చెన్నై సూపర్ కింగ్స్‌పై వికెట్ నష్టపోకుండా ముంబై ఇండియన్స్ ఘన విజయం

చెన్నై సూపర్ కింగ్స్‌పై వికెట్ నష్టపోకుండా ముంబై ఇండియన్స్ ఘన విజయం

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌కు జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. చెన్నై నిర్ధేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని... ముంబై ఇండియన్స్ జట్టు వికెట్ నష్టపోకుండా 12 ఓవర్ల 2 బంతుల్లోనే చేధించింది. ముంబై బ్యాటింగ్‎లో ఓపెనర్లు ఇషాన్ కిషన్ 37 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్సర్లతో 68 రన్స్ చేశాడు. మరోవైపు డికాక్ 37 బంతుల్లో 5ఫోర్లు 2సిక్సర్లతో 46 పరుగులు సాధించాడు. ఇద్దరు ఓపెనర్లు నాటౌట్‎గా నిలిచి ముంబై జట్టుకు విజయాన్ని అందించారు. చెన్నైపై విజయం సాధించిన ముంబై ఇండియన్స్‎.... పాయింట్ల పట్టికలో తొలిస్థానానికి చేరుకుంది.

అంతకుముందు టాస్ ఓడిన చెన్నై జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‎కు దిగింది. తొలి ఓవర్‎లోనే చెన్నైకి గట్టి దెబ్బ తగిలింది. ఆ ఓవర్ ఐదో బంతికి రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి నుంచి చెన్నై వికెట్ల పతనం ప్రారంభమైంది. బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినట్టే వచ్చి పెవిలియన్‌కు క్యూకట్టారు. మూడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. అంబటి రాయుడు 2, జగదీశన్ సున్నా, డుప్లెసిస్ ఒక పరుగు తీశారు. 2 ఓవర్ల 5 బంతుల్లో మూడు పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ 16, జడేజా 7 పరుగులు చేశారు.

శామ్ కరన్ ఒంటరి పోరాటంతో చెన్నై 114 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో కరన్ 52 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి బౌల్డయ్యాడు. దీపక్ చాహర్ డకౌట్ కాగా, శార్దూల్ ఠాకూర్ 11, ఇమ్రాన్ తాహిర్ 13 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ నాలుగు వికెట్లు తీసుకోగా, బుమ్రా, చాహర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కౌల్టర్ నైల్‌కు ఓ వికెట్ దక్కింది. దీంతో చెన్నై స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులకు మాత్రమే పరిమతమైంది.

Tags

Read MoreRead Less
Next Story