కీలక సమయంలో సత్తా చాటిన సన్‌రైజర్స్

కీలక సమయంలో సత్తా చాటిన సన్‌రైజర్స్

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 121 పరుగుల టార్గెట్‌ను ఆరెంజ్‌ ఆర్మీ 14.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవడంతో ప్లేఆఫ్‌ ఆశల్ని ఇంకా సజీవంగా ఉంచుకుంది. వృద్ధిమాన్‌ సాహా రాణించడంతో పాటు మనీష్‌ పాండే,హోల్డర్‌ ఆకట్టుకోవడంతో సన్‌రైజర్స్‌ సునాయాసంగా విజయాన్ని కైవసం చేసుకుంది. ఇది సన్‌రైజర్స్‌ ఆరో విజయం కాగా, పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి ఎగబాకింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలిస్తే ప్లేఆఫ్‌ బెర్తుకు ఢోకా ఉండదు.

సాధారణ లక్ష్య ఛేదనలో ఆదిలోనే సన్‌రైజర్స్‌ వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ నిరాశపరిచాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన రెండో ఓవర్‌ రెండో బంతికి వార్నర్‌ ఔటయ్యాడు. ఆ తరుణంలో సాహాకు మనీష్‌ జత కలిశాడు.వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మనీష్‌ ఔటయ్యాడు. చాహల్‌ బౌలింగ్‌లో క్రిస్‌ మోరిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. విలియమ్సన్‌విఫలమయ్యాడు. ఉదాన బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఔటైన క్రమంలో సన్‌రైజర్స్‌లో ఆందోళన మొదలైంది. కాగా, హోల్డర్‌ మ్యాచ్‌ను గట్టెక్కించాడు. అభిషేక్‌ శర్మతో కలిసి 27 పరుగులు జత చేయడంతో సన్‌రైజర్స్‌ ఒత్తిడి క్లియర్‌ అయ్యింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌ రెండు వికెట్లు సాధించగా, వాషింగ్టన్‌ సుందర్‌, సైనీ, ఉదానాలకు తలో వికెట్‌ లభించింది.

అయితే..అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆదిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ పడికల్ 5, తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లీ కూడా 7 పరుగులకే ఔట్ కావడంతో బెంగళూరు టీమ్ 28 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ ఫిలిప్‎తో జతకలిసిన డివిలీయర్స్ ఇన్నింగ్స్ చక్కదిద్దే క్రమంలో ఫిలిప్ 32, డివిలియర్స్ 24 పరుగులు చేసి.. వెంటవెంటనే ఇద్దరు ఔట్ అయ్యారు. దీంతో బెంగళూరు స్కోర్‎కు బ్రేక్ పడింది. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోర్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లను కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ బౌలింగ్‎లో సందీప్ శర్మ, హోల్డర్ రెండు వికెట్లు దక్కగా..నటరాజన్, నదీమ్, రషీద్‎లకు తలో వికెట్ దక్కాయి.

Tags

Read MoreRead Less
Next Story