దివ్యతేజస్విని హత్యకేసు.. నిందితుడు నాగేంద్రకు 14 రోజుల రిమాండ్

దివ్యతేజస్విని హత్యకేసు.. నిందితుడు నాగేంద్రకు 14 రోజుల రిమాండ్

విజయవాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్యతేజస్విని హత్యకేసులో అరెస్టైన నిందితుడు నాగేంద్రకు విజయవాడ మొదటి చీఫ్‌ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఎస్. కమాలాకర్ రెడ్డి నాగేంద్రకు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీచేశారు. దీంతో పోలీసులు అతన్ని మచిలీపట్నం సబ్ జైల్‌కు తరలించి.. అక్కడ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే కోర్టుకు హాజరయ్యేముందు నాగేంద్రకు ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు చేశారు.

దివ్య హత్యకేసులో పోలీసులు ఇప్పటికే ప్రాధమిక సమాచారం సేకరించారు. పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే 45 మంది సాక్షుల నుంచి వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు. నాగేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం, అతడి ఆరుగురు స్నేహితులను కూడా ప్రత్యేక బృందం విచారించనుంది. దివ్యతో ప్రేమ వివాహం జరిగినట్టు ప్రాథమిక విచారణలో నాగేంద్ర ఇప్పటికే పోలీసులకు తెలియజేశాడు. దివ్యను తాను హత్య చేయలేదని.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు వాంగ్మూలంలో పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తున్నారు. తేజస్విని ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో ద్వారా పోలీసులు మరిన్ని ఆధారాలు ఇప్పటికే సేకరించారు. నాగేంద్రతో రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో కొనసాగానని, ఆ తర్వాత నాగేంద్రలోని సైకో గురించి తెలిసిందని ఆ వీడియోలో దివ్యపేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తులో దివ్య వీడియో కీలకంగా మారనుంది.

లాక్‌డౌన్‌ సమయంలో దివ్య, నాగేంద్ర పెళ్లి చేసుకుని 3 నెలలు కలిసి ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో ప్రేమ పెళ్లిని... దివ్య తల్లిదండ్రులు అంగీకరించలేదు. దివ్యను ఇంటికి తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు.. 4నెలల పాటు ఇంట్లో నిర్బంధించారు. అక్టోబర్‌ 15న దివ్యను తీసుకెళ్లేందుకు నాగేంద్ర వారి ఇంటికి వెళ్లాడు. ఈ సందర్బంగా దివ్య తల్లిదండ్రులతో... వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో దివ్య ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న నాగేంద్ర.. ఇంట్లోకి చొరబడి కత్తితో దివ్యపై దాడికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

దివ్యహత్యజరిగిన సందర్బంగా నాగేంద్రకూడా గాయపడ్డాడు. దీంతో అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నాగేంద్రగాయాలనుంచి కోలుకొని శుక్రవారం డిశ్చార్జ్ అయిన వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ ఐ ఆస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం విజయవాడ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగేంద్రబాబుకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

Tags

Read MoreRead Less
Next Story