ఘట్‌కేసర్‌ బీఫార్మసీ విద్యార్ధిని కిడ్నాప్, అత్యాచారయత్నం కేసులో నలుగురు అరెస్ట్

ఘట్‌కేసర్‌ బీఫార్మసీ విద్యార్ధిని కిడ్నాప్, అత్యాచారయత్నం కేసులో నలుగురు అరెస్ట్
బాధితురాలు తీవ్ర భయాందోళనలో ఉందని, ఏం జరిగిందో చెప్పలేకపోతోందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

హైదరాబాద్‌ శివార్లలో బీ ఫార్మసీ విద్యార్థిని కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో సహా నలుగురిని రాచకోండ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. యువతిపై నిందితులు రాడ్‌తో దాడి చేయడంతోకాలిపై గాయాలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలు తీవ్ర భయాందోళనలో ఉందని, ఏం జరిగిందో చెప్పలేకపోతోందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

దిశను గుర్తుకు తెచ్చే మేడ్చల్ ఘటనతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. స్థానికంగా ఓ కళాశాలలో బీ-పార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న బాధితురాలు సాయంత్రం 6.15 గంటలకు రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సు దిగింది. ఆటో ఎక్కిన తర్వాత ఇంటికి వస్తున్నానంటూ తండ్రికి ఫోన్‌ చేసి చెప్పింది. ఆ ఆటోలో డ్రైవర్‌తో పాటు ఓ మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. కొంతదూరం వెళ్లాక మహిళ దిగిపోయింది. ఆటోలో ఉన్న వ్యక్తి ఫోన్‌ చేసి మరో ఇద్దరిని పిలిపించుకొని మార్గమధ్యలో ఆటోలో ఎక్కించాడు. ఆ విద్యార్థిని దిగాల్సిన స్టేజి వచ్చింది.

ఆటోను ఆపాలని డ్రైవర్‌ను కోరగా ఆపకుండా ఘట్‌కేసర్‌ వైపునకు వేగంగా వెళ్లాడు. భయాందోళనకు గురైన ఆ యువతి ఇంటికి ఫోన్‌ చేసి, తల్లిదండ్రులకు విషయాన్ని వివరించింది. వారు వెంటనే స్థానిక కౌన్సిలర్‌తోపాటు పలువురికి సమాచారాన్ని అందించారు. 100కు డయల్‌ చేశారు. సాయంత్రం 6.29 గంటలకు పోలీసులకు కాల్‌ వెళ్లింది. వెంటనే పోలీస్‌ వ్యవస్థ అప్రమత్తమైంది. భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు విద్యార్థిని ఫోన్‌ సిగ్నల్స్‌ను వెంబడించాయి. అప్పటికే ఆటోలో యన్నంపేట వరకు వచ్చిన దుండగులు ఆమెను ఓ వ్యాన్‌లోకి మార్చారు. ఈ క్రమంలో దాడి చేసి యువతి దుస్తులు చింపేశారు. విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించింది. పెనుగులాట కొనసాగుతుండగానే వ్యాన్‌లో ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఎటు చూసినా పోలీసు వాహనాలు పెద్ద ఎత్తున సైరన్‌లతో తిరుగుతుండడంతో దుండగులు భయపడ్డారు. దాంతో యువతిని అవుటర్‌ రింగ్‌ రోడ్డు అన్నోజిగూడ పాయింట్‌ దగ్గర సర్వీసు రోడ్డు పొదల్లో విసిరేసి పారిపోయారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి పోలీసు వాహనం వచ్చింది. పొదల్లో స్పృహ తప్పి పడి ఉన్న యువతిని చూసిన ఓ ఎస్సై వెంటనే ఆమెను భుజంపై వేసుకొని వాహనంలోకి చేర్చి, వేగంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. 7.50 గంటలకు యువతిని పోలీసులు రక్షించారు. అంటే గంటా ఇరవై నిమిషాల్లో గాలింపు ఆపరేషన్‌ పూర్తిచేసి, ఆమెను రక్షించారు.

పోలీసులు సత్వరం స్పందించడంతోనే తమ కుమార్తెకు ముప్పు తప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. బాధితురాలు సృహలోకి రావడంతో పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. ఘటనపై రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story