Kerala: చర్చిలో వరుస బాంబు పేలుళ్లు..

Kerala: చర్చిలో వరుస బాంబు పేలుళ్లు..
ఒకరు మృతి, 35 మందికి గాయాలు

కేరళలో వరుస పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఎర్నాకుళంలో ఆదివారం ఉదయం వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఎర్నాకుళం-కొచ్చి జంట నగరాల సమీపంలోని కలమసేరిలో ఓ ప్రార్థనా మందిరం పేలుళ్లు వరుసగా జరిగాయి. ఉదయం 9.30 గంటలకు తొలి పేలుడు సంభవించగా.. కొద్ది వ్యవధిలోనే రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కలమసేరి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

కొచ్చికి ఈశాన్యంవైపు 10కి.మీల దూరంలో ఉన్న కలమస్సెరి అనే ప్రాంతంలోని యహోవా కన్వెన్షన్​ సెంటర్​ ఉంది. ఆదివారం ప్రార్థనల నేపథ్యంలో అనేక మంది అక్కడికి తరలివెళ్లారు. కాగా.. ప్రార్థనలు మొదలైన కొంతసేపటికి పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల సమయానికి కన్వెన్షన్ సెంటర్‌లో 2 వేల మందికిపైగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వైద్య సిబ్బందితో అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. పేలుడు తర్వాత భారీగా పొగ అలుముకోవడంతో పలువురు అస్వస్థతకు గురైనట్లు కనిపిస్తోంది. అక్కడంతా గందరగోళ పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.

గాయపడిన వారిలో పిల్లలు మరియు వృద్ధులు ఉన్నారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. క్రిస్టియన్ ప్రార్థనా మందిరాన్ని టార్గెట్ చేసుకుని.. బాంబు పేలుళ్లకు పాల్పడటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. పేలుళ్లలో గాయపడిన బాధితులను చికిత్స కోసం కలమసేరి ఆస్పత్రిలో చేర్పించారు. పెద్ద సంఖ్యలో బాధితుల చేరడంతో వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి కేరళ ప్రభుత్వం సెలవులు రద్దుచేసింది. సెలవులో ఉన్నవారు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. కొట్టాయం మెడికల్ కాలేజీ నుంచి కాలిన గాయాలకు చికిత్స చేసే వైద్య బృందాన్ని వెంటనే కలమస్సేరి మెడికల్ కాలేజీకి చేరుకోవాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశాలు జారీ చేశారు.ఇందులో ఉగ్రవాదం కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హమాస్‌పై ప్రతీకారంతో గాజా నగరంపై గత మూడు వారాలుగా ఇజ్రాయేల్ భీకర దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయేల్ సైన్యం ఇటీవలే భూతల యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దాడులకు నిరసనగా కేరళలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జరిగిన కొద్ది గంటల్లోనే ఓ చర్చిలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story