ఆన్‌లైన్‌లో క్షుద్రపూజలు.. అడ్డంగా దొరికిన యువకులు

ఆన్‌లైన్‌లో క్షుద్రపూజలు.. అడ్డంగా దొరికిన యువకులు
వాళ్లు పూజలు చేసిన స్థలంలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

మంత్రాలకు చింతకాయలు రాలవంటారు. అయినాసరే కొందరు ఇప్పటికీ మూఢనమ్మకాలను మాత్రం వీడడం లేదు. పైగా మంత్రాలు నేర్చుకోడానికి కొత్త కొత్త టెక్నిక్స్ ఫాలోఅవుతున్నారు. అందుకోసం టెక్నాలజీనే నమ్ముకున్నారు. ఆన్‌లైన్‌లో క్లాసులు నేర్చుకున్నట్లే... నలుగురు యువకులు ఆన్‌లైన్‌లో క్షుద్రపూజలు నేర్చుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో వెలుగు చూడడం సంచలనం రేపింది.

గోవిందపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు అర్ధరాత్రి శ్మశాన వాటికలో చేసిన హడావుడికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. నిశిరాత్రి వేళ ఏవేవో మంత్రాలు వినిపిస్తుండడంతో అటుగా వెళ్తున్నవాళ్లకు అనుమానం వచ్చింది. భయపడుతూనే దగ్గరికి వెళ్లి చూస్తే నలుగురు యువకులు క్షుద్రపూజలు చేస్తుండడంతో ఉలిక్కిపడ్డారు. ఈ విషయాన్ని స్థానికులకు ఫోన్‌లో తెలపడంతో వెంటనే వారంతా స్పాట్‌కు చేరుకున్నారు. యువకులను నిలదీయడంతో ఇంట్లో సమస్యలు తొలగిపోవడానికి పూజలు చేస్తున్నామంటూ బుకాయించారు.

యువకుల తీరు అనుమానాస్పదంగా ఉండడంతో గ్రామ పెద్దలను స్పాట్‌కు తీసుకెళ్లారు. వాళ్లు పూజలు చేసిన స్థలంలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. నలుగురిలో ఒకడైన ఇట్టి రాము... తన అత్తగారి ఫొటోతోపాటు ఆ పక్కనే మరో అమ్మాయి ఫొటో ఉంచి క్షుద్రపూజలు చేసినట్లు ఆధారాలు లభించాయి. రెండు నల్ల కోళ్లు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వంటివి అక్కడ దొరికాయి. ఎవరో ఫోన్లో మంత్రాలు చదివితే వీళ్లు అవే మంత్రాలు బిగ్గరగా చదువుతూ ఆ ఫొటోలపై పసుపు, కుంకుమ వేస్తూ రెండు కోళ్లను బలిచ్చినట్లు అంగీకరించారు. దీంతో స్థానికులు వారిని పోలీసులకు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story