విరాట్‌ టెస్ట్‌ ప్రయాణానికి 11 ఏళ్లు

విరాట్‌ టెస్ట్‌ ప్రయాణానికి 11 ఏళ్లు


అభిమానుల గుండెల్లో రారాజుగా ఎదిగిన కింగ్‌ కోహ్లీ తన టెస్ట్‌ సిరీస్‌ అరంగ్రేటం చేసి నేటితో 11 ఏళ్లు పూర్తైంది. 2008లో మొదటి వన్డే మ్యాచ్‌ ఆడినప్పటికీ టెస్ట్‌లో అడుగు పెట్టేందుకు కొంత సమయం పట్టిందనే చెప్పాలి. 2011, జూన్‌ 20వ తేదీన వెస్ట్‌ ఇండీస్‌తో తన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 19 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు (4) రెండో ఇన్నింగ్స్‌లో (15) రన్స్‌ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లో ఫాస్ట్‌ బౌలర్‌ ఫిడెల్‌ ఎడ్వర్డ్స్‌ చేతిలో ఔట్‌ అయ్యాడు. విరాట్‌ బ్యాటింగ్‌తో నిరాశపరిచినా ఇండియా ఆ మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

టెస్ట్‌ ఫార్మాట్‌లో తనదైన మార్క్‌

2011లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన కోహ్లీ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఇప్పటివరకు 109 టెస్టులు ఆడి, 48.71 సగటుతో 8479 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు ఉండడం విశేషం. 2019లో పూణెలో సౌత్‌ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 254 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్‌లోనే అత్యధిక స్కోర్‌. 2018లో క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు కూడా పొందాడు.

సచిన్‌ను అధిగమించగలడా..?

సచిన్‌ తర్వాత బ్యాటింగ్‌లో అంతటి పేరు తెచ్చుకున్న ప్లేయర్‌ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్‌ కోహ్లీనే. ఇది ప్రతి క్రికెట్‌ అభిమాని చెప్పే మాట. వన్డే, టీ-20, టెస్ట్‌ ఇలా అన్ని ఫార్మాట్లలో తనదైన ముద్ర వేసుకున్నాడు.

ఈ సమయంలోనే సచిన్‌ సాధించిన రికార్డులను కోహ్లీ మాత్రమే బద్దలుకొట్టగలడని అనేక మంది క్రికెట్‌ విశ్లేకుల అభిప్రాయం, ఫ్యాన్స్‌ కూడా అదే ఆశిస్తున్నారు. అయితే, కోహ్లీ ఇప్పుడున్న ఫార్మ్‌ని చూస్తుంటే అది పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది.

WTCలో తన ఆటపై విమర్శలు

ఇటీవల జరిగిన ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌లో భారత్‌ ఓటమి క్రికెట్‌ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన తీరుపై సత్వరా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా నాలుగో ఇన్నింగ్స్‌లో (49) కీలకమైన దశలో ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బాల్‌ను టచ్‌చేసి ఔట్‌ అవడం విమర్శలకు దారి తీసింది. అయితే, ఆటలో గెలుపు ఓటములు షరా మామూలేనని మరికొందరు కోహ్లీని అక్కునచేర్చుకున్నారు.

ఏది ఏమైనా.. కింగ్‌ కోహ్లీ టెస్ట్‌ సిరీస్‌ ప్రయాణం భారత క్రికెట్‌ రంగంలో ఓ అద్భతం. విరాట్‌ ఆట తీరు, వెనకడుగు వేయనితనంతో కెప్టెన్‌గా భారత క్రికెట్‌ జట్టును భుజాల మీద మోసిన తీరు సర్వత్రా ప్రశంసనీయం.

Tags

Read MoreRead Less
Next Story