Vishwaksen : బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్న విశ్వక్ సేన్

Vishwaksen : బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్న విశ్వక్ సేన్
వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్న విశ్వక్ సేన్

వయసు పైబడుతున్నా టాలీవుడ్ లో పెళ్లి ఊసెత్తని హీరోలు చాలా మందే ఉన్నారు. మామూలుగానే సెలబ్రెటీ పెళ్లవుతుందంటేనే ఆడియెన్స్.. వాళ్లు ఎవరికి వివాహం చేసుకుంటున్నారు, వాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటీ అన్న విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఆయన ఇటీవల చేసిన ఓ పోస్టే. ఇన్నాళ్లుగా తనపై కురిపించిన ప్రేమ, మద్దతుకు అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞుడిగా ఉంటానని సోషల్ మీడియా ద్వారా చెప్పారు. దాంతో పాటు ఇప్పుడు జీవితంలో మరో కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలియజేసేందుకు ఎంతో సంతోషిస్తున్నానన్నారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన రాసుకువచ్చారు. అంతే కాదు ఈ నోట్ తర్వాత అబ్బాయి, అమ్మాయి ఎమోజీలను కూడా పోస్టులో తెలిపారు. దీంతో ఈ పోస్టు వైరల్ గా మారింది. ఇంకేముందు విశ్వక్ సేన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది.

విశ్వక్ సేన్ చేసిన ఈ పోస్టుతో ప్రేక్షకులు, ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అని పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా విశ్వక్ ప్రస్తుతం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జంటగా నేహా శెట్టి నటిస్తుండగా, హీరోయిన్ అంజలి కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన మూవీలోని విశ్వక్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

హైదరాబాద్ కి చెందిన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత కూతురు, విశ్వక్ సేన్ లు చాలా కాలం నుంచే ప్రేమించుకుంటున్నారని, ఇప్పుడు ఇద్దరి ప్రేమ విషయం విశ్వక్ సేన్ ఇంట్లో వాళ్ళతో పాటు అమ్మాయి ఇంట్లో కూడా తెలిసిందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఇరువైపుల పెద్దలు కూడా వాళ్ళ పెళ్ళికి అంగీకరించారని, అందుకే విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో ఆ విధంగా పోస్ట్ పెట్టాడనే ప్రచారం కూడా సాగుతోంది. మరి ఈ రూమర్స్ నిజమా, లేదంటే పుట్టించనవేనా అనేది త్వరలోనే తెలియనుంది.


Tags

Read MoreRead Less
Next Story