అమ్మా ఫోన్ వచ్చింది మాట్లాడు.. తల్లి ఇక లేదని తెలియని చిన్నారి

అమ్మా ఫోన్ వచ్చింది మాట్లాడు.. తల్లి ఇక లేదని తెలియని చిన్నారి
అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన రోగులకు మందులతో పాటు మనోధైర్యాన్ని ఇచ్చి పంపిస్తారు వైద్యులు.

అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన రోగులకు మందులతో పాటు మనోధైర్యాన్ని ఇచ్చి పంపిస్తారు వైద్యులు. వారి మాటలతో సగం రోగం తగ్గిపోయిన భావన కలుగుతుంది పేషెంట్లకు. కానీ ఆ డాక్టరమ్మకు ఏమయ్యిందో ముద్దులొలికే మూడేళ్ల చిన్నారిని వదిలి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది.

కష్టపడి చదివిన డాక్టర్ చదువుకి, ఆకలేస్తే అమ్మా అని ఆమె ఒడిని చేరే చిన్నారని అన్యాయంగా వదిలేసి వెళ్లి పోయింది. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో యువ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడ్డారు. అమ్మ మరణించిన విషయం తెలియక ఫోన్ వస్తే పరుగున వెళ్లి దాన్ని ఆమె మొహం వద్ద పెట్టాడు.

అమ్మ ఇక లేదని.. అమ్మ చనిపోయిందని తెలియని చిన్నారి తల్లి స్పందించకపోవడంతో బిక్క మొహం వేశాడు. ఫోన్ అలాగే పట్టుకుని ఆమెను చూస్తూ ఉండిపోయాడు. లింగాలకు చెందిన కేతావత్ సోమశేఖర్‌కు సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల మండలానికి చెందిన దివ్య (26)తో అయిదేళ్ల క్రితం వివాహమైంది.

భార్యాభర్తలిద్దరూ ఎంబిబీఎస్ పూర్తి చేశారు. వివాహమైన ఏడాది తర్వాత భార్యాభర్తలిద్దరూ ఉన్నత చదువులకోసం దుబాయ్ వెళ్లారు. రెండు నెలల క్రితం దంపతులిద్దరూ స్వగ్రామానికి తిరిగి వచ్చారు. భార్యని, మూడేళ్ల కుమారుడిని తల్లిదండ్రుల వద్ద ఉంచి సోమశేఖర్ తిరిగి దుబాయ్ వెళ్లారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు సమాచారం.

బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అత్తమామలు బయట వరండాలో కూర్చొని ఉండగా దివ్య కుమారుడిని బయటకు పంపించి లోపల తాళం వేసుకున్నారు. గదిలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకున్నారు. బిడ్డ అమ్మ కోసం ఏడుస్తూ తలుపులు తడుతున్నాడు.

అది చూసిన అత్తమామ తలుపులు తట్టినా తీయకపోవడంతో స్థానికుల సాయంతో తెరిచి చూశారు. అప్పటికే దివ్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు. తల్లి మరణించిన విషయం తెలియని చిన్నారి అమాయకపు చూపులు చుట్టుపక్కల వారిని కంటతడి పెట్టించాయి.

Tags

Read MoreRead Less
Next Story