక్షకులను, సిద్ధు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 'టిల్లు అన్న డీజే పెడితే' పాట లాగానే,'టికెటే కొనకుండా' పాట కూడా పార్టీలు, పబ్‌ల అనే తేడా లేకుండా ప్రతి చోటా ప్లే అయ్యేలా, యువత అమితంగా ఇష్టపడేలా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. పబ్‌లో మరొక అమ్మాయిని కలిసి, ప్రేమించి మళ్ళీ అవే తప్పులు పునరావృతం చేయకుండా టిల్లును హెచ్చరిస్తున్నట్లుగా ఈ సాంగ్ సాగింది.

తెలంగాణ యాసతో 'డీజే టిల్లు'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సిద్ధు.. ఇప్పుడు స్టార్ బాయ్‌గా ఎదిగాడు. అతను ఆ పాత్రను రూపొందించి, అందులో జీవించిన తీరుకి అతను టిల్లుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం తెలుగు చిత్రసీమలో కల్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. టిల్లు అన్నగా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన సిద్ధు.. ఇప్పుడు మరొక థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ 'టిల్లు స్క్వేర్‌'తో వస్తుండడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరోసారి సిద్దు జొన్నలగడ్డను టిల్లుగా చూడబోతున్నామంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి సినిమా కంటే ఈసారి మరింత వినోదం ఉంటుందని చిత్ర నిర్మాతలు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా పతకాలపై సూర్యదేవర నాగ వంశీ తమ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ 'డీజే టిల్లు'కు సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

'డీజే టిల్లు' చిత్రంలోని సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమా సంగీతం పరంగానే అత్యంత ప్రజాదరణ పొందింది. మెయిన్ గా రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన 'టిల్లు అన్న డీజే పెడితే' పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి, అది టిల్లు పాత్రకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు రాబోయే 'టిల్లు స్క్వేర్' కోసం కూడా రామ్ మిరియాల, సరికొత్త పాటను స్వరపరచి ఆలపించారు. దీంతో ఈ సినిమాలోని పాటలూ బ్లాక్ బస్టర్ అవుతాయని సినీ ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

తాజాగా రిలీజ్ అయిన సాంగ్ తో.. 'టిల్లు స్క్వేర్' చిత్రం డీజే టిల్లుకి మించి సరికొత్త వినోదాన్ని అందించబోతుందని స్పష్టమవుతోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీలో.. ఆమె లుక్, టిల్లుతో ఆమె సంభాషణ ఇప్పటికే వైరల్‌గా మారాయి. మొత్తానికి ఈ పాట టిల్లు స్క్వేర్ పై ఇప్పటికే ఏర్పడిన అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉంది. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story