ప్రేమించి పెళ్లి చేసుకుని.. తనతో ఉండట్లేదని..

ప్రేమించి పెళ్లి చేసుకుని.. తనతో ఉండట్లేదని..
ద్వేషం, పగలతో జీవనం సాగిస్తూ భవిష్యత్ పరిస్థితిపై కొంచెం కూడా ఆలోచనలేకుండా ఉంటున్నారు.

మాట వినకపోతే మరో ఆలోచన లేకుండా కత్తులు దూస్తున్నారు. అడ్డంగా నరికేస్తూ రక్తాన్ని కళ్లజూస్తున్నారు.. ఎంతో జీవితం ఉన్న నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ద్వేషం, పగలతో జీవనం సాగిస్తూ భవిష్యత్ గురించిన ఆలోచనలేకుండా ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె దూరమయ్యేసరికి కసితో రగిలిపోయాడు. కొంచెం కూడా కనికరం లేకుండా ఆమె జీవితానికి చరమగీతం పాడాడు.

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లెకు చెందిన జి.గాయత్రి (20), చింతమాకు పల్లెకు చెందిన ఢిల్లీబాబు (19) పెనుమూరులో డిగ్రీ చదువుతున్నారు. ఇద్దరూ చదువుకునేది వేర్వేరు కాలేజీల్లో అయినా.. పెనుమూరు మార్గంలో కలుసుకునేవారు. వారి స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కులాలు వేరుకావడంతో పెద్దలు ఒప్పుకోరని భావించి గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతిలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు వారిని వెతికి పట్టుకున్నారు. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం గాయత్రి తన తల్లిదండ్రులతో ఉంటానని వెళ్లిపోయింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న గాయత్రి తనతో ఉండట్లేదని ఢిల్లీబాబు కక్ష పెంచుకున్నాడు. అదనుకోసం ఎదురు చూస్తున్నాడు. ఓ రోజు గాయత్రి బంధువుల అమ్మాయితో కలిసి కిరాణా సరుకులు తీసుకురావడానికని స్కూటీపై పెనుమూరుకు వచ్చింది. విషయం తెలుసుకున్న ఢిల్లీబాబు ఆమెను ఎంప్రాళ్లకొత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో అడ్డుకున్నాడు.

మాట్లాడేందుకు ప్రయత్నించగా గాయత్రి నిరాకరించింది. దాంతో ఆగ్రహించిన ఢిల్లీబాబు వెంట తెచ్చుకున్న చాకుతో విచక్షణారహితంగా గొంతుపై, కడుపులో 10 సార్లు పొడిచాడు. అడ్డుపడిన యువతిని కూడా చంపేస్తానని బెదిరించాడు. యువతి సెల్ ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం అందించింది.

గాయత్రి రక్తపు మడుగులో కుప్పకూలిపోవడంతో ఢిల్లీబాబు తన బైక్‌పై పరారయ్యాడు. గాగమ్మ వారిపల్లె సమీపంలో వాహనాన్ని వదిలేసి అడవుల్లోకి పారిపోయాడు. బాధితురాలిని తొలుత పెనుమూరు పీహెచ్‌సీకి, తరువాత వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

గాయత్రి మరణ వార్త తెలియగానే బంధువులు ఆగ్రహంతో ఢిల్లీబాబు ఇంటికి నిప్పు పెట్టారు. అతడి తండ్రిని బంధించి కొట్టారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హత్య, దాడి ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story