సూర్య పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. ఇద్దరు అభిమానులు మృతి

సూర్య పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. ఇద్దరు అభిమానులు మృతి
అభిమాన నటుడి బర్త్ డే వేడుకల కోసం బ్యానర్ కడుతూ అనంతలోకాలకు..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. జూలై 23న తమ అభిమాన నటుడి ప్రత్యేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యానర్‌ను ఏర్పాటు చేస్తుండగా ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వీరు ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లాకు చెందినట్టు సమాచారం. ఎన్ వెంకటేష్, పి సాయి అనే ఇద్దరూ నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులుగా తెలుస్తోంది.

తమ ఫెవరేట్ హీరో బర్త్ డేను గ్రాండ్ సెలబ్రేట్ చేయాలని ఆశించిన ఫ్యాన్స్ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. సూర్య పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సూర్య బ్యానర్ ను కడుతుండగా.. ఇద్దరు యువ అభిమానులు కరెంట్ షాక్ కు గురయ్యారు. దీంతో వారు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. పోలీసుల విచారణ ప్రకారం, ఇనుప రాడ్‌కు అమర్చిన ఫ్లెక్స్ ప్రమాదవశాత్తు ఓవర్ హెడ్ విద్యుత్ వైర్‌కు తాకడంతో ఇద్దరు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ సంఘటన అకస్మాత్తుగా జరిగింది. ఇందులో ఎవరి జోక్యానికీ ఆస్కారం లేదు. కానీ పోలూరి సాయి సోదరి అనన్య మాత్రం తన బాధను తెలియజేసి, తన సోదరుడి మరణానికి కళాశాల బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

"విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ గురించి కళాశాల మాకు హామీ ఇచ్చింది. కానీ వారు హాస్టల్‌లోని విద్యార్థులను రక్షించడంలో, పర్యవేక్షించడంలో విఫలమయ్యారు. నా సోదరుడి మరణానికి కళాశాలే బాధ్యత వహించాలని" అని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ సంఘటన సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో.. సినీ వర్గాల్లో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషాద సంఘటనపై స్పందించిన సూర్య.. బాధిత కుటుంబాలకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఏ అవసరం ఉన్నా తాను వారికి తోడుంటానని ధైర్యం చెప్పారు. అంతే కాదు ఈ సందర్భంగా వారితో వీడియో కాల్ లో మాట్లాడి, వారిపై సానుభూతి వ్యక్తం చేశారు. దీంతో సూర్య మంచి మనసును అంతా మెచ్చుకుంటున్నారు. కాగా ఈ కష్ట సమయంలో అభిమానులు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమ సానుభూతిని, మద్దతును అందిస్తున్నారు.

సిరుత్తై శివ దర్శకత్వంలో సూర్య రాబోయే చిత్రం 'కంగువ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. చారిత్రాక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పది భాషల్లో రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story