ఎమ్మార్వో పై పెట్రోల్ పోసిన గిరిజనులు..!

ఎమ్మార్వో పై పెట్రోల్ పోసిన గిరిజనులు..!
విద్యుత్ షాక్‌తో మృతి చెందిన రైతుకు పరిహారం విషయంలో న్యాయం చేయాలంటూ గిరిజనులంతా డెడ్‌బాడీతో అక్కడ ఆందోళనకు దిగారు.

మెదక్ జిల్లా శివంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ షాక్‌తో మృతి చెందిన రైతుకు పరిహారం విషయంలో న్యాయం చేయాలంటూ గిరిజనులంతా డెడ్‌బాడీతో అక్కడ ఆందోళనకు దిగారు. ఓ దశలో సహనం కోల్పోయిన ఓ వ్యక్తి తనపై పెట్రోల్ పోసుకున్నాడు. ఎమ్మార్వో భాను ప్రకాష్‌పైన కూడా పెట్రోల్ చల్లాడు. దీంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడే ఉన్న మిగతావాళ్లు అతన్ని అడ్డుకుని ఎమ్మార్వోను అక్కడి నుంచి తీసుకెళ్లారు. గిరిజనులతో చర్చించేందుకు వచ్చిన ఎంపీపీని కూడా ఘెరావ్ చేశారు.

శివంపేట ఎమ్మార్వో పరిధిలోని తాళ్లపల్లి తండాలో రైతు మాలోత్ బాలూకి కొంత భూమి ఉంది. ఐతే దానికి పాస్‌బుక్ రాలేదు. ఎప్పటినుంచో దానికోసం తిరుగుతున్నా ఆ పని కాలేదు. తీరా ఇప్పుడు కరెంట్ షాక్‌తో అతను చనిపోయాడు. పాస్ బుక్ లేని కారణంగా రైతు బంధు పథకం అందకపోవడమే కాదు, రైతు ఇన్స్యూరెన్స్‌కి కూడా అనర్హుడయ్యాడు. ఇది తెలిసిన మిగతా రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తండాలో చాలా భూముల వివాదాలు పెండింగ్‌లోనే ఉన్నాయని వాటిని ఎమ్మార్వో పరిష్కరించడం లేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

డెడ్‌బాడీతో వచ్చి తహసీల్దార్ కార్యాలయం వల్ల ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగానే వాళ్లు పెట్రోల్ చల్లుకోవడంతోపాటు MROపైన పెట్రోల్ పోయడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు.


Tags

Read MoreRead Less
Next Story