సోషల్‌మీడియాలో అలేఖ్య విచిత్ర పోస్టులు.. మోహినిగా పేరు మార్చుకుని..

తనని తాను ప్రపంచ సన్యాసినంటూ చెప్పుకొంది. శివుడు వస్తున్నాడు, పని పూర్తయిందంటూ మరికొన్ని పోస్టులు చేసింది.

సోషల్‌మీడియాలో అలేఖ్య విచిత్ర పోస్టులు.. మోహినిగా పేరు మార్చుకుని..
X

మదనపల్లి జంట హత్యల కేసు నిందితులైన పద్మజ, పురుషోత్తంనాయుడులను సబ్ జైలు నుంచి తిరుపతిలోని రుయా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వారి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు తిరుపతికి తీసుకువెళ్లారు. అంతకుముందు నిందితురాలు పద్మజ.. అందరితో కలిపి మహిళా బ్యారక్ లోనే నన్నూ ఉంచండి అని సబ్ బైలు అధికారులను కోరినట్లు తెలుస్తోంది. ఆమె వినతి మేరకు ఇతర మహిళా నిందితులతో కలిపి ఉంచినట్లు సమాచారం. అందరితో కలిసి భోజనం చేసిందని.. శివనామస్మరణలో గడపడం మినహా ఎవరితోనూ మాట్లాడలేదని జైలు సూపరింటెండెంట్‌ రామకృష్ణయాదవ్‌ తెలిపారు.

మరోవైపు యువతుల హత్యకు ముందురోజు ఉదయం నిందితుల ఇంటికి వచ్చిన మాంత్రికుడు సుబ్బరామయ్యను పోలీసులు విచారిస్తున్నారు. ఈనెల 23న తాయెత్తులు, రుద్రాక్షలు కట్టడానికి పురుషోత్తం ఇంటికి రాగా.. అప్పటికే అక్కడ 40-50 ఏళ్ల వయసున్న మరో వ్యక్తి ఉన్నాడని పోలీసులకు తెలిపాడు. స్పృహలో లేని అలేఖ్య చెవిలో శంఖం ఊదుతున్నాడంటూ మరో వ్యక్తి వివరాలు అందించాడు. జంట హత్యల తర్వాత ఘటనాస్థలికి చేరుకున్న వ్యక్తుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు.

పెద్ద కుమార్తె ఆలేఖ్య మూఢత్వమే ఈ ఘోరానికి కారణమైంది. హత్యలకు ముందు ఆలేఖ్య సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్‌లు.. ఆమె మానసిక స్థితికి అద్దంపడుతున్నాయి. మరణానికి ముందు సోషల్‌మీడియాలో కొన్ని పోస్ట్‌లు పెట్టింది. ఈ నెల 22న తన పేరును మోహినిగా మార్చుకున్న అలేఖ్య... తనని తాను ప్రపంచ సన్యాసినంటూ చెప్పుకొంది. శివుడు వస్తున్నాడు, పని పూర్తయిందంటూ మరికొన్ని పోస్టులు చేసింది. పుట్టుక, చావులు తన చేతుల్లోనే ఉన్నాయని బలంగా నమ్మింది.

లాక్ డౌన్ కారణంగా మదనపల్లె వచ్చిన అలేఖ్య.. నెలల తరబడి ఇంటికే పరిమితమైంది. పుస్తకాలపై ఆసక్తి ఉన్న ఆమె.. లాక్‌డౌన్‌లో అనేక పుస్తకాలు చదివింది. వీటి ప్రభావం అలేఖ్యపై పడినట్లు కన్పిస్తోంది. ఓ ఆధ్యాత్మికవేత్తను తన గురువుగా భావిస్తున్న అలేఖ్య.. తరచూ ఆయన కొటేషన్లను పోస్ట్‌ చేసేది. జుట్టును కొప్పుగా చుట్టుకుని హెయిర్‌ పిరమిడ్‌ అని, దానిని అయస్కాంత శక్తిగా అభివర్ణించేది.

తాను పునర్జన్మలపై ప్రయోగాలు చేశానని.. గతంలో తాను కుక్కను ఇలాగే చంపేసి బతికించానని తల్లిదండ్రులకు అలేఖ్య చెప్పింది. కూతురు మాటల్ని వాళ్లు నమ్మారు. తర్వాత పూజ గదిలోకి వెళ్లి గుండు కొట్టుకుని, బట్టలన్నీ విప్పేసి.. ఒక పల్చటి చీర ధరించింది. అనంతరం నవ ధాన్యాలు పోసిన రాగి చెంబును నోట్లో పెట్టుకుని పూజ గదిలో కూర్చుంది. తర్వాత కొన్ని పూజలు చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో అలేఖ్యను డంబెల్స్‌తో కొట్టి తల్లిదండ్రులు చంపారు.

Next Story

RELATED STORIES