Trivikram Srinivas: పోసాని ఆ గ్యాప్ ఇచ్చాడు.. త్రివిక్రమ్ మాటల మాంత్రికుడయ్యాడు..

Trivikram Srinivas (tv5news.in)

Trivikram Srinivas (tv5news.in)

Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది.

Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. పేరాల కొద్దీ డైలాగ్స్ ను చెరిపేసి అతి చిన్న పదాలతో పెద్ద భావాల్ని పలికిస్తాడు. అలతి పదాల మాటలతోనే మంత్రముగ్ధులను చేస్తూ మాటల మాంత్రికుడయ్యాడు. అతను రాస్తే సందేశం గుండెలను తాకుతుంది. సన్నివేశం సరికొత్తగా మారుతుంది. అందుకే అతని సినిమా సక్సెస్ కు చిరునామా అయింది. రాతతో మొదలుపెట్టి.. తీతలో తిరుగులేదనిపించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే ఇవాళ.

త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టింది భీమవరంలో. అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్. ముందుగా అతని పెదనాన్న ఇతనికి త్రివిక్రమ్ అనే పేరు పెడదామన్నాడట. కానీ ఫైనల్ గా శ్రీనివాస్ సెట్ అయింది. అందుకే పెదనాన్న కోసం తన కలం పేరును త్రివిక్రమ్ గా మార్చుకున్నాడు శ్రీనివాస్. ఇప్పుడు అదే పేరుతో అంతులేని పేరు తెచ్చుకున్నాడు. వరుస విజయాలతో అగ్రదర్శకుడయ్యాడు. అల వైకుంఠపురములో మూవీతో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేశాడు.

రచయిత పోసాని పరిచయంతో మాటల రచయితగా మారాడు త్రివిక్రమ్. అప్పటికే ఫేమస్ రైటర్ అయిన పోసాని వద్ద ముద్దుల మొగుడు సినిమాకోసం కొన్ని డైలాగ్స్ రాశారు. ఆ టైమ్ కు సినిమా కోసం మాటలు ఎలా రాయాలో తెలియదట త్రివిక్రమ్ కు. అయితే పోసాని బయటకు వెళ్లి వచ్చే లోపు అక్కడి ఫైల్స్ లో మాటలు చూసి ఎలా రాయాలో అవగాహన పెంచుకున్నారట. ఒక్కసారి చూసిన స్క్రిప్ట్ నే మనసులో పెట్టుకుని.. పోసాని వద్ద దాదాపు రెండేళ్ల వరకూ పనిచేశాడు.

నువ్వేకావాలి కంటే ముందు నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన నిన్నే ప్రేమిస్తాకు మాటలు అందించారు. తర్వాత చిరునవ్వుతో, నువ్వునాకు నచ్చావ్, వాసు వంటి చిత్రాలతో అద్భుతమైన రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు త్రివిక్రమ్. అంటే 1999లో వచ్చిన స్వయంవరంతో రచయితగా ప్రస్థానం మొదలుపెడితే, 2002వరకే స్టార్ రైటర్ గా మారిపోయాడు. చాలా సినిమాల్లో దర్శకుడి ప్రతిభ కంటే త్రివిక్రమ్ మాటల తూటాలకే ఎక్కువ పేరొచ్చిందనేది అందరికీ తెలిసిందే.

రచయిత దర్శకుడైతే తను అనుకున్న సన్నివేశాన్ని కాంప్రమైజ్ కాకుండా తెరపై ఆవిష్కరిస్తాడు. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన నువ్వే నువ్వే లో లవ్ ఫీల్ కంటే డైలాగ్స్ డామినేషన్ ఎక్కువగా ఉందనే కమెంట్స్ కూడా వచ్చాయి. దీంతో కొంత టైమ్ తీసుకుని అతడు చేశాడు. మహేష్ లోని మరో యాంగిల్ ను అద్భుతంగా చూపిన సినిమా ఇది. కూల్ గా ఉంటూ ఖూనీలు చేసే పాత్రలో మహేష్ మెస్మరైజ్ చేస్తే.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో బంచ్ ల కొద్దీ పంచులతో ఆడేసుకున్నాడు త్రివిక్రమ్.

అతడు కంటే ముందు మన్మథుడు, మల్లీశ్వరి చిత్రాలకు కథ, మాటలు అందించాడు. దీంతో పాటు రవితేజ హీరోగా నటించిన ఒక రాజు ఒకరాణి చిత్రంలోని అన్ని పాటలను శ్రీనివాసే రాశాడు. ఆ సినిమాలో ఓ పాట కూడా పాడారు. సినిమా పోవడంతో ఒకరాజు ఒకరాణిని ఎవరూ పట్టించుకోలేదు కానీ.. మళ్లీ మన్మథుడు, మల్లీశ్వరి సినిమా విజయాల్లో ఇతని పెన్నుదే పెద్ద స్థానం.

త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్వయంకృషితో స్వయంవరం ప్రకటించుకుని కష్టాలను కూడా చిరునవ్వుతో ఫేస్ చేసిన ప్రతిభావంతుడు. పరిశ్రమలో ఎందరో నిర్మాతలు, హీరోల చేత నువ్వే కావాలి అనిపించుకున్నాడు. జల్సాగా పని చేసుకుంటూ ప్రతి సినిమాకూ ఖలేజా చూపుతూ జులాయిగా బాక్సాఫీస్ వద్ద జూలు విదుల్చుతూ.. అత్తారింటితో అన్నిరికార్డులనూ తుడిచేశాడు. సన్నాఫ్ సత్యమూర్తితో సత్తా చాటి.. అల వైకుంఠపురములోతో ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టిన అతడు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడు.

హీరో ఇమేజ్ ని పూర్తిగా మార్చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్, మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడనగానే.. చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అజ్ఞాతవాసిగా వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరింత కసిగా ఫస్ట్ టైమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేశాడు. అరవింద సమేతవీరరాఘవగా వచ్చిన ఈ మూవీ మంచి హిట్ గా గెలిచింది.

Tags

Read MoreRead Less
Next Story