కొన ఊపిరితో ఉన్నప్పుడు వామనరావు చెప్పిన పేరు ఆయనదే!

వామనరావు చెప్పినట్టుగా.. కుంట శీను ఎందుకు హత్య చేశాడు

కొన ఊపిరితో ఉన్నప్పుడు వామనరావు చెప్పిన పేరు ఆయనదే!
X

పెద్దపల్లి జిల్లా కవలచర్లలో జరిగిన జంట హత్యలు సంచలనంగా మారాయి. హత్యల వెనుక ఎవరి ప్రమేయం ఉందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాజకీయ నేతలు ప్రమేయం, పోలీసు అధికారుల పాత్ర ఉందని విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.

మంథని నుంచి పెద్దపల్లి వెళ్లే ప్రధాన రహదారి. చుట్టూ వచ్చే పోయే బస్సులు, వాహనాలు. మంథనిలో కోర్టు పని ముగించుకున్న న్యాయవాది గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి.. తమ వాహనంలో హైదరాబాద్‌ వెళ్తున్నారు. మంథని మండలం కలవచర్ల గ్రామం దాటిన తర్వాత... ఓ కారు వారి వాహనాన్ని అడ్డగించింది. అందులో నుంచి దిగిన వ్యక్తుల్ని చూడగానే.. వామనరావు కారు డ్రైవర్‌ అక్కడి నుంచి పరుగులు తీశాడు. కారు దిగి పారిపోవాలని దుండగులు హెచ్చరించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్‌ కారు ఆపి పరారు కాగానే.. దుండగులు విరుచుకుపడ్డారు. కారులో ఉన్న వామన్‌రావు, నాగమణిపై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి.. పరారయ్యారు. వామనరావును రోడ్డుపై పడేసి.. కత్తులతో విచక్షణ రహితంగా చంపిన దృశ్యాలు.. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఇదంతా.. అందరూ చూస్తుండగానే.. నడిరోడ్డుపై జరిగిన కిరాతక చర్య. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వామన్‌రావు, నాగమణిని 108లో పెద్దపల్లి హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే ఇద్దరూ మరణించినట్టు వైద్యులు తెలిపారు.

న్యాయవాది వామనరావు దంపతుల దారుణ హత్య సంచలనంగా మారింది. నెత్తుటి మడుగులో విలవిల్లాడిన వామనరావు... హత్య చేసింది... కుంట శీను అని ఆఖరి మాటలుగా చెప్పారు. అయితే.. ఎవరీ కుంట శీను...? వామనరావు చెప్పినట్టుగా... కుంట శీను ఎందుకు హత్య చేశాడనే విషయం తేలాల్సి ఉంది . కుంట శీనుది.... వామనరావుది ఒకే గ్రామం... అదీ గుంజపడుగు. ఆ గ్రామంలో ఓ స్థల వివాదంపై వామనరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ఈ విషయంలో గతంలోనే వామనరావు, కుంట శీను మధ్య మాటల యుద్ధం జరిగింది. తనకు అడ్డురావొద్దని వామనరావును కుంట శీను హెచ్చరించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హత్య జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు... కొన్ని నెలల క్రితం శీలం రంగయ్య అనే వ్యక్తి మంథని పోలీస్‌ స్టేషన్‌ లాకప్‌లో చనిపోయాడు. ఇందులో సీఐ, ఎస్‌ఐ పాత్ర ఉందని... వామనరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేసులో పోలీసుల్ని ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసును వామనరావు భార్య నాగమణి వాదిస్తున్నారు. పోలీసులు తనపై ఎప్పుడైనా దాడి చేయవచ్చని... అనవసరంగా అరెస్ట్‌ చేయవచ్చని పేర్కొంటూ.. వామనరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. రంగయ్య కేసు పూర్తయ్యే వరకు వామనరావును పోలీస్‌ స్టేషన్‌కు‌ పిలిపించవద్దని, ఉత్తర్వులు లేకుండా అరెస్ట్‌ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. గతంలో రామగుండం సీపీ సత్యనారాయణతో వామనరావు వాగ్వాదానికి దిగారు.

ఓ వైపు కుంట శీను భూఆక్రమణ కేసు, మరోవైపు... లాకప్‌ డెత్‌ కేసు, వీటికి తోడు.. పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పుట్ట మధుకు సంబంధించిన వందల కోట్ల రూపాయల భూవివాదం కేసు, పుట్ట మధు భార్య శైలజ మంథని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవీ అనర్హత కేసు.. వీటన్నింటినీ వామనరావు, ఆయన భార్య నాగమణి వాదిస్తున్నారు. ఆయా కేసులకు సంబంధించి.. కక్ష కట్టిన వ్యక్తులే దాడికి పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా వామనరావే.. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్నప్పుడు కుంట శీను పేరు చెప్పారు.

వామనరావు చెప్పిన కుంట శీను.... టీఆర్‌ఎస్‌ మంథని మండల అధ్యక్షుడిగా, పుట్ట మధు ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. వామనరావు దంపతుల హత్య కేసులో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి పరారైన వ్యక్తుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. హోంమంత్రి మహమూద్‌ అలీ.. డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫోన్‌ చేసి.. కేసుపై చర్చించారు.

Next Story

RELATED STORIES