పక్కా ప్లాన్‌తోనే విద్యార్థినిపై అఘాయిత్యం.. ఘట్‌ కేసర్‌ కేసులో విస్తుపోయే విషయాలు

పక్కా ప్లాన్‌తోనే విద్యార్థినిపై అఘాయిత్యం.. ఘట్‌ కేసర్‌ కేసులో విస్తుపోయే విషయాలు
ఫార్మసీ విద్యార్థినిపై కన్నేసిన ప్రధాన నిందితుడు తన స్నేహితులతో ముందుగానే ప్లాన్ ప్రకారం సిద్దంగా ఉన్నాడు.

హైదరాబాద్ నగరశివారు ఘట్‌కేసర్‌లో బీఫార్మసీ విద్యార్ధినిపై జరిగిన అఘాయిత్యం ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. నలుగురు అనుమానిత ఆటో డ్రైవర్లను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వీరు గతంలో పలువురు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్ధినిని మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె మానసికంగా.. శారీరకంగా తీవ్రంగా దెబ్బదినడంతో ఏమి మాట్లాడలే పోతున్నట్లు తెలుస్తోంది.

అయితే దుండుగులు ముందుగా అనుకున్న ప్రకారమే ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధిత విద్యార్థిని మేడ్చల్‌కు సమీపంలోని ఓ కళాశాలలో బీ-ఫార్మసీ చదువుతోంది. గత కొంతకాలంగా ఆమె కాలేజీకి వెళ్లి..వచ్చే సమయంలో ఆటోలో ఇంటికి వెళుతోంది. ఈ క్రమంలో ఆమెపై కన్నేసిన ప్రధాన నిందితుడు తన స్నేహితులతో ముందుగానే ప్లాన్ ప్రకారం సిద్దంగా ఉన్నాడు. రోజులాగానే కీసర మండలం రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సు దిగిన యువతి..తన ఇంటికివెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆటోలో అప్పటికే ఒక మహిళతో పాటు ఇద్దరు ఉన్నారు. కొంత దూరం వెళ్లాక మహిళ, మరికొంత దూరంలో మిగిలినవారు దిగిపోయారు. తన స్టాప్‌ వద్ద ఆటోను ఆపక పోవడంతో బాధిత విద్యార్ధిని తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు పోలీసులకు, స్థానిక నేతలకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపుచేపట్టారు.

ఆటో యంనంపేటకు చేరుకోగానే మరో ఇద్దరు వ్యక్తులు ఆటో ఎక్కి..యువతిని ఘట్‌కేసర్‌ శివారులో బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి మత్తుమందు ఇచ్చారు. అందులోనే అందరూ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అప్పటికే నలువైపులనుంచి పోలీసుల సైరన్ మోగడంతో నిందితులు భయాందోళకు గురయ్యారు. యువతిని వ్యాన్‌ నుంచి కిందకు దించి పక్కనే ఉన్న పొదల్లో పడేసి పరారయ్యారు. సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు బాధితురాలి జాడను గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అన్నోజిగూడలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న రాచకొండ పోలీసులు.. రాంపల్లి చౌరస్తా వద్ద సీసీ కెమెరాలను పరిశీలించి.. మొదట ఆటోను గుర్తించారు. ఆరోజు బాధితురాలితోపాటు ఆటోలో ఉన్న యువకుడు చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా అడ్డాలోని ఆటో డ్రైవర్లను ప్రశ్నించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తును రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పర్యవేక్షిస్తున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్‌, నిర్భయ కేసులు నమోదుచేశారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని రాంపల్లి ఆర్‌ఎల్‌ నగర్ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. వీరిని ఎన్‌ కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

వీరు గతంలోకూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒంటరిగా ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, విద్యార్ధులే లక్ష్యంగా వీరు ఆటోలో ఎక్కించుకొని ఇదే మాదిరిగా.. అత్యాచారాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరు ఓ ముఠాగా ఏర్పడి మహిళలపై అఘాయిత్యాలకు దిగుతున్నట్లు వెలుగు చూసింది. అయితే ప్రతిఘటించకుండా సహాకరిస్తే హాని చేయకుండా వదిలేస్తామని బెదిరించి ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విద్యార్ధిని ప్రతిఘటించడం, పోలీసు వాహనాలు చుట్టుముట్టడంతోనే వారు ఈమెను వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story