సెక్యూరిటీ గార్డ్‌ మాస్టర్‌ప్లాన్‌..నైటీలో వచ్చి చోరీ

సెక్యూరిటీ గార్డ్‌ మాస్టర్‌ప్లాన్‌..నైటీలో వచ్చి చోరీ
హైదరాబాద్‌లో ఓ సెక్యూరిటీ గార్డ్‌ దొంగ అవతారం ఎత్తాడు. షాపు యజమానికి డౌట్‌ రాకుండా ముందే సెలవు పెట్టాడు. పోలీసులకు దొరకొద్దని మాస్టర్ ప్లాన్‌ వేశాడు కానీ బోల్తా పడ్డాడు

హైదరాబాద్‌లో ఓ సెక్యూరిటీ గార్డ్‌ దొంగ అవతారం ఎత్తాడు. షాపు యజమానికి డౌట్‌ రాకుండా ముందే సెలవు పెట్టాడు. పోలీసులకు దొరకొద్దని మాస్టర్ ప్లాన్‌ వేశాడు కానీ బోల్తా పడ్డాడు. అడ్డంగా దొరికిపోయాడు. మొబైల్‌ షాప్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న మంకాల యాకయ్య అలియాస్‌ వినయ్‌.. తన సోదరి నైట్‌లో వచ్చి దుకాణం తాళం పగులగొట్టాడు. 37 సెల్‌ఫోన్లతో ఉడాయించాడు. సీసీ కెమెరాల రికార్డుల ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని పట్టుకున్నారు.

అతడి నుంచి 8.28 లక్షల రూపాయలు విలువచేసే 37 రియల్‌మీ ఫోన్లు, ఒకట్యాబ్‌ స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మండలం మడిపల్లెకు చెందిన మంకాల యాకయ్య అలియాస్‌ వినయ్‌.. తండ్రి చనిపోవడంతో ఉపాధి కోసం తల్లి, సోదరితో కలిసి ఐదేళ్ల కిత్రం నగరానికి వచ్చాడు. కంటోన్మెంట్‌ తాడ్‌బండ్‌లోని బాపూజీనగర్‌లో ఉంటున్నాడు. సికింద్రాబాద్‌ ఎస్‌డీ రోడ్డులోని ఎమరాల్డ్‌ హౌస్‌లో సెక్యూరిటీగార్డు. రియల్‌మీ మరో మొబైల్‌ స్టోర్‌ సెక్యూరిటీ గార్డుగా గతంలో పనిచేశాడు.

ఇప్పుడు పనిచేస్తున్న ఎమరాల్డ్‌ హౌస్‌ మొదటి అంతస్తులోనూ ఒక రియల్‌మీ స్టోర్‌ ఉంది. ఈ షాపులో సీసీ కెమెరాలు పనిచేయట్లేదనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఈ ఏడాది మే 24-26 వరకు అక్కడ పరిసరాలను పరిశీలించి చోరీకి పథకం వేశాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ముందుగానే సొంతూరు వెళ్తున్నట్లు చెప్పి సెలవు పెట్టాడు. మే 28 రాత్రి 12.30 గంటల సమయంలో సోదరి నైటీ ధరించి రియల్‌మీ దుకాణానికి మరోవైపు మూసి ఉండే షట్టర్‌ తాళం పగులగొట్టి ట్యాబ్‌, ఫోన్లతో సొంతూరు వెళ్లిపోయాడు.

చోరీ జరిగినట్లు స్టోర్‌ ఇన్‌ఛార్జ్‌ మహ్మద్‌ యూసుఫ్‌.. మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ ఫుటీజీ పరిశీలించారు. నైటీలో ఓ మహిళ ఆ సమయంలో వెళ్లడం గుర్తించి అనుమానించారు. సెక్యూరిటీ గార్డులను విచారించారు. యాకయ్యపై అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం మహబూబాబాద్‌ మడిపల్లెలో నిందితుడిని అరెస్టు చేశారు. అక్కడే ఉంచిన సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story