సినిమా

'ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు'... సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ అద్భుతమైన ప్రసంగం..!

Trivikram Srinivas : 'ఒక మనిషిని మార్చగలిగే శక్తి కేవలం సాహిత్యానికి మాత్రమే ఉంటుంది.. అక్షరానికి మాత్రమే ఉంటుంది'.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.

ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు... సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ అద్భుతమైన ప్రసంగం..!
X

Trivikram Srinivas : 'ఒక మనిషిని మార్చగలిగే శక్తి కేవలం సాహిత్యానికి మాత్రమే ఉంటుంది.. అక్షరానికి మాత్రమే ఉంటుంది'.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సందర్భంలో మాట్లాడిన మాటలు ఇవి.. ఎన్నిసార్లు విన్నా ఒళ్ళు గగుర్పొడిచే ప్రసంగం అది మరి..!

"సీతారామశాస్త్రి గారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు.. నాకున్న పదాలు సరిపోదు... ఎందుకంటే ఆయన మొదటి సినిమా సిరివెన్నెలలో రాసిన మొదటి పాట..."ప్రాగ్దిస వీణియ పైన...దినకర మయూఖ తంత్రుల పైన"..ఈ పాట విన్న వెంటనే నేను తెలుగు డిక్షనరీ అని ఒకటి ఉంటుంది అని కనుక్కున్నాను... దానిని శబ్దరత్నాకరం అంటారని తెలుసుకున్నాను.. అది వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని ప్రాగ్దిస అంటే ఏమిటి.. మయూఖం అంటే ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాను.. అంటే ఒక పాటని అర్ధమయ్యేలాగేనే రాయక్కర్లేదు దానిని అర్ధం చేసుకోవాలి అనే కోరికను పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచినటువంటి వ్యక్తి..

ఆడియన్స్ ఇవే చూస్తున్నారు వాళ్ళకి ఇవే అర్ధమవుతాయి కాబట్టి ఇవే రాయాలి కాకుండా.. వాళ్ళకి అర్ధం చేసుకోవాలనే తపన ఉంటుంది.. ఏదో భీమవరం లాంటి ఊళ్ళో శాఖాగ్రంధాలయం లాంటి ఒక రెండు గదులున్న ఒక లైబ్రరీలో ఒక నిఘంటువుని ఒక పదహారేళ్ళ కుర్రాడు వెతుక్కుని దానిలోంచి ఏదో ఒక అర్ధాన్ని వెతుక్కుని ఆ రోజుకి ఆ తృప్తితో పడుకుంటాడు.. అలాంటి పాట ఏదో ఇంకొకటి రాయాలని, లేదా అలాంటి మాటలు ఇంకొకటి రాయాలని, అలాంటి పని ఇంకొకటి చెయ్యాలని ఒక తపనని రేకెత్తించగలిగిన స్థాయి కవి..

ఎందుకంటే.. అమృతం కురిసిన రాత్రి, బాలగంగాధర్ తిలక్ పుస్తకం చదివినప్పుడు...శ్రీ శ్రీ మహాప్రస్థానం చదివినప్పుడు, కొంపల్లి జనార్ధన్ రావు కవిత చదివినప్పుడు కోసం లాస్ట్ మాటలుంటాయి ముఖ్యంగా అందులో "ఇదిగో ఇక్కడ నిలబడి ఆవాహన చేస్తున్నాను.. అందుకే నా ఈ చాచిన హస్తం " అని "ఆవాహన" అనే మాట వాడటానికి చాలా శక్తి కావాలి, అలాంటి మాట పుస్తకంలో రాయడానికే చాలా కష్టం అంటే , అలాంటి మాటలని అలవోకగా.. సినిమా పాటకి తీసుకొచ్చి ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి.... ముందు అందుకని ఆయనని మనం గౌరవించాలి.

ఇప్పుడు ఇందాకే మనం చూశాం మనమందరం చిరంజీవి గారిని చూసిన వెంటనే చప్పట్లు కొడతాం ఈలలేస్తాం కానీ అందులో .. "తరలిరాదా తనే వసంతం..తన దరికిరాని వనాల కోసం.." అనే మాట రాయడానికి సీతారామశాస్త్రి గారికి ఎంత గట్స్ ఉండాలి.. అది దర్శకుడిని ఒప్పించడానికి, అది ప్రొడ్యూసర్ తో సినిమాలో పెట్టించడానికి ఎంత ధైర్యం ఉండాలో ఒక దర్శకుడిగా నాకు తెలుసు...అందుకని ఆయన పాదాలకి నేను నమస్కారం చేస్తున్నాను. అలాగే వెంకటేష్ బొబ్బిలిరాజా లాంటి సినిమాలో "బలపం పట్టి భామ బళ్ళో.." అనే పాటను మనం అందరం వింటాం. అలాంటి పాటలో కూడా "కొమ్మల్లో కుకులు.. కొండల్లో ఎకోలు" ఎకో (Echo) అంటే ప్రతిధ్వని , అంత surrealistic poetryని ఒక దివ్యభారతి, వెంకటేష్ మధ్య ఉండేటువంటి డ్యూయెట్లో రాయొచ్చు... అక్కడ స్పేస్ లేదు... స్పేస్ ని ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన అంత చక్కగా వాడుకున్నాడు.

కమర్షియల్ సినిమా అంటే దిగజారుడు సాహిత్యం లేదంటే అర్ధంపర్థం లేని శబ్దాలతో కలిసిన పాటలని కాకుండా వాటి మధ్యలో కూడా అంత ఇరుకు సందుల్లో కూడా... అంటే చార్మినార్ పక్కనున్న సందులోకి పట్టుకెళ్లి ఒక పోర్షియో కార్ ని నడపమంటే ఎట్లా నడపగలం ? ఆటోనే నడవడం కష్టం ..అలాంటి ప్లేసులో ఒకడికి ఒక అలాంటి కోటి రూపాయల కార్ ఇచ్చి నడపమంటే నడపగలడా? ఆయన పాటలు కూడా అలాంటివే... ఇంత ఇరుకు ప్రదేశంలో...హీరోల తాలూకు ఇమేజ్.. దర్శకుల తాలూకు అర్ధంలేనితనం.. ప్రొడ్యూసర్ తాలూకు వ్యాపార విలువులు...ప్రేక్షకులకు తాలూకు అర్ధం చేసుకోలేనితనం... వీటన్నింటి మధ్యలో కూడా ఒక గొప్ప పాటని ఇవ్వడానికి రాత్రిళ్ళు ఆయన టేబుల్ మీద ఆయన ఖర్చుపెట్టిన క్షణాలు...ఆయన ఖర్చుచేసుకున్న జీవితం.. ఆయన వదులుకున్న కుటుంబం..ఆయన మాట్లాడలేని మనుషులు... ఆయన పిల్లలతో కూడా ఆయన మాట్లాడలేరు.. మాట్లాడుతుంటే నాకు ఆవేశం వచ్చేస్తోంది..నేను అందుకే ఇలాంటి వేడుకలకి ఎందుకురాను అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను కాబట్టి..

ఆయన నాకు తెలిసి ప్రపంచం అంతా పడుకున్న తరువాత ఆయన లేస్తాడు...ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు...అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఆయన...ఆయన పదాలు అనే కిరణాలు తీసుకుని , అక్షరాలు అనే తూటాలతో ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరుతాడు... రాత్రి పూట "రండి... నాకు సమాధానం చెప్పండి..." అంటూ మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలని మన మీదకి సంధిస్తాడు.. మన ఇంట్లోకి వస్తాడు.. మన హాలులో కూర్చుంటాడు..మన బెడ్రూమ్ లో మన పక్కనే నిలబడతాడు...మనల్ని క్వశ్చన్ చేస్తాడు .. "రా.... ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి" అంటాడు.. మనతోటి..

నేను సింధూరం సినిమాకి వెళ్లాను.. నాకు ఇప్పటికీ గుర్తుంది.. లక్డికాపూల్ అమరావతి థియేటర్లో.. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో .. తినడానికే డబ్బులు లేని సమయం , సినిమాకి టికెట్ కొనుక్కోవడం బాగా కష్టమైన రోజులు, సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్తే సినిమా మొత్తం అయ్యిపోయింది కానీ చివర్లో ఏదో ఒక అసంతృప్తి ఉంది.. ఆ చివర్లో ... "అర్ధ శతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రమందామా .." ఆ ఒక్క పాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేనెక్కడికి వెళ్తున్నానో కూడా నాకు తెలీదు...

ఒక మనిషిని ఇంతలా కదిలించగలిగే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది, అక్షరానికి మాత్రమే ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను , ఆయన సినిమా కవి అవ్వడం మూలంగా ముఖ్యంగా తెలుగు సినిమా కవి అవ్వడం మూలంగా ఇక్కడ మిగిలిపోయాడేమో అని నాకు నిజంగా బాధ ఉంది. ఆయన సినిమా పాటలు రాసినందుకు నేను నిజంగా చింతిస్తున్నాను.. ఎందుకంటే సినిమా పాటలకి సాహిత్య విలువ లేదు.. అని అందరికి ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది...

అందుకే మనం మల్లాది రామకృష్ణ శాస్త్రిని గౌరవించుకోలేకపోయాం , జాణ తెలుగుని తెలుగుకి పరిచయం చెయ్యాలనుకున్నాడు..దేవులపల్లి కృష్ణశాస్త్రిని పట్టించుకోలేదు.. ఎందుకంటే ఆయన కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి లాంటి గొప్ప భావ కవిత్వం రాశాడు...ఆయన గురించి మనకి ఎవరికీ తెలీదు.. అలాగే దాశరధి చాలా గొప్ప గొప్ప పుస్తకాలు రాశాడు , గొప్ప గొప్ప సాహిత్యం ....... వీళ్ళందరూ కేవలం తెలుగు కవులు అవ్వటం మూలంగా, సినిమాలకి పాటలు రాయడం మూలంగా ఎందుకూ పనికి రాకుండాపోయారు.

ముక్త పాదగ్రస్తం ,అర్ధోక్తి అలంకారాలు ఇలాంటి వాటితో అత్యద్భుతమైన పాటలు రాసిన వేటూరి సుందరరామమూర్తి గారు, వచన కవిత్వానికి,నోబెల్ స్థాయి వచన కవిత్వం రాయగలిగినటువంటి సీతారామశాస్త్రి గారు మన అందరి మధ్యలో అమాయకంగా వెనకాల చైర్లో కూర్చుండి పోయాడు.. వీళ్ళందరూ తెలుగు సినిమాకి పాటలు రాయడం వాళ్ళ దురదృష్టం...మన అందరి అదృష్టం.. నేనేమైన తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి.. నా మాటలు ఓపికగా విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు"

Next Story

RELATED STORIES