ఐపీఎల్‌లో అసలు మజా సండే ఒక్కరోజే..

ఐపీఎల్‌లో అసలు మజా సండే ఒక్కరోజే..
ఐపీఎల్‌లో క్రికెట్ అభిమానులు కోరుకుకున్న అసలు మజా సండే ఒక్కరోజే కనిపించింది. దుబాయ్‌ వేదికగా పంజాబ్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి బంతి వరకు ఆసక్తికరంగా సాగింది..

ఐపీఎల్‌లో క్రికెట్ అభిమానులు కోరుకుకున్న అసలు మజా సండే ఒక్కరోజే కనిపించింది. దుబాయ్‌ వేదికగా పంజాబ్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి బంతి వరకు ఆసక్తికరంగా సాగింది.. మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌ వేశారు.. అయితే, అది కూడా టై కావడంతో మరోసారి సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు.. అయితే, చివరకు పంజాబ్‌ పైచేయి సాధించి మరో విజయాన్ని నమోదు చేసింది. టాస్‌ గెలిచి ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. డికాక్‌ 43 బంతుల్లో మూడు ఫక్షర్లు, మూడు సిక్సర్లతో 53పరుగులు చేయగా.. పోలార్డ్‌, కౌల్టర్‌ నైల్‌ కూడా మెరవడంతో ముంబై భారీ స్కోరు చేసింది.. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులే చేసింది. కేఎల్‌ రాహుల్‌ 51 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 77 పరుగులు చేశాడు.. కౌల్టర్‌నైల్‌ వేసిన 19వ ఓవర్‌లో జోర్డాన్, హుడా చెరో బౌండరీ బాదడంతో గెలుపు లక్ష్యం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా, జోర్డాన్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. దీంతో మ్యాచ్‌ టై అయింది. తొలి సూపర్‌ ఓవర్‌లో బూమ్రా రెండు వికెట్లు తీసి పంజాబ్‌ను ఐదు పరుగులకే కట్టడి చేశాడు. ఆ తర్వాత ముంబై కూడా ఐదు పరుగులే చేయగా.. సూపర్‌ ఓవర్‌ కూడా టై అయింది.. దీంతో మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన ముంబై వికెట్‌ కోల్పోయి 11 పరుగులు చేసింది.. తర్వాత గేల్‌, మయాంక్‌ బరిలోకి దిగి పంజాబ్‌కు విజయాన్ని అందించారు. ఐపీఎల్‌ చరిత్రలో డబుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌ ఇదే కావడం విశేషం.

అంతకు ముందు జరిగిన ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓడించింది.. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగి టైగా ముగిసింది.. ఆ తర్వాత సూపర్‌ ఓవర్‌లో ఫెర్గ్యూసన్‌ అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతాకు విజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 36 పరుగులు, త్రిపాఠి 23, నితీశ్ రాణా 29, మోర్గాన్ 34, కార్తీక్ 29 పరుగులు చేశారు. ఇక 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ ఆరంభం నుంచి తడబడుతూ వచ్చింది. కీలక వికెట్లు కోల్పోవడంతో కోల్‌కతా విజయం ఖాయంగా కనిపించింది. అయితే, డేవిడ్ వార్నర్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్‌లో హైదరాబాద్ విజయానికి 18 పరుగులు అవసరం కాగా, చివరి బంతికి రెండు పరుగులు మిగిలాయి. ఒకే పరుగు తీయడంతో స్కోర్లు సమమయ్యాయి. ఫలితంగా సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్‌ ఓవర్‌లో కోల్‌కతా బౌలర్‌ ఫెర్గ్యూసన్‌ అదరగొట్టాడు.. డేవిడ్‌ వార్నర్‌ను తొలి బంతికే బౌల్డ్‌ చేశాడు.. మూడో బంతికి సమద్‌ బౌల్డ్‌ అయ్యాడు. మూడు పరుగుల విజయ లక్ష్యంతో క్రీజ్‌లోకి వచ్చిన కోల్‌కతా బ్యాట్సమెన్‌ జట్టుకు విజయాన్ని అందించారు. అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతాను గెలిపించిన ఫెర్గ్యూసన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Tags

Read MoreRead Less
Next Story