హత్రాస్ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య

హత్రాస్ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య
అత్యాచార బాధితురాలి తండ్రిని దారుణంగా కాల్చి చంపేశాడు. ఊహించని ఈ ఘటనతో యూపీ మరోసారి ఉలిక్కిపడింది.

2018లో సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచార ఘటన నిందితుడు మరో ఘోరానికి పాల్పడ్డాడు. ఆత్యాచార బాధితురాలి తండ్రిని దారుణంగా కాల్చి చంపేశాడు. ఊహించని ఈ ఘటనతో యూపీ మరోసారి ఉలిక్కిపడింది.

2018లో గౌరవ్ శర్మ అనే వ్యక్తి.. హత్రాస్ జిల్లాలో ఓ యువతిపై అత్యాచారం చేశాడు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. దీంతో నిందితుడిపై కేసు పెట్టడంతో జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం బెయిల్ మీద వచ్చి గ్రామంలో ఉంటున్నాడు. అప్పటినుంచి ఇరు కుటుంబాల మధ్య అంతర్గతంగా వైరం నడుస్తోంది. ఈ క్రమంలో గౌరవ్ శర్మ ఆత్యాచార బాధితురాలి తండ్రిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు.

గతంలో తనపై వేధింపులకు పాల్పడిన నిందితుడిని జైలుకు పంపించామన్న అక్కసుతోనే తన తండ్రిని కాల్చిచంపాడని బాధితుడి కుమార్తె కన్నీరుమున్నీరైంది. తనకు న్యాయం చేయాలని వాపోయింది.

నిందితుడు గౌరవ్ శర్మతో పాటు కాల్పులకు పాల్పడిన మరికొందరు పరారీలో ఉన్నారని.. ఇప్పటికే ఈ కేసులోగౌరవ్ శర్మ కుటుంబ సభ్యుడు ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

మరోవైపు యూపీలో నేరాలు, ఘోరాలకు అడ్డూ అదుపులేకుండా పోతుందని విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిందితులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని.. జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయాలంటూ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలిచ్చారు.


Tags

Read MoreRead Less
Next Story