అభినయ సౌందర్యం.. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం..

అభినయ సౌందర్యం.. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం..
Soundarya: సౌందర్య.. తెలుగుతెరపై ఈ పేరు ఒక చెరగని సంతకం. అందం, అభినయం కలబోసిన అద్భుతం ఆ పేరు.

HBD Soundarya: సౌందర్య.. తెలుగుతెరపై ఈ పేరు ఒక చెరగని సంతకం. అందం, అభినయం కలబోసిన అద్భుతం ఆ పేరు. ఒక తరం మహిళా ప్రేక్షకులను ప్రభావితం చేసిన సౌందర్య.. మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చిలిపిదనపు పాత్రలతో పరిచయమై.. ఆ తర్వాత దక్షిణాది సినిమాకే ఆప్తమిత్రురాలిగా మారిపోయింది. దశాబ్ధానికి పైగా తన నట వైదుష్యంతో ప్రేక్షకులను సమ్మోహనపరచిన ఆ సౌందర్యం అకస్మాత్తుగా మాయమైనా.. ఆ నటన, ఆ ప్రతిభ అజరామరం.

మహానటి సావిత్రి తర్వాత.. ఆ బిరుదుకు అర్థాన్నిచ్చిన నటి సౌందర్య. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం సౌందర్యకు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్వాలిటీతోనే అగ్రహీరోలందరి సరసనా నటించి.. అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకుంది. సావిత్రి తర్వాత తిరుగులేని మహిళాభిమానుల్ని సంపాదించుకున్న నటి కూడా సౌందర్యే. అందాల ప్రదర్శనకు ఆమడదూరం నిలిచి.. సహజ సౌందర్యం ఆభరణంగా పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య.


చారడేసి కళ్లు, గులాబీ చెక్కిళ్లు.. చెక్కుచెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం కలిపేస్తే కనిపించే రూపం సౌందర్య. నాజూకైన అందం ... అసాధారణమైన అభినయం ... అంతకు మించిన వ్యక్తిత్వం సౌందర్యకు ఆభరణాలు.. సిల్వర్ స్క్రీన్ పై ఈ అందాలబొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోయింది. తీరైన కట్టుబొట్టుతో పుత్తడి కాంతుల మెరుపులతో.. చూడచక్కని నటనతో లక్షలాది మంది తెలుగు అభిమానులను సంపాదింకుంది సౌందర్య. ఓ దశలో సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొంది.. తెలుగు వారి మనసుల్లో ఎన్నటికీ చెరగని స్థానం సంపాదించుకుంది.

సౌందర్య పరిశ్రమలోకి వచ్చే టైమ్ కు ఇక్కడంతా గ్లామర్ నాయికల హవా నడుస్తోంది. హీరోయిన్ అంటే ఎక్కువగా అందాల ప్రదర్శనకే పరిమితమైన పీరియడ్ అది. అలాంటి సందర్భంలో ఎంట్రీ ఇచ్చినా ఎన్నడూ కాంప్రమైజ్ కాలేదు. తెలుగులో రైతు భారతం తన ఫస్ట్ సినిమా. కానీ మనవరాలి పెళ్లి ముందుగా విడుదలైంది. అయితే గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం రాజేంద్రుడు గజేంద్రుడు.


చూడగానే ఆకట్టుకునే రూపం కావడంతో తొలి మలి సినిమాలు పెద్ద విజయాలు సాధించకపోయినా ఆఫర్స్ వెల్లువెత్తాయి. వరుసగా నంబర్ వన్, మాయలోడు, మేడమ్, టాప్ హీరో, అల్లరి ప్రేమికుడు, అమ్మదొంగ వంటి సినిమాలు చేసేసింది. ఈ సినిమాలు అప్పట్లో సౌందర్యకి తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అయితే అక్కినేని నాగార్జున హీరోగా ఈవివి సత్యనారాయణ తెరకెక్కించిన హలో బ్రదర్ తో తొలి భారీ హిట్ ను అందుకొన్నది.. ఈ సినిమాలో సౌందర్య నటన తో పాటు గ్లామర్ కు కూడా జనం ఫిదా అయిపోయారు.

1995లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు స్పెషల్ ఇమేజ్ ను తెచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా, మహిళా ప్రేక్షకుల్లో సౌందర్యపై అభిమానం పెరగడానికి కారణం అమ్మోరు చిత్రమే. ఈ మూవీలో సౌందర్య తన ఫస్ట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అమ్మోరులో సౌందర్య నటనకు తొలి నంది అవార్డ్ తో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా దాసోహయ్యాయి. ఇంకా పసితనపు ఛాయలు కూడా కనిపించే అమ్మోరులో ఆమె నటన ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. అటుపై సౌందర్య ఇక ఎన్నడూ వెనుతిరిగి చూసిందే లేదు.

సౌందర్య చేసే సినిమాల్లో ఆమె పాత్రలు స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించాయి. ఏ పాత్ర చేసినా తనే పాత్రగా మారడం తన శైలి. అందుకే పెదరాయుడు వంటి సినిమాలో చిన్న పాత్రలోనూ పెద్ద ఇంపాక్ట్ వేయగలిగింది. పెదరాయుడు సినిమాలో సౌందర్య పాత్ర టూ షేడ్స్ లో నడుస్తుంది. పొగరుబోతు కోడలుగానూ...అత్తింటి ఔన్నత్యాన్ని అర్ధం చేసుకున్న గృహిణిగానూ రెండు విభిన్న ధోరణుల్నీ అద్భుతంగా నటించి మెప్పించింది.


అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సౌందర్య. అయితే అప్పటి హీరోయిన్లలో ఉన్న బెస్ట్ క్లాలిటీ ఏంటంటే.. హీరోల స్టార్గమ్ కంటే కథలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు వంటి హీరోలతో పాటు జెడి చక్రవర్తి, వినోద్ కుమార్, నరేష్, సురేష్, వినీత్ వంటి స్మాల్ స్టార్స్ తో నూ నటించింది. ముఖ్యంగా జగపతిబాబుతో తనది బెస్ట్ పెయిర్ అంటారు. ఈ జంట అంత సహజంగా ఉండేది.

అమాయకత్వం నిండిన పాత్రలైనా.. ఆత్మవిశ్వాసం మెండైన పాత్రలైనా.. ఇట్టే ఒదిగిపోతుంది సౌందర్య. దొంగాట సినిమాలో అమాయకురాలైన పల్లెటూరి అమ్మాయిగా, అంతపురంలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న యువతిగా సౌందర్య నటనకు ఫిదా కానివారెవ్వరు.. ఈ కారణంగానే సౌందర్య ఉంటే సినిమా హిట్.. అనే సెంటిమెంట్ బలంగా ఉండేది ఆ టైమ్ లో. అలాగే హీరోలు సైతం సౌందర్య డేట్స్ కు అనుగుణంగా తమ డేట్స్ అడ్జెస్ట్ చేసుకున్న రేంజ్ తనది.

సౌందర్య, వెంకటేష్ జోడీకి పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్సే. ముఖ్యంగా పెళ్లి చేసుకుందాం. అప్పటికే తను టాప్ హీరోయిన్. అయినా ఓ లైంగిక బాదితురాలి పాత్రలో నటించేందుకు ఒప్పుకుంది. ఒక రకంగా ఇదిద సాహసోపేతమైన నిర్ణయం. చాలామంది ఆమెది రాంగ్ డెసిషన్ అన్నారు. ఇలాంటి పాత్రలు చేస్తే కెరీర్ సమస్యలో పడుతుందని హెచ్చరించారు. కానీ తను పాత్రను ప్రేమించింది. అలాగే అంతకు ముందే వెంకటేష్ తో చేసిన పవిత్రబంధంలో తన నటన ముందు వెంకటేష్ సైతం తేలిపోయాడంటే అతిశయోక్తి కాదు.

ఆర్టిస్ట్ అంటే చాలెంజింగ్ రోల్స్ వస్తే వదలకూడదు. కానీ చాలామంది ఇమేజ్ కు ఇబ్బంది అవుతుందేమో అని అలాంటి పాత్రలు వదులుకుంటారు. కానీ సౌందర్య మాత్రం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే లైంగిక దాడి బాధితురాలిగా నటించేందుకు ఒప్పుకుని ఆశ్చర్యపరిచింది. పెళ్లి చేసుకుందాం సినిమాలో ఈ పాత్ర చేసి ప్రేక్షకులతోనే కాదు.. పరిశ్రమలోనూ ప్రతి ఒక్కరి చేతా శెభాష్ అనిపించుకుంది.

వెంకటేష్ తో సౌందర్యది బ్లాక్ బస్టర్ పెయిర్. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే సినిమా హిట్టే. పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్ళి చేసుకుందాం, రాజా, జయం మనదేరా, దేవిపుత్రుడు వంటి సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు. దేవీపుత్రుడు తప్ప మిగతావన్నీ బ్లాక్ బస్టర్సే.


సౌందర్య దర్శకుల నటి. మంచి పాత్రైతే చాలు.. వెంటనే ఒప్పుకుంటుంది. అలాగే దర్శకుల కోసం ఇమేజ్ నూ పక్కనబెట్టగల పెద్ద మనసూ ఉంది. అందుకే బాబూ మోహన్, అలీ వంటి కమెడియన్స్ తో కూడా డ్యూయొట్ చేయగలిగింది. ఆ సినిమాల్లో హీరో వేరే. కానీ సిట్యుయేషన్ కోసం దర్శకుల మాట వినడం తన ధర్మం అని ఫీలవడం వల్లే ఆ పాటలు చేసింది.

పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనిషిగా సౌందర్యకి పేరు ఉంది. వీటన్నింటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ తిరుగులేని తరిగిపోని అభిమానాన్ని సంపాదించుకుంది తను. దక్షిణాదిలోని అన్ని భాషల్లో టాప్ హీరోలతో నటించినా.. తను టాప్ హీరోయిన్ అన్న అహం దరిచేరనివ్వని అరుదైన అభినేత్రి సౌందర్య. అందుకే ఆమెను తెలుగువారు తమ ఆడపడుచుగానే చూశారు.. జూనియర్ సావిత్రిగా కొనియాడారు.

1994నుంచి 2001 వరకూ సౌందర్యది కెరీర్ పరంగా పీక్ స్టేజ్. యేడాదికి అన్ని భాషల్లో కలిపి పది సినిమాల వరకూ విడుదలయ్యేవంటే తనెంత మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టో అర్థం చేసుకోవచ్చు. అయితే నటిగా శిఖరాలను చూసిన సౌందర్య కెరీర్లో 2001తర్వాత విజయాల సంఖ్య మరీ తగ్గిపోయింది. అయినా ఆమె స్థానం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు.

ఒక నటి కెరీర్ లో ఎన్ని వైవిధ్యమైన సినిమాలు చేయొచ్చో అన్నీ చేసిన నటి సౌందర్య. తనలాగా అన్ని డిఫరెంట్ మూవీస్ చేసిన హీరోయిన్ ఆ తర్వాత మనకు లేరంటే అతిశయోక్తి కాదు. 9నెలలు, అరుంధతి వంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు నా మనసిస్తారా, ఎదరులేని మనిషి వంటి సినిమాల్లో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలూ చేసింది. తెలుగులో సౌందర్య చేసిన చివరి సినిమా మోహన్ బాబు హీరోగా నటించిన శివ్ శంకర్.


2002లో సినిమాలు బాగా తగ్గిన తర్వాత సౌందర్ నిర్మాతగా మారింది. ద్వీప అనే కన్నడ సినిమాను నిర్మించింది. గిరీష్ కాసరవల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిలిమ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ లో జాతీయ అవార్డులు, నాటులు కర్ణాటక ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. అలాగే మూడు ఫిలిమ్ ఫేర్ పురస్కారాలూ లభించాయి.

నటిగా సౌందర్య స్థానం భర్తీ చేయలేనిది. తనలాంటి మరో నటిని మనం దక్షిణాదిలోనే ఇంత వరకూ చూడలేదు. పెళ్లి తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరింది సౌందర్య. ఆపార్టీ తరఫున హెలీకాప్టర్ లో ప్రచారానికి బయలుదేరింది. కానీ ఆ ప్రయాణం టేకాఫ్ కావడానికి ముందే తన లైఫ్ ఎండ్ అయింది. హెలీకాప్టర్ కూలిపోయి ఆ అభినయ సౌందర్యం మంటల్లో ఆహుతి అయిపోయింది. లక్షలాది మంది అభిమానుల కన్నీటి సాక్షిగా ఆ సౌందర్యం శాశ్వతంగా కనుమరుగైంది.

-కామళ్ల బాబూరావు



Tags

Read MoreRead Less
Next Story