భర్తని చంపేసి.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించి.. ఐదు హత్యలు..సినిమాను తలపించే క్రైమ్

భర్తని చంపేసి.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించి.. ఐదు హత్యలు..సినిమాను తలపించే క్రైమ్
మనుషుల్ని హతమార్చడం.. ప్రమాదంగా చిత్రీకరించడం.

మనుషుల్ని హతమార్చడం.. ప్రమాదంగా చిత్రీకరించడం. అధికారులను, సిబ్బందిని మేనేజ్ చేసి.. అప్పనంగా బీమా సొమ్ము కాజేయడం. ఇదంతా.. ఓ జిల్లాలో బీమా సొమ్ము కాజేసే ముఠా తతంగం. రెండేళ్లకిందట.. పోలీసులు ఇలాంటి ముఠాల ఆట కట్టించి.. కటకటాల వెనక్కి నెట్టగా.. ప్రభుత్వ జీవిత బీమా సంస్థలో కొందరి వ్యవహారంపై సీబీఐ అంతర్గత విచారణ చేపట్టింది. బీమా సొమ్ము కాజేసేందుకు ముఠా దారుణాలు ఆలస్యంగా బయటపడ్డాయి.

నల్గొండ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పలువురి పేరిట బీమా చేయిస్తున్న ఓ ముఠా.. ఆ సొమ్ముకోసం అమాయకుల్ని హత్య చేస్తోంది. ఇలా బీమా డబ్బుల కోసం గత మూడేళ్లలో ఏకంగా ఐదారుగురిని దారుణంగా హత్య చేసి ప్రమాదాలుగా చిత్రీకరించింది. ఈ దందాలో దామరచర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. వీరితో పాటు కొన్నేళ్లుగా హత్యలకు సహకరిస్తున్న మొత్తం 17 మంది నిందితుల్ని నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఓ బీమా ఏంజెట్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరొ ఏజెంట్‌ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది.

బీమా ముఠా సభ్యులు ముందుగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యుల్ని ఒప్పించి వారి పేరుతో లక్షల రూపాయలకు బీమా చేస్తారు. ఒకట్రెండు కిస్తీలు తామే కడతారు. ఇందుకోసం నామినీలుగా ఉండే కుటుంబ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. కొన్ని నెలల తర్వాత అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ముఠా సభ్యులే చంపేసి.. యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తారు. పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ తీసుకుని.. బీమా క్లెయిమ్ చేసుకుంటారు. విచారణకు వచ్చిన థర్డ్ పార్టీ సభ్యులతో పాటు బ్యాంక్ సిబ్బందిని లంచాలతో మేనేజ్ చేస్తారు. వచ్చిన డబ్బుల్లో నామినీకి 20శాతం ఇచ్చి.. మిగిలినదంతా ముఠా సభ్యులు పంచుకుంటారు.

నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి... వారం రోజుల క్రితం నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన ట్రాక్టర్‌ ఢీకొని చనిపోయాడని భార్య కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియల సమయంలో కోటిరెడ్డి మృతదేహంపై ఉన్న పెద్దపెద్ద గాయాలను చూసిన అతడి తల్లిదండ్రులు.. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కోటిరెడ్డి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. పక్క గ్రామానికి చెందిన తన ప్రియుడితో కలిసి బీమా డబ్బుల కోసం తామే కోటిరెడ్డిని హత్య చేసి.. ట్రాక్టర్‌తో తొక్కించామని వెల్లడించింది.

కోటిరెడ్డి హత్యలో భాగస్వామిగా ఉన్న బీమా ఏజెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బీమా ఏజెంట్ మూడేళ్లుగా ఓ ముఠాను ఏర్పాటు చేసి ఐదుగురిని హత్య చేసినట్టు వెల్లడించాడు. మిర్యాలగూడలోని ఓ వ్యక్తిపై కోటి రూపాయల బీమా చేయించి యాక్సిడెంట్‌లో చనిపోయాడని నమ్మించినట్టు బయటపెట్టాడు. బీమా సొమ్ములో అతడి భార్యకు 20శాతం ఇచ్చి.. మిగిలినదంతా ముఠా సభ్యులు పంచుకున్నట్టు తెలిపాడు. 2018లో గుంటూరులోనూ 50లక్షల రూపాయల బీమా చేయించి.. ఓ వ్యక్తిని హతమార్చినట్టు పోలీసులకు తెలిపాడు. ఆ కేసులో అరెస్టయిన బీమా ఏజెంట్ బెయిల్‌పై వచ్చి.. మళ్లీ దురాగతాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story