Makhaya Ntini: కోహ్లీని రెచ్చగొట్టారో.. మీ పని అయిపోయినట్లే

Makhaya Ntini: కోహ్లీని రెచ్చగొట్టారో.. మీ పని అయిపోయినట్లే
బౌలర్లకు దక్షిణాఫ్రికా మాజీ బౌలర్‌ ఎన్తిని సూచనలు... అత్యుత్తమ బౌలర్‌ అతడేనన్న రిచర్డ్స్‌...

ప్రతిష్ఠాత్మకమైన వన్డే ప్రపంచ కప్‌ (World Cup 2023) భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచేందుకు ప్రధాన జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ దిగ్గజ క్రికెటర్లు ఈ టోర్నీలో ఎవరు అత్యుత్తమంగా రాణిస్తారనే దానిపై అంచనాలు వేస్తున్నారు. కొందరు మాజీలు తమ ఆటగాళ్లతో పాటు వేరే దేశాల క్రికెటర్లకు కూడా సలహాలు ఇస్తున్నారు.

ప్రపంచకప్‌ టోర్నీకి ముందు ముందు దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌(Former South African fast bowler) మఖయా ఎన్తిని( Makhaya Ntini) బౌలర్లకు కీలక సూచనలు చేశాడు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ.. భారత స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ(Virat Kohli)ని మాత్రం రెచ్చగొట్టద్దొని హితవు పలికాడు. ఎలాంటి స్లెడ్జింగ్‌ చేయకుండా( not to sledge) తమ పని ఏదో బౌలర్లు చూసుకోవాలని సూచించాడు. ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీని (Virat Kohli) స్లెడ్జింగ్‌ చేయొద్దని, బౌలర్‌ ఎవరైనా సరే స్లెడ్జింగ్‌ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. ఏమీ అనకుండా ఉంటే.. అతడే విసుగుగా భావిస్తాడని, అప్పుడు ఔట్ చేసేందుకు బౌలర్లకు అవకాశం లభిస్తుందని కూడా సూచించాడు.


కోహ్లీ గురించి తమ బౌలర్లకు చెప్పేదొక్కటే అని, అతడు బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఎవరూ ఒక్క మాట కూడా అనొద్దని మళ్లీ మళ్లీ చెబుతున్నానని ఎన్తిని తెలిపాడు. స్లెడ్జింగ్‌ చేస్తే విరాట్‌ చేతుల్లో ఘోర పరాభవం తప్పదని కూడా స్పష్టం చేశాడు. విరాట్‌కు బౌలింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు స్మార్ట్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎన్తిని తెలిపాడు. భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ సెమీస్‌కు చేరతాయని, దక్షిణాఫ్రికా ఛాంపియన్‌గా నిలిచి ట్రోఫీని తీసుకు వస్తుందని భావిస్తున్నాని ఎన్తిని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరోవైపు ప్రపంచకప్‌ టోర్నీలో పాకిస్థాన్‌ యువ పేస్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది (Shaheen Afridi) అత్యుత్తమ ఆటతీరు కనబర్చి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలుస్తాడని విండీస్ దిగ్గజ సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ (Sir Viv Richards) అభిప్రాయపడ్డాడు. వన్డే ప్రపంచకప్‌లో షాహీన్‌ అఫ్రిది అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలుస్తాడని కూడా అన్నాడు. షాహీన్‌ అఫ్రిది ఇప్పటివరకు 27 టెస్టుల్లో 105 వికెట్లు, 39 వన్డేల్లో 76 వికెట్లు, 52 అంతర్జాతీయ టీ20ల్లో 64 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (Jos Buttler) ఈ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తాడని దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ అంచనా వేశాడు.

Tags

Read MoreRead Less
Next Story