ముదిమి వయసులో బతుకుపై విరక్తి.. వృద్ధ దంపతుల ఆత్మహత్య

ముదిమి వయసులో బతుకుపై విరక్తి.. వృద్ధ దంపతుల ఆత్మహత్య
పిల్లలున్నా చూసే వాళ్లు లేక వృద్ధాశ్రమాల్లో కాలం గడుపుతున్నవారు కొందరు. అయిన వాళ్లెవరూ లేక అనాధల్లా జీవితాల్ని సాగిస్తున్నవారు మరికొందరు.

పిల్లలున్నా చూసే వాళ్లు లేక వృద్ధాశ్రమాల్లో కాలం గడుపుతున్నవారు కొందరు. అయిన వాళ్లెవరూ లేక అనాధల్లా జీవితాల్ని సాగిస్తున్నవారు మరికొందరు. ముదిమి వయసులో పలకరించే వారు లేరని పట్టెడన్నం పెట్టే వారు లేరని దిగులు చెందారు. డబ్బులుంటేనే చూడడం కష్టమైన ఈ రోజుల్లో తమ దగ్గర అవి కూడా లేవని తనువు చాలించారు ఆ వృద్ధదంపతులిరువురూ.

కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండల ప్రధాన కార్యాలయంలోని ఆలయ సమీపంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని బిలోలి ప్రాంతానికి చెందిన గంగాధర్ గిరి (70), మహానంద (65) లకు పిల్లలు లేరు. ఈ క్రమంలో ఉంటున్న ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో పుణ్య క్షేత్రాలు దర్శించుకున్నారు.

తిరిగి తిరిగి నస్రుల్లాబాద్‌లోని కొచ్చేరా మైసమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ వీరిద్దరూ విషం సేవించారు. ఆలయ ప్రాంగణంలో జీవచ్ఛవాల్లా పడిఉన్న దంపతులను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చేసరికి గంగాధర్ అప్పటికే మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న మహానందను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story