గాంధీ ఆస్పత్రిలో దారుణం..అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం

గాంధీ ఆస్పత్రిలో దారుణం..అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం

ప్రతీకాత్మక చిత్రం

Gandhi Hosptial: హైదరాబాద్‌ నడిబొడ్డున వున్న గాంధీ ఆస్పత్రిలో జరగడం పెను సంచలనంగా మారింది.

రోగికి సాయంగా వచ్చిన అక్క చెల్లెళ్లపై మృగాళ్లు అత్యాచారానికి తెగబడ్డారు.. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ నడిబొడ్డున వున్న గాంధీ ఆస్పత్రిలో జరగడం పెను సంచలనంగా మారింది. ఆస్పత్రిలో తనపై, తన అక్కపై ఐదారుగురు గ్యాంగ్‌రే‌ప్‌కు పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన బావకు చికిత్స చేయించేందుకు గాంధీ ఆస్పత్రికి వస్తే.. అక్కడ తమకు మత్తు మందు ఇచ్చి ఆస్పత్రి సెల్లార్‌లో ఐదారుగురు లైంగికదాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. ఆస్పత్రి వెనుక అపస్మారక స్థితిలో వున్న ఆమెను కుటుంబ సభ్యులు గుర్తించడంతో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి తన అక్క ఆచూకీ కూడా గల్లంతయిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

మహబూబ్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి రెండు కిడ్నీలూ పాడైపోవడంతో ఈ నెల 4న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. రోగికి సాయంగా అతని భార్యతోపాటు, మరదలు ఆస్పత్రిలో వున్నారు. ఈనెల ఏడో తేదీ నుంచి పేషెంట్‌ భార్యతోపాటు.. ఆమె చెల్లెలి ఆచూకీ లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న పేషెంట్‌ కొడుకు వారి కోసం చుట్టుపక్కల గాలించాడు. ఆచూకీ లభించకపోవడంతో 11న తన తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు. ఆదివారం ఆస్పత్రిలో పనిచేస్తున్న తన బంధువు ఒకరు పేషెంట్‌ కుమారుడికి ఫోన్‌ చేసి అపస్మాకర స్థితిలో మీ పిన్ని వుందంటూ సమాచారం ఇచ్చాడు. దీంతో హుటాహుటిన అక్కడికి వెళ్లిన యువకుడు ఆరా తీయగా, జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. తనపై ఆస్పత్రిలో పనిచేసే బంధువు ఉమామహేశ్వర్‌, మరో ముగ్గురు నలుగురు అత్యాచారానికి పాల్పడినట్టు వివరించింది. కర్చీఫ్‌లో మత్తుమందు స్ప్రే చేసి నోటికి అదిమిపెట్టారని.. తాను స్పృహ తప్పాక సెల్లార్‌లోని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని చెప్పింది.

ఈ ఘటనపై మహబూబ్‌నగర్‌ పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా.. వారు ఈ కేసు తమ పరిధిలోకి రాదని చెప్పడంతో.. చివరకు చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఉమామహేశ్వర్‌పై రేప్‌ కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. బాధితురాలి అక్క ఆచూకీ తెలుసుకునేందుకు 4 స్పెషల్‌ టీమ్‌లు ఏర్పాటు చేశారు. అయితే, ఈకేసులో కొన్ని అనుమానాలు వున్నాయని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలు విచారణకు సహకరించడం లేదంటున్నారు. ఆ వారం రోజులు ఏం జరిగిందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అటు ఐదు రోజులుగా ఉమామహేశ్వర్‌ సరిగా విధులకు హాజరు కావడం లేదని విచారణలో తేలింది. మరోవైపు ఈ ఘటనపై ఆస్పత్రి ఆర్‌ఎంవోలు, ఇతర వైద్యులతో విచారణకు ఆదేశించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజలింగం తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలిస్తున్నామన్నారు. విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story